యడ్ల గోపాలరావు, చలపతిరావు
రాజాం/ధర్మవరం రూరల్: రాష్ట్రంలోని శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు కళాకారులను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావును, తోలు బొమ్మ కళాకారుడు దళవాయి చలపతిరావును ఈ పురస్కారాలు వరించాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల గోపాలరావు తన 14వ ఏట నాటక జీవితాన్ని ప్రారంభించారు. ఆయన సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రక పాత్రకు పెట్టింది పేరు. కృష్ణుడి పాత్రలోనూ ఒదిగి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దేశవ్యాప్తంగా తెలుగు పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చి ప్రతిభ చాటుకున్నారు.
1950లో జన్మించిన గోపాలరావు మందరాడలో ప్రాథమిక విద్యను, శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాలలో 1967లో పీయూసీ పూర్తి చేశారు. ప్రెసిడెంట్ పట్టయ్య, పూలరంగడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పల్లెపడుచు మొదలైన సాంఘిక నాటకాల్లో హీరోగా మెప్పించారు. దేశం కోసం, పావలా, ఆగండి–కొంచెం ఆలోచించండి వంటి సాంఘిక నాటికలు కూడా ప్రదర్శించారు. శ్రీ బాలభారతి కళా నాట్యమండలి స్థాపించి అనేక కళాపరిషత్‌లు నిర్వహించారు. వర్ధమాన , ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు. 2010లో సత్యహరిశ్చంద్ర పద్యనాటకాన్ని వెండి తెరకు ఎక్కించారు. రంగస్థల కళాకారులతో రూపొందించిన ఈ సినిమా 2013లో రిలీజై విమర్శకుల మన్ననలు పొందింది.
‘పద్మ’ అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు
సాక్షి, అమరావతి: పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు సాధించిన తెలుగువారిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. పద్మభూషణ్‌కు ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కళా రంగం నుంచి పద్మశ్రీకి ఎంపికైన యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులు భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
తోలుబొమ్మ కళాకారునికి అరుదైన గౌరవం
అంతరించిపోతున్న తోలుబొమ్మల కళను బతికిస్తున్న దళవాయి చలపతి అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన వారు. ఆయన పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వారు తోలుబొమ్మలతో గ్రామ గ్రామానా ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవారు. వారసత్వంగా ఈ కళలోకి ప్రవేశించిన దళవాయి చలపతి ఈ కళలో దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా చాటారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి రాష్ట్రపతి అవార్డుతో పాటు మరెన్నో జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అంతరించిపోతున్న తోలు బొమ్మలాటను కాపాడేందుకు దళవాయి చలపతి చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment