జనం మెచ్చిన జర్నలిస్టు
‘చలపతిరావు భారతదేశంలో అత్యంత సమర్థుడైన పాత్రికేయుడు, అతడి నైతిక ప్రవర్తన ప్రశ్నించడానికి వీలులేనిది’ అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ. నేషనల్ హెరాల్డ్ పత్రిక రజతోత్సవాలు(1963) లక్నోలో జరిగినప్పుడు నెహ్రూ పైవిధంగా కితాబునిచ్చారు. నెహ్రూ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ అనగానే సంపాదకుడు ఎంసీ (మనికొండ చలపతిరావు) గుర్తుకు వస్తారు. ఎంసీయే నేషనల్ హెరాల్డ్‌గా, నేషనల్ హెరాల్డ్ ఎంసీగా వర్ధిల్లింది. ఆంగ్ల పత్రికారంగాన్ని నాలుగు దశాబ్దాలపాటు శాసించిన మహావ్యక్తి. చరిత్ర, సాహిత్యం, రాజనీతిశాస్త్రాల్లో ఆయన నిష్ణాతుడు. సాహితీవేత్త, మానవతావాది. భారతీయ జర్నలిస్టుల ఉద్యమానికి శంఖారావం పూరించింది ఆయనే. ప్రతిరంగంలో విశేష పరిజ్ఞానం, అభినివేశం, స్పష్టమైన చారిత్రక దృక్పథం, ఆంగ్లభాషపై మంచి పట్టు ఎంసీని మేరునగధీరునిగా నిలిపింది. ఆయన ఆజన్మ బ్రహ్మచారి.
ఎంసీ శ్రీకాకుళం చిన్న బజారులోని మాదివారి సందు కోవెల సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో 1908, ఆగస్టు 11న జన్మించారు. అయితే ఆయన బాల్యం, యవ్వన దశకు విశాఖపట్నం వేదిక అయింది. ఎంఏ (ఆంగ్లం), బీఎల్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేశారు. విశాఖలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ‘ఎథేనియం’ అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించారు. దానికి ఎంసీ కార్యదర్శిగా, డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులుగా ఉండేవారు. మద్రాసు నుంచి వెలువడుతుండే ‘పీపుల్స్ వాయిస్’, అలహాబాద్‌కు చెందిన ‘వీక్ ఎండ్’ పత్రికకు సహాయ సంపాదకునిగా పని చేశారు. ‘త్రివేణి’ పత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రత్యేక కథనాలు రాసేవారు.
1938లో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను లక్నోలో ప్రారంభించారు. ఎంసీ సహాయ సంపాదకునిగా, సంపాదకీయ రచయితగా పనిచేశారు. 1942లో ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల ప్రభుత్వ నిషేధానికి గురైనప్పుడు హిందుస్తాన్ టైమ్స్’లో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1945లో తిరిగి ఢిల్లీలో ప్రారంభమైన ‘నేషనల్ హెరాల్డ్’లో చేరి, ఆ మరుసటి ఏడాది సంపాదకునిగా పదోన్నతి పొందారు. నెహ్రూ ఉపన్యాసాలను ఖరారు చేయడంలో ఎంసీదే కీలక భూమిక. అయితే డెస్క్‌లో కూర్చున్నప్పుడు పలు సందర్భాల్లో నెహ్రూ అభిమతానికి భిన్నంగా సంపాదకీయాలు రాసిన సాహసి ఆయన. ఓ సారి నెహ్రూ ప్రశ్నిస్తే ఎంసీ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన రాజీనామా లేఖను జేబులో ఉంచుకుని కార్యాలయానికి వెళ్లేవారు. కానీ నెహ్రూకు ఆయన పట్ల సానుకూల దృక్పథమే ఉండేది.
అంతరాత్జీయ సమస్యలపైన, వర్తమాన రాజకీయ పరిస్థితులు, పరిణామక్రమంపైన, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలను బేరీజు వేయడంలోను, ఆయన సాధికారిక వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో సంచ లనం రేకెత్తించాయి. పత్రికా రచయితల సంక్షేమం, హక్కుల పరిరక్ష ణకు 1950లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) సంస్థను స్థాపించారు. 1959 వరకు దానికి జాతీయ అధ్యక్షు నిగా ప్రముఖ ప్రాత పోషించారు. 1952లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎంసీ ప్రధాన కారకుడు. ‘ది ప్రెస్ ఆఫ్ ఇండియా’’ ‘‘ది ప్రెస్ అండ్ ది రొమాన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్’’ ఫ్రాగ్మంట్స్ ఆఫ్ ఎ రివల్యూషన్’’ ‘‘గాంధీ అండ్ నెహ్రూ’’ వంటి గ్రంథాలను ఆంగ్లంలో రాశారు. పత్రికా రచన విధానాలపై ‘ఆఫ్ ది రికార్డు, మెన్ ఫ్రమ్ మేవార్’ పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందింది.
ఎంసీ 1983 మార్చి 25న న్యూఢిల్లీలో కారులో ప్రయాణం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్మృతి చిహ్నంగా హైదరాబాద్ జూబ్లీహాల్ కూడలి వద్ద 2007 డిసెంబర్ 31న ఎంసీ విగ్రహాన్ని నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. న్యాయస్థానాల తీర్పుల్లో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఎలాగో ఆంగ్ల సంపాదకీయ రచనల్లో ఎంసీ అంతటి గొప్పవారని మేధావులు పేర్కొంటారు. ఆయన జాతి గర్వించదగ్గ పాత్రికేయుడు.
- (నేడు ఎం.చలపతిరావు 33వ వర్థంతి సందర్భంగా)
వాండ్రంగి కొండలరావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9490528730