సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ సర్కారు పాపాలను దాచిపెట్టడం, వాస్తవాలను వక్రీకరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంలో రామోజీరావుది అందె వేసిన చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు, బిల్లుల చెల్లింపులో విభాగాలవారీగా విధించిన పరిమితులు తొలగించేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో చెప్పడంతో రామోజీరావు జీర్ణించుకోలేపోయారు.
చంద్రబాబు నిర్వాకం వల్ల ఏర్పడిన అడ్డంకులన్నీ సీఎం వైఎస్ జగన్ కృషి వల్ల తొలగుతుండటం, ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుండటాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన పాపాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైకి నెట్టేలా వాస్తవాలను వక్రీకరిస్తూ మంగళవారం ఓ కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో వీసమెత్తు నిజం లేదు. అసలు నిజాలివీ..
ఈనాడు ఆరోపణ: పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం మరోసారి బయటపడింది. సవరించిన అంచనాల విషయంలో అవసరమైన సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.
వాస్తవం: 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని 2020 డిసెంబర్‌లోనే పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. పీపీఏ సూచన మేరకు రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంటే... 41.15 మీటర్ల కాంటూర్ వరకు అవసరమైన నిధులు, 45.72 మీటర్ల వరకు నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే చేయాలి. ఇందులో 41.15 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు కావాలని 2022 జనవరి 10న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఆ తర్వాత నిర్వహించిన లైడార్ సర్వేలో 45.72 మీటర్ల పరిధిలోని 5,127 నిర్వాసిత కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాలని తేలింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తేవడానికి రూ.2 వేల కోట్లు కలిపి రూ.17,144 కోట్లు అవసరమని మే 4 న పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 45.72 మీటర్ల వరకు నిర్మాణానికి అవసరమైన నిధులు తేల్చడానికి సామాజిక ఆర్థిక సర్వే చేస్తూ, గ్రామ సభలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని పీపీఏ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖకు పంపుతోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఏప్రిల్ 16న పీపీఏకు పంపింది. ఇప్పుడు చెప్పండి రామోజీ.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ఎక్కడ ఉంది?
ఈనాడు ఆరోపణ: కన్‌స్ట్రక్షన్ (నిర్మాణ) షెడ్యూలును సవరించి రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది.
వాస్తవం: టీడీపీ సర్కారు నిర్వాకం వల్లే కన్‌స్ట్రక్షన్ షెడ్యూలు సవరణలో పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ చేష్టలుడిగాయి. ప్రాజెక్టు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి.. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టకుండానే 2018లో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు నిర్మించారు. దీంతో 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అనే అంశంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మేధోమథనం చేస్తున్నాయి. ఇది తేలితేగానీ కన్‌స్ట్రక్షన్ షెడ్యూలు ఖరారు చేయలేరు. ఈ పాపం చంద్రబాబుది కాదనగలరా రామోజీ?
ఈనాడు ఆరోపణ: 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి ఆమోదం రాష్ట్ర పొందలేకపోతోంది.
వాస్తవం: కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో చేతుల్లోకి తీసుకున్నదే చంద్రబాబు. 2016 సెప్టెంబరు 7న 2013–14 ధరల ప్రకారం పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం వద్ద అంగీకరించారు. కేవలం రూ.20,398 కోట్లతో ప్రాజెక్టు నీటి పారుదల విభాగం పనులను పూర్తి చేస్తానని ఆయన చెప్పడంతో.. ఆ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 2014 ఏప్రిల్ 1 నాటికి ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లను మినహాయించి మిగతా రూ.15,667.9 కోట్లను మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,218.78 కోట్లు వ్యయం చేసింది.
ఇందులో రూ.14,418.39 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. మరో రూ.1800.39 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాలి. ఈ పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి, విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించి. తాగునీటి విభాగానికి అయ్యే నిధులను కూడా ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment