CM YS Jagan Efforts Successful For Polavaram Funds Sanction By Central Govt - Sakshi
Sakshi News home page

ఫలించిన సీఎం జగన్‌ కృషి.. పోలవరం తొలిదశకు రూ.12,911 కోట్లు

Published Tue, Jun 6 2023 3:41 AM | Last Updated on Tue, Jun 6 2023 8:59 AM

CM Jagan efforts Successful for Polavaram Funds Sanction by Central - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ కృషి ఫలిం­చింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడు­దలపై కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.12,911.15 కోట్లు  ఇచ్చేందుకు అంగీకరించింది. బిల్లుల చెల్లింపులో  విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది. అలాగే,  ప్రాజెక్టుకు 2013–14 ధరలతో కాకుండా తాజా ధరలతో నిధులిచ్చేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) డైరెక్టర్‌ ఎల్‌కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు లేఖ రాశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా­రామన్‌ ఇందుకు ఆమోదం తెలిపారని ఆ లేఖలో పేర్కొన్నారు. 2013–14 ధరల ప్రకా­రం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్రమంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని కోరామన్నారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసి తొలిదశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ.10,000 కోట్లను అడ్‌హాక్‌గా (ముందస్తుగా) ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి 3న ఢిల్లీలో సీఎం జగన్‌ ప్రతిపాదించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లేనని కానీ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు.

2017–18 ధరల ప్రకారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఖరారుచేసిన రూ.55,656.87 కోట్లను ఆమోదించి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేసేటప్పుడు విభాగాల వారీగా పరిమితులు విధిస్తున్నారని, దాన్ని తొలగించి ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కూడా కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించారు. 

రూ.10,911.15 కోట్లు ఇవ్వాలని సీడబ్ల్యూసీ సిఫారసు ఫలితంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ దీనిపై స్పందించి ప్రాజెక్టు తొలిదశలో ప్రధాన డ్యామ్, కాలువల పనుల పూర్తికి, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖాధికారులను కోరారు. పోలవరం తొలిదశ పూర్తికి రూ.15వేల కోట్లు మంజూరు చేయాలని పీపీఏ ద్వారా కేంద్ర జలశక్తి శాఖకు గత ఏడాది జనవరి 10న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.  

పంకజ్‌కుమార్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ కుస్వీందర్‌ సింఘ వోరా రూ.10,911.15 కోట్లను ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. బిల్లుల చెల్లింపుల్లో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించాలని సూచించారు. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 4న సీఎం జగన్‌తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుకు తిన్నెలు కోతకు ఏర్పడ్డ భారీ అగాధాలను పరిశీలించారు. ఆ సమయంలో డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, భారీ అగాధాలను పూడ్చివేసి యధాస్థితికి తేవడానికి చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సీఎం జగన్‌ చేసిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు.

ఈయన ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో సీడబ్ల్యూసీ, డీడీఆర్‌పీ, ఎన్‌హెచ్‌పీసీ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణుల బృందం డయాఫ్రమ్‌ వాల్, అగాధాలను పూడ్చివేసి యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఖరారు చేశాయి. ఇందుకు రూ.2,020.05 కోట్ల వ్యయమవుతుందని తేలుస్తూ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక సమర్పించాయి.

వీటిని పరిగణనలోకి తీసుకున్న పంకజ్‌కుమార్‌ తొలిదశ పూర్తికి రూ.10,911.15 కోట్లు, డయాఫ్రమ్‌ వాల్, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టడానికి రూ.2,000 కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు పోలవరానికి మంజూరు చేయాలని చేసిన సిఫార్సును కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది.
 
దశల వారీగా పోలవరంలో నీటినిల్వ..
పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలిఏడాది దాని పూర్తి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటి నిల్వచేయాలి.

ఈ సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంలోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్లలో నీటిని నిల్వచేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటి నిల్వచేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement