
చలపతిరావు జీవితంలో విషాదాలు :
సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.
చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట.
ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.