Eenadu Ramoji Rao Fake News On Polavaram Project And YS Jagan Govt - Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం? 

Published Mon, Apr 3 2023 2:30 AM | Last Updated on Mon, Apr 3 2023 11:07 AM

Eenadu Ramoji Rao Fake News On Polavaram YS Jagan Govt - Sakshi

తప్పు ఎవరు చేసినా దాన్ని ఎత్తిచూపడం నిఖార్సయిన జర్నలిజం. అస్మదీయుడైన చంద్రబాబు చేసిన తప్పును తస్మదీయుడైన సీఎం వైఎస్‌ జగన్‌పై నెట్టేసి.. అదే నిజమని ప్రజలను నమ్మించడానికి పదే పదే విషం చిమ్మడం ‘ఈనాడు’ రామోజీరావు మార్క్‌ పాత్రికేయం.
 
కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016లో దక్కించుకున్న తక్షణమే... రామోజీ వియ్యంకుడి సంస్థ నవయుగకు రూ.2,917.78 కోట్లు విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టేశారు చంద్రబాబు. మిగిలిన కొన్ని పనులను యనమల బావమరిది సుధాకర్‌ యాదవ్‌కు పంచేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు.
 
సులభంగా చేయగలిగి... త్వరగా అధిక లాభా­లు మిగిలే పనులనే చేపట్టిన చంద్రబాబు... రామోజీరావు, ఆయన వియ్యంకుడితో కలిసి ప్రజాధనాన్ని డీపీటీ(దోచుకో పంచుకో తినుకో) విధానంలో కాజేశారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారంటే.. వీళ్లెంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ దోపిడీ వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి.

ఇదే పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం జరగడానికి కారణమైంది. మానవతప్పిదం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నదని సాక్షాత్తూ ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ, డీడీఆర్పీ నిపుణులే తేల్చి చెప్పారు. ఆ మానవుడు చంద్రబాబేనని కూడా అందరికీ తెలుసు. కానీ రామోజీరావు మాత్రం ఒక్క ముక్క కూడా రాయరు. ఎందుకంటే తన వియ్యంకుడి పేరు బయటికొస్తుంది కాబట్టి!!. పైపెచ్చు తప్పంతా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదేనన్నట్లుగా పదే పదే విషపు రాతలు!!.మరీ ఇంత దుర్మార్గమా?
 
చంద్రబాబు పాపాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. ప్రణాళికాయుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న ‘ఈనాడు’ కథనంలో డొల్లతనం ఇదిగో...
 
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం బహుళార్ధక సాధక జాతీయ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. ప్రాజెక్టు పూర్తి చేయటంకన్నా జేబులు నింపుకోవటం పైనే దృష్టిపెట్టిన బాబు గ్యాంగ్‌ వైఖరితో ప్రాజెక్టు అస్తవ్యస్తమయింది. పరిస్థితిని చక్కదిద్దుతూ... ఆ సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికాబద్ధంగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులేస్తుండటం రామోజీరావుకు మింగుడుపడటం లేదు. అభూత కల్పనలు, అవాస్తవాలతో పదే పదే ‘కలం’కూట విషం చిమ్ముతున్నారు.  

నిజానికి ఈ రాతలను జాగ్రత్తగా చూస్తే... తమ డీపీటీ విధానానికి విఘాతం కలిగిందనే అక్కసు తప్ప మరోటి కన్పించదు. చంద్రబాబు చేసిన పాపాల వల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకున్న వైనాన్ని ఇటీవల శాసనసభలో ఆధారాలతో సహా సీఎం జగన్‌ వివరించారు. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు అగాధాలను పూడ్చడానికి రూ.2,022 కోట్లు వ్యయమవుతుందని.. ఇదంతా ప్రాజెక్టుపై అదనపు భారమేనని స్పష్టం చేశారు. 

పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు
► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. నాటి టీడీపీ ఎంపీ రాయపాటిని అడ్డంపెట్టుకుని పోలవరంలో ప్రజాధనాన్ని దోచేయడానికి స్కెచ్‌ వేసిన చంద్రబాబు, నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కోరుతూ వచ్చారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటంతో 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. 

► ఆ వెంటనే పోలవరం హెడ్‌ వర్క్స్‌లో రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.4,054 కోట్లను.. ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా రూ.5,386 కోట్లకు పెంచేసి.. అనుచితంగా రూ.1,332 కోట్ల ప్రయోజనం చేకూర్చారు చంద్రబాబు. ఆ తర్వాత 2016, డిసెంబర్‌ 30న పనులు ప్రారంభించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు.

► ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి రూ.2917.78 కోట్ల పనులను తప్పించి.. నిబంధలనకు విరుద్ధంగా లంప్సమ్‌ విధానంలో వాటిని నామినేషన్‌ పద్ధతిపై రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. సులభంగా చేయగలిగి.. అధికంగా లాభాలు వచ్చే స్పిల్‌ వే పునాది, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ వంటి మాస్‌ కాంక్రీట్‌ పనులను చేపట్టి.. నవయుగకు రూ.1675 కోట్ల బిల్లులు చెల్లించేసి.. భారీ ఎత్తున కమీషన్లు పంచుకు తిన్నారు.

► పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.71 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.182 కోట్లకు పెంచేసి... దాన్ని యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నామినేషన్‌పై ఇచ్చేశారు చంద్రబాబు. ఇదీ కథ.

జీవచ్ఛవంగా మార్చిన చంద్రబాబు..   జీవనాడిగా రూపునిస్తోన్న వైఎస్‌ జగన్‌
స్పిల్‌ వే
సాధారణంగా ఏ నీటిపారుదల ప్రాజెక్టులోనైనా... వరద నీటిని దిగువకు విడుదల చేసే స్పిల్‌ వేను నదికి అడ్డంగా కడతారు. నీటిని నిల్వ చేసే మట్టికట్టను నదికి ఆవల నిర్మిస్తారు. కానీ.. పోలవరం అలా కాదు. దీని నిర్మాణ ప్రాంతంలో ఉన్న భూభౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)... 194.6 టీఎంసీలను నిల్వచేసే ప్రధాన డ్యామ్‌ అయిన రాతిమట్టికట్ట(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌– ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌)ను నదికి అడ్డంగానూ.... నదీ తీరానికి ఆవల కుడి వైపున స్పిల్‌ వేను నిర్మించేలా డిజైన్‌ను రూపొందించింది.  మరి ఈ ప్రాజెక్టును  ఎలా నిర్మించాలి? కానీ చంద్రబాబు ఎలా నిర్మించారు? దానివల్ల జరిగిన నష్టమేంటి? ఆ నష్టాన్ని పూడుస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఏం చేస్తున్నారు? అనేవి ఒకసారి చూద్దాం...

గోదావరికి అడ్డంగా ప్రధాన డ్యామ్‌ నిర్మించాలంటే తొలుత గోదావరి తీరానికి ఆవల కుడి వైపున 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో స్పిల్‌ వే నిర్మించాలి. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను దానికి ఏర్పాటుచేయాలి. 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్‌ వ్యవస్థను గేట్లకు ఏర్పాటు చేయాలి. తొలుత ఈ పనులు పూర్తి చేయాలి. అలా చేస్తే ఎంత వరద వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. 

కానీ.. 2016, డిసెంబర్‌ నుంచి 2019, మే మధ్య కేవలం పునాది స్థాయికి మాత్రమే చంద్రబాబు దీని పనులు చేశారు. ఇందులో ఎక్కువ కమీషన్లు రావని... అక్కడితో వదిలేసి, సులువుగా పూర్తయ్యే... ఎక్కువ కమీషన్లు వచ్చే మిగతా పనులపై ఫోకస్‌ పెట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. కేంద్రం నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నా... రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేసి 2021, జూన్‌ నాటికి 48 గేట్లతో సహా స్పిల్‌ వేను నూరుశాతం పూర్తి చేశారు. 

స్పిల్‌ చానెల్‌
స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదలయ్యే వరద నీటికి నదిలోకి కలపడానికి 2.764 కి.మీ.ల పొడవున.. 1100 మీటర్ల వెడల్పుతో స్పిల్‌ చానెల్‌ను నిర్మించాలి. స్పిల్‌ వే పూర్తయ్యేలోగా ఈ పనులు కూడా పూర్తి చేయాలి. 2016, డిసెంబర్‌ నుంచి 2019, మే మధ్య స్పిల్‌ చానెల్‌లో కాంక్రీట్‌ను కుప్పగా పోసే పనులను చంద్రబాబు చేపట్టారు. కాంక్రీట్‌ పోసినందుకు ఘనపుటడుగుల చొప్పున కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించవచ్చు కనక ఎక్కువ కమీషన్లొస్తాయి. ఈజీ ప్లస్‌ లాభాలెక్కువ. అందుకే కాంక్రీట్‌ పోశారు తప్ప... ఇందులో కష్టతరమైన డౌన్‌స్ట్రీమ్‌ కటాఫ్‌ వంటి పనులు వదిలేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక స్పిల్‌ చానెల్‌ను నూరుశాతం పూర్తి చేశారు.

అప్రోచ్‌ చానెల్‌
నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే వైపు మళ్లించేలా 550 మీటర్ల వెడల్పుతో 2.310 కిమీల పొడవున అప్రోచ్‌ చానెల్‌ తవ్వాలి. స్పిల్‌ వే, స్పిల్‌ చానెల్‌ పూర్తయ్యే నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. కానీ.. ఐదేళ్లలో అప్రోచ్‌ చానెల్‌ పనుల్లో చంద్రబాబు తట్టెడు మట్టి కూడా ఎత్తించలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ పనులు నూరుశాతం పూర్తి చేశారు.

పైలట్‌ చానెల్‌
స్పిల్‌ చానెల్‌ మీదుగా వచ్చే వరద జలాలను నదిలోకి మళ్లించేందుకు 1.026 కిమీల పొడవున పైలట్‌ చానెల్‌ తవ్వాలి. ఈ పనులు కూడా చంద్రబాబు ముట్టుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అప్రోచ్‌ చానెల్, స్పిల్‌ వే, స్పిల్‌ చానెల్, ఫైలట్‌ చానెల్‌లను పూర్తి చేసి.. 2021, జూన్‌ 11న 6.1 కిమీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రపంచ చరిత్రలో నదీ సహజ ప్రవాహ దిశను ఇంత భారీ ఎత్తున మళ్లించడం ఇదే తొలి సారి. 

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 
ప్రధాన డ్యామ్‌ను నిర్మించడానికి వీలుగా దానికి ఎగువన గోదావరికి అడ్డంగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తుతో కాఫర్‌ డ్యామ్‌ (మట్టి కట్ట) నిర్మించాలి. ఇది నిర్మిస్తే నీరు నిలుస్తుంది. ఇలా నిలవటం వల్ల పలు గ్రామాలు మునిగిపోతాయి. అందుకే ఈ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులైన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది.

2018లో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టిన చంద్రబాబు... కేవలం రూ.484 కోట్లతో 3,110 కుటుంబాలకే పునరావాసం కల్పించారు. మిగతా 17,836 కుటుంబాలకు పునరావాసం కల్పించలేక.. ఈ మట్టికట్టకు కుడి వైపున 400 మీటర్లు, ఎడమ వైపున 400 మీటర్లు గ్యాప్‌లు వదిలేశారు. అలా... ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గాలికొదిలేశారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 8,567 కుటుంబాలకు రూ.1,677 కోట్లతో పునరావాసం కల్పించి.. 2021 నాటికే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. 

ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి వీలుగా స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదల చేసిన వరద నీరు ఎగదన్నకుండా అడ్డుకోవడానికి.. ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి దిగువన 1,655 మీటర్ల పొడవు... 30.5 మీటర్ల ఎత్తుతో లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. 2018లో చేపట్టిన చంద్రబాబు.. కుడి వైపు 680 మీటర్ల వెడల్పున ఖాళీ వదిలేశారు.

2019లో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ల గుండా అధిక ఉద్ధృతితో గోదావరి ప్రవహించడం వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల మధ్య ప్రాంతం కోతకు గురై 36 మీటర్ల లోతున భారీ అగాధం ఏర్పడింది. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక.. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధంలో వేసి పూడ్చుతూ వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యధాస్థితికి తెచ్చి.. ఫిబ్రవరి 15 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశారు. 

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ (ప్రధాన డ్యామ్‌)
దీన్ని మూడు భాగాలుగా... 2474.5 మీటర్ల పొడవున (గ్యాప్‌–1లో 584.5 మీటర్లు, గ్యాప్‌–­2­లో 1750 మీటర్లు, గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవు) 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో నిర్మించాలి. దీన్ని నిర్మించాలంటే  గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అంటే.. అప్రోచ్‌ చానెల్, స్పిల్‌ వే, స్పిల్‌ చానెల్, పైలట్‌ చానెల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేశాక... డ్యామ్‌కు పునాది అయిన డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలి. దానిపై ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టాలి. కానీ.. చంద్రబాబు వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా గ్యాప్‌–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించే పనులను బావర్‌ సంస్థకు నామినేషన్‌పై అప్పగించి... 2018 నాటికే పూర్తి చేసేశారు.

2019లో గోదావరికి భారీ వరదలు రావడం.. 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడం వల్ల.. దాని గ్యాప్‌ల గుండా 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి పెరిగింది. ఆ ఉద్ధృతికి గోదావరి గర్భం కోతకు గురై.. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల గరిష్ఠంగా 35 మీటర్లు.. కనిష్ఠంగా 22 మీటర్ల లోతుతో భారీ అగాధాలు  ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న దాఖలాలు లేవు.

చంద్రబాబు కక్కుర్తి కారణంగా తొలిసారి ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో డయాఫ్రమ్‌ వాల్‌ నష్టాన్ని పూడ్చడానికి నిపుణుల అధ్యయనం అవసరమైంది. ఒక వైపు డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చడంపై సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీలతో సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం జరుపుతూనే... గ్యాప్‌–2లో 393 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేసింది.

గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌ను సైతం పూర్తి చేసింది. గతనెల (మార్చి) 5న డయాఫ్రమ్‌వాల్‌ను సరిదిద్దడం, అగాధాలను పూడ్చటంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ కొన్ని మార్గదర్శకాలివ్వటంతో... వాటి ప్రకారం పనులు ఆరంభించి, ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 

రూ.20,398.61 కోట్లతోనే పూర్తి  చేయడం ఎలా?
► పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెప్టెంబరు 7న అంగీకరించడం.

► 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు తల ఊపింది కూడా చంద్రబాబే.

►  2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమోరాండంలో 2014, ఏప్రిల్‌ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని పునరుద్ఘాటించింది. పునరావాసాన్ని గాలికొదిలేసింది. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో టీడీపీకి చెందిన మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా ఉన్నా నోరు మెదపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

► ఇదే విషయాన్ని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ లేఖ ద్వారా తెలిపింది. కానీ దానికి చంద్రబాబు స్పందించలేదు. 

► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్‌ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–­18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.23 ఓట్లు. అలాంటిది కమీషన్ల మాయలో పడి కేవలం రూ.20,398 కోట్లిస్తే పూర్తి చేస్తామని చంద్రబాబు అంగీకరించటమే ప్రాజెక్టుకు శాపంగా మారింది.

► నిజానికి ఏ ప్రాజెక్టయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా అంచనా వేసిన వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికీ అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్‌ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం నాటి లేఖ ప్రస్తావనే తెస్తోంది. సవాలక్ష కొర్రీలు పెడుతోంది. ఇలా చంద్రబాబు చేసిన ద్రోహాన్ని... ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించకపోవటం అంతకన్నా పెద్ద ద్రోహం కాదా రామోజీ?

► 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని గత 45 నెలలుగా ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ, జల్‌ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్‌ జగన్‌ కోరుతూ వస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement