సాక్షి, అమరావతి: కుక్కతోకలా తన బుద్ధి వంకరే అని ఎప్పటికప్పుడు ఈనాడు రామోజీరావు చాటిచెప్పుకుంటున్నారనడానికి మరో నిదర్శనం గురువారం ‘ఈనాడు’లో ‘అంకెల రంకెలు’ శీర్షికతో ప్రచురించిన కథనం. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పాల్పడిన పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల పోలవరాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తుంటే.. రాజకీయంగా చంద్రబాబుకు నూకలు చెల్లడం ఖాయమని రామోజీరావు తెగ ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా.. పోలవరంపై పూటకో అవాస్తవాన్ని వల్లెవేస్తూ.. వికృత రాతలతో రోజుకో కథనాన్ని అచ్చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా.. ‘అంకెల రంకెలు’కు సంబంధించిన వాస్తవాలు ఏమిటంటే..
ఆరోపణ: పోలవరం తొలిదశకు 2022, జనవరిలో రూ.10,911 కోట్లతో కేంద్రానికి అంచనాలు సమర్పించినా కొలిక్కి రాలేదు. తాజాగా.. తొలిదశ అంచనా రూ.16,952 కోట్లకు చేరింది. ఏడాదిన్నరలో కొన్ని అదనపు పనులు, అదనపు భూసేకరణ, అదనపు పునరావాసంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
వాస్తవం: సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం కొత్తగా నిర్మించే ప్రాజెక్టులో తొలి ఏడాది ఆ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు, మరుసటి ఏడాది 2/3వ వంతు.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలి. ఆ మార్గదర్శకాల ప్రకారం పోలవరాన్ని పూర్తిచేసి.. 41.15 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వచేసి.. ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ద్వారా> రైతులకు ముందస్తు ఫలాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇస్తే పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేసి.. ముందస్తు ఫలాలను రైతులకు అందిస్తామని 2022, జనవరి 3న సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.
ఆ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సూచనల మేరకు పోలవరం తొలిదశ అంటే 41.15 మీటర్ల కాంటూరు వరకూ పూర్తిచేయడానికి రూ.10,911.15 కోట్లతో 2022, జనవరి 10న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. కానీ, చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రణాళికారాహిత్యంతో చేపట్టిన పనులవల్ల 2019లో గోదావరి వరదల ఉధృతికి డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి.
వాటిని సరిచేయడానికి జాతీయ స్థాయిలో నిపుణులు, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వాటిని సరిదిద్దేందుకు విధానం ఖరారయ్యాక సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన పంపుతామని అప్పట్లోనే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇక పోలవరం తొలిదశ వ్యయ ప్రతిపాదనను పరిశీలించిన సీడబ్ల్యూసీ రూ.10,485.38 కోట్లు ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు 2022, ఏప్రిల్ 21న సిఫార్సు చేసింది.
ఈ క్రమంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ సూచన మేరకు పోలవరం ముంపుపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు లైడార్ సర్వే చేశారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని తేలింది. పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ అధికారులు డయాఫ్రమ్‌వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి, యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఖరారుచేశారు. ఆ పనులకు రూ.2,020.05 కోట్లు వ్యయమవుతుందని తేల్చారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై ఈ ఏడాది ఏప్రిల్ 10న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను రాష్ట్ర అధికారులు వివరించారు. 41.15 కాంటూర్ పరిధిలోకి అదనంగా చేరే 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడం, డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులతో కలిపి ప్రాజెక్టు తొలిదశ పూర్తికి సవరించిన అంచనాలను పంపాలని రాష్ట్ర అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు.
దాంతో 36 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం రూ.5,127 కోట్లు.. డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు అయ్యే వ్యయం రూ.2,020.05 కోట్లతో కలిపి తొలి దశ సవరించిన అంచనా రూ.16,952.07 కోట్లతో మే 4న పీపీఏ ద్వారా కేంద్రానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలిస్తే డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు అయ్యే రూ.2020.05 కోట్ల భారం చంద్రబాబు పాపమే.
ఇక కొత్తగా 41.15 మీటర్ల కాంటూర్‌లోకి చేరిన 36 గ్రామాలు.. గరిష్ట మట్టం 45.72 మీటర్ల పరిధిలోనివే. అంటే.. పునరవాసం కల్పించాల్సిందే. ఇదీ వాస్తవం. కానీ.. రామోజీరావు మాత్రం అవాస్తవాలను పోగేసి నిజాలను పాతరేసి అంచనా వ్యయం భారీగా పెరిగిపోయినట్లు కాకమ్మ కథలు అల్లి.. ప్రభుత్వంపై బురదజల్లేలా తప్పుడు కథనం అచ్చేశారు.
ఆరోపణ: 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయం (డీపీఆర్–2) రూ.55,548.87 కోట్లకు సీడబ్ల్యూసీ టీఏసీ 2019, ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. దాంతో డీపీఆర్–2 కొలిక్కివచ్చినట్లుగా భావించాలి. అలాంటిది వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడ్డాక టీఏసీ ఆమోదించిన అంచనాలపై కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ)ని ఏర్పాటుచేసింది.
ఆ కమిటీ రూ.47,725 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఆ డీపీఆర్‌పై జగన్ సర్కార్ పోరాడి నిధులను సాధించలేకపోయింది. ఈ క్రమంలో 41.15 మీటర్ల కాంటూర్‌లో నీటిని నిల్వచేయడానికి ఎంత వ్యయం అవుతుందో పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరడం, జగన్ సర్కార్ ఆ కోణంలో ముందుకు సాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవం: 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 141వ సమావేశంలో 2019, ఫిబ్రవరి 11న ఖరారుచేసింది. దీనిపై కేంద్రం 2019, ఏప్రిల్ 2న ఆర్‌సీసీని నియమించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు సర్కార్. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో ఆర్‌సీసీ ఏర్పాటుచేశారంటూ అవాస్తవాలను ‘ఈనాడు’ అచ్చేసింది.
కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దీనివల్లే 2017–18 ధరల ప్రకారం కేంద్రం నిధులు ఇవ్వడంలేదు.
భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని.. 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని.. డీపీఆర్–2ను ఆమోదించి.. 2017–18 ధరల ప్రకారం నిధులివ్వాలని ప్రధాని, కేంద్ర జల్‌శక్తి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులతో సమావేశమైన ప్రతి సందర్భంలోనూ సీఎం జగన్ కోరుతూ వస్తున్నారు.
రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇప్పించి.. కేంద్రమంత్రి మండలితో ఆమోదముద్ర వేయించి.. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీపీఆర్–2లో అంతర్భాగంగా తొలిదశ 41.15 మీటర్ల కాంటూర్ వరకూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి అయ్యే వ్యయాన్ని విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
ఆరోపణ: 45.72 మీటర్ల స్థాయి వరకూ పునరావాసం, భూసేకరణకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనుకంజ వేస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకోసం పోరాడకుండా.. తొలిదశ అంచనాలను సమర్పించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు సృష్టించే ఆస్కారం ఉందనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వాస్తవం: పోలవరాన్ని 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని.. ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గదని ఇటు సీఎం వైఎస్ జగన్ శాసనసభలో అటు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంట్‌లో స్పష్టంచేస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశంలో మార్చి 27న పార్లమెంట్‌లో షెకావత్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు.
45.72 మీటర్ల వరకూ భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అంటే 194.6 టీఎంసీలను నిల్వచేయడం కేంద్రం బాధ్యతని స్పష్టంచేశారు. ఇది వాస్తవం. కానీ, పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ వడివడిగా పూర్తిచేస్తుండటంతో చంద్రబాబుకు రాజకీయంగా నూకలు చెల్లవనే భయంతోనే రామోజీరావు ప్రజలను తప్పుదోవపట్టించేలా పదేపదే తప్పుడు రాతలు రాస్తున్నారు.
ఆరోపణ: పోలవరంలో నీటిని ఎత్తిపోసే అవసరమే లేదు. అలాంటిది ప్రస్తుతం రూ.వందల కోట్లు వెచ్చించి నీటిని ఎత్తిపోసే పరిస్థితులు ఏర్పడటం చర్చనీయాంశమవుతోంది.
వాస్తవం: ఈ పరిస్థితులు ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబు. కానీ, చంద్రబాబు తప్పును రామోజీరావు ఒప్పుకోరు. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేయకుండానే డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు నిర్మించారు. 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంవల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగుచోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి.
వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించింది. ఫిబ్రవరి 15 నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నిల్వఉన్న నీటిని తోడితేనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అగాధాలను పూడ్చి.. వైబ్రో కాంపాక్షన్ ద్వారా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టడం సాధ్యమవుతుంది.
Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’
Published Fri, Jun 2 2023 5:09 AM | Last Updated on Fri, Jun 2 2023 7:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment