chalapati rao
-
సరదాగా ఎలాంటి నొప్పి తెలియకుండా వెళ్లిపోయారు
-
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
కళారంగంలో వికసించిన పద్మాలు యడ్ల, దళవాయి
రాజాం/ధర్మవరం రూరల్: రాష్ట్రంలోని శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు కళాకారులను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావును, తోలు బొమ్మ కళాకారుడు దళవాయి చలపతిరావును ఈ పురస్కారాలు వరించాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావు తన 14వ ఏట నాటక జీవితాన్ని ప్రారంభించారు. ఆయన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రక పాత్రకు పెట్టింది పేరు. కృష్ణుడి పాత్రలోనూ ఒదిగి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దేశవ్యాప్తంగా తెలుగు పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చి ప్రతిభ చాటుకున్నారు. 1950లో జన్మించిన గోపాలరావు మందరాడలో ప్రాథమిక విద్యను, శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాలలో 1967లో పీయూసీ పూర్తి చేశారు. ప్రెసిడెంట్ పట్టయ్య, పూలరంగడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పల్లెపడుచు మొదలైన సాంఘిక నాటకాల్లో హీరోగా మెప్పించారు. దేశం కోసం, పావలా, ఆగండి–కొంచెం ఆలోచించండి వంటి సాంఘిక నాటికలు కూడా ప్రదర్శించారు. శ్రీ బాలభారతి కళా నాట్యమండలి స్థాపించి అనేక కళాపరిషత్‌లు నిర్వహించారు. వర్ధమాన , ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు. 2010లో సత్యహరిశ్చంద్ర పద్యనాటకాన్ని వెండి తెరకు ఎక్కించారు. రంగస్థల కళాకారులతో రూపొందించిన ఈ సినిమా 2013లో రిలీజై విమర్శకుల మన్ననలు పొందింది. ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు సాక్షి, అమరావతి: పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు సాధించిన తెలుగువారిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. పద్మభూషణ్‌కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కళా రంగం నుంచి పద్మశ్రీకి ఎంపికైన యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులు భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తోలుబొమ్మ కళాకారునికి అరుదైన గౌరవం అంతరించిపోతున్న తోలుబొమ్మల కళను బతికిస్తున్న దళవాయి చలపతి అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన వారు. ఆయన పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వారు తోలుబొమ్మలతో గ్రామ గ్రామానా ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవారు. వారసత్వంగా ఈ కళలోకి ప్రవేశించిన దళవాయి చలపతి ఈ కళలో దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా చాటారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి రాష్ట్రపతి అవార్డుతో పాటు మరెన్నో జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అంతరించిపోతున్న తోలు బొమ్మలాటను కాపాడేందుకు దళవాయి చలపతి చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. -
చలపతిరావు కామెంట్‌పై రకుల్ ఫైర్
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ వేదికగా సీనియర్ నటుడు చలపతి రావు మహిళలపై వాడిన అసభ్య పదజాలంపై హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీటర్ ద్వారా స్పందించారు. ఆలస్యంగా స్పందించడానికి గల కారణాన్ని చెబుతూ.. చలపతి రావు చేసిన వ్యాఖ్య అర్ధం తనకు తెలియదని మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ఆ విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. చలపతిరావు చేసిన కామెంట్‌కు అర్ధం తెలిసివుంటే స్టేజ్ మీదే సమాధానం ఇచ్చేదాన్నని, ఆ కామెంట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ సీనియర్ నటుడిగా ఆయనకు ఉన్న స్ధానాన్ని, వయసును గుర్తు పెట్టుకుని మాట్లాడివుంటే బాగుండేదని అన్నారు. మహిళలపై అలాంటి పదజాలాన్ని వినియోగించడం వల్ల తోటి వారిని తప్పుడు మార్గంలో ప్రోత్సహించినట్లు ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. అయితే, చలపతిరావు మాట్లాడుతున్న సమయంలో తాను, నాగచైతన్య స్టేజ్‌పై నవ్వడానికి కారణం ఆయన చేసిన కామెంట్ కాదని తెలిపింది. ఇదే విషయంపై హీరో నాగ చైతన్య కూడా ట్వీటర్ ద్వారా స్పందించారు. తాను నవ్వడానికి కారణం వేరే ఉందని తెలిపారు. అబ్బాయిలే విషపూరితం ప్రస్తుతం టాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్లలో రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. రకుల్, నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'రారండోయ్ వేడుకచూద్దాం' ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చిత్ర విశేషాలను పంచుకుంది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అనే చైతూ డైలాగ్పై మాట్లాడుతూ తన ఉద్దేశంలో అబ్బాయిలు విషపూరితం అని వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి దర్శకుడు సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ. దీంతో మరోసారి నాగ్ కుటుంబానికి కృష్ణ బ్రేక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. #respectwomen pic.twitter.com/mXYZCvMPwI — Rakul Preet (@Rakulpreet) 23 May 2017 -
జనం మెచ్చిన జర్నలిస్టు
‘చలపతిరావు భారతదేశంలో అత్యంత సమర్థుడైన పాత్రికేయుడు, అతడి నైతిక ప్రవర్తన ప్రశ్నించడానికి వీలులేనిది’ అన్నారు జవహర్లాల్ నెహ్రూ. నేషనల్ హెరాల్డ్ పత్రిక రజతోత్సవాలు(1963) లక్నోలో జరిగినప్పుడు నెహ్రూ పైవిధంగా కితాబునిచ్చారు. నెహ్రూ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ అనగానే సంపాదకుడు ఎంసీ (మనికొండ చలపతిరావు) గుర్తుకు వస్తారు. ఎంసీయే నేషనల్ హెరాల్డ్గా, నేషనల్ హెరాల్డ్ ఎంసీగా వర్ధిల్లింది. ఆంగ్ల పత్రికారంగాన్ని నాలుగు దశాబ్దాలపాటు శాసించిన మహావ్యక్తి. చరిత్ర, సాహిత్యం, రాజనీతిశాస్త్రాల్లో ఆయన నిష్ణాతుడు. సాహితీవేత్త, మానవతావాది. భారతీయ జర్నలిస్టుల ఉద్యమానికి శంఖారావం పూరించింది ఆయనే. ప్రతిరంగంలో విశేష పరిజ్ఞానం, అభినివేశం, స్పష్టమైన చారిత్రక దృక్పథం, ఆంగ్లభాషపై మంచి పట్టు ఎంసీని మేరునగధీరునిగా నిలిపింది. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఎంసీ శ్రీకాకుళం చిన్న బజారులోని మాదివారి సందు కోవెల సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో 1908, ఆగస్టు 11న జన్మించారు. అయితే ఆయన బాల్యం, యవ్వన దశకు విశాఖపట్నం వేదిక అయింది. ఎంఏ (ఆంగ్లం), బీఎల్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేశారు. విశాఖలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ‘ఎథేనియం’ అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించారు. దానికి ఎంసీ కార్యదర్శిగా, డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులుగా ఉండేవారు. మద్రాసు నుంచి వెలువడుతుండే ‘పీపుల్స్ వాయిస్’, అలహాబాద్‌కు చెందిన ‘వీక్ ఎండ్’ పత్రికకు సహాయ సంపాదకునిగా పని చేశారు. ‘త్రివేణి’ పత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రత్యేక కథనాలు రాసేవారు. 1938లో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను లక్నోలో ప్రారంభించారు. ఎంసీ సహాయ సంపాదకునిగా, సంపాదకీయ రచయితగా పనిచేశారు. 1942లో ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల ప్రభుత్వ నిషేధానికి గురైనప్పుడు హిందుస్తాన్ టైమ్స్’లో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1945లో తిరిగి ఢిల్లీలో ప్రారంభమైన ‘నేషనల్ హెరాల్డ్’లో చేరి, ఆ మరుసటి ఏడాది సంపాదకునిగా పదోన్నతి పొందారు. నెహ్రూ ఉపన్యాసాలను ఖరారు చేయడంలో ఎంసీదే కీలక భూమిక. అయితే డెస్క్‌లో కూర్చున్నప్పుడు పలు సందర్భాల్లో నెహ్రూ అభిమతానికి భిన్నంగా సంపాదకీయాలు రాసిన సాహసి ఆయన. ఓ సారి నెహ్రూ ప్రశ్నిస్తే ఎంసీ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన రాజీనామా లేఖను జేబులో ఉంచుకుని కార్యాలయానికి వెళ్లేవారు. కానీ నెహ్రూకు ఆయన పట్ల సానుకూల దృక్పథమే ఉండేది. అంతరాత్జీయ సమస్యలపైన, వర్తమాన రాజకీయ పరిస్థితులు, పరిణామక్రమంపైన, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలను బేరీజు వేయడంలోను, ఆయన సాధికారిక వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో సంచ లనం రేకెత్తించాయి. పత్రికా రచయితల సంక్షేమం, హక్కుల పరిరక్ష ణకు 1950లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) సంస్థను స్థాపించారు. 1959 వరకు దానికి జాతీయ అధ్యక్షు నిగా ప్రముఖ ప్రాత పోషించారు. 1952లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎంసీ ప్రధాన కారకుడు. ‘ది ప్రెస్ ఆఫ్ ఇండియా’’ ‘‘ది ప్రెస్ అండ్ ది రొమాన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్’’ ఫ్రాగ్మంట్స్ ఆఫ్ ఎ రివల్యూషన్’’ ‘‘గాంధీ అండ్ నెహ్రూ’’ వంటి గ్రంథాలను ఆంగ్లంలో రాశారు. పత్రికా రచన విధానాలపై ‘ఆఫ్ ది రికార్డు, మెన్ ఫ్రమ్ మేవార్’ పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంసీ 1983 మార్చి 25న న్యూఢిల్లీలో కారులో ప్రయాణం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్మృతి చిహ్నంగా హైదరాబాద్ జూబ్లీహాల్ కూడలి వద్ద 2007 డిసెంబర్ 31న ఎంసీ విగ్రహాన్ని నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. న్యాయస్థానాల తీర్పుల్లో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఎలాగో ఆంగ్ల సంపాదకీయ రచనల్లో ఎంసీ అంతటి గొప్పవారని మేధావులు పేర్కొంటారు. ఆయన జాతి గర్వించదగ్గ పాత్రికేయుడు. - (నేడు ఎం.చలపతిరావు 33వ వర్థంతి సందర్భంగా) వాండ్రంగి కొండలరావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9490528730