challa darma reddy
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్ : రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దేవుని పేరుతో అకౌంట్ బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి రామాలయంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందన్నారు. రాముడిగుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదన్నారు. రాముడు అందరి వాడు హిందువైనా ప్రతి వారు రాముని పూజిస్తారని, రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా అని అన్నారు. బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే అన్నారు. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో 29వేలకోట్లు ఏం చేస్తారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేస్తుందని వరంగల్ ఎంపీ దయాకర్ అన్నారు. ఖాజీపేటలో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటుకు, వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట లో టెక్స్ టైల్స్ పరిశ్రమకు నిధులు కేటాయించేందుకు కేంద్రంపై వత్తడి చేస్తామని స్పష్టం చేశారు. ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి.. మరోవైపు ధర్మారెడ్డి వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడిచేసిన నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ కార్యకర్తుల చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. -
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
కారెక్కుతున్న చల్లా ధర్మారెడ్డి స్వయంగా ప్రకటించిన పరకాల ఎమ్మెల్యే నేడు జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర అయోమయంలో ‘తమ్ముళ్లు’ పరకాల టీఆర్ఎస్లో పెరిగిన నేతలు సాక్షిప్రతినిధి, వరంగల్ : కరెంట్ సరఫరా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర శనివారం జిల్లాలో జరగనుంది. బస్సు యాత్రకు సరిగ్గా ఒక్క రోజు ముందే టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఆకర్ష్‌తో టీడీపీకి మరో భారీ దెబ్బ పడింది. మంచి రోజు చూసుకుని త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు టీడీపీకి చెందిన పరకాల ఎమ్మెల్యే శుక్రవారం స్వయంగా ప్రకటించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు ధర్మారెడ్డి ప్రకటన ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ధర్మారెడ్డి వెంట ఎంత మంది వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత జిల్లాలోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కారెక్కుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం టీఆర్ఎస్లో చేరుతారని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. దీన్ని ఆయన స్పష్టంగా ఖండించారు. ఈ ప్రచారాన్ని తగ్గించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి పైనా, ప్రభుత్వంపైనా విమర్శలను పెంచారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ని అనువుగా మార్చుకునేందుకు ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర మొదలుపెట్టారు. శుక్రవారం నల్లగొండలో మొదలైన బస్సు యాత్ర శనివా రం మన జిల్లాకు చేరనుంది. టీడీపీ చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఈ యాత్ర లో పాల్గొననున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ బస్సు యాత్రే. ధర్మారెడ్డి మొదటి నుంచి దయాకర్‌రావుకు సన్నిహితుడు. కీలకమైన బస్సుయాత్ర సమయంలోనే ధర్మారెడ్డి... టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ ప్రణాళి కలు బాగున్నాయని ప్రశంసించడం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ధర్మారెడ్డి రాజ కీయప్రకటన బస్సుయాత్ర ప్రాధాన్యాన్ని తగ్గిం చేదిగా ఉందని టీడీపీ నేతలు వాపోతున్నారు. పరకాలలో నాలుగు స్తంభాలాట... చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ చేరడం ఖాయమైన నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరంగా ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అదే పార్టీలో చేరడంతో గులాబీ రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ముద్దసాని సహోదర్‌రెడ్డిపై చల్లా ధర్మారెడ్డి గెలిచారు. ప్రస్తుతం పరకాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తానేనని సహోదర్‌రెడ్డి చెబుతున్నారు. చల్లా ధర్మారెడ్డి చేరిక తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనే ఇన్‌చార్జ్‌అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు సహోదర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఎలా ఉంటారో వేచి చూడాల్సి ఉంది. 2009 ఎన్నికల వరకు పరకాల ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. పరకాల సెగ్మెంట్లో సుదీర్ఘకాలం ఆధిపత్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుకు ప్రతి గ్రామంలో కేడర్ ఉంది. ఇప్పుడు ఈ నలుగురు నేతలకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు, అనుచరులు క్షేత్ర స్థాయిలో ఎలా సర్దుకుంటారో త్వరలోనే తేలనుంది. కేసీఆర్ మాటే ఫైనల్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని బలోపేతం చేయడం కోసం కేసీఆర్ అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇతరల పార్టీల నుంచి వచ్చే వారితో మరింత బలం పెరుగుతుంది. మా పార్టీలోకి ఎవరు వచ్చినా... అభ్యంతరం లేదు. కేసీఆర్ ఏది చెప్పినా మాకు ఓకే. ఆయన మాటనే మాకు ఫైనల్. - మొలుగూరి బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం టీఆర్ఎస్ను బలోపేతం చేయడం కోసం కేసీఆ ర్ అందరిని కలుపుకుని పోతున్నారు. ముఖ్యం గా టీడీపీని నిర్మూలించడం కోసం కేసీఆర్ చేస్తు న్న చర్యలను స్వాగతిస్తున్నాం. 2001 నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలి. త్వరలో చేరబోయే ఎమ్మెల్యే టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసి న నాయకులకు ప్రాధాన్యమివ్వాలి. - ముద్దసాని సహోదర్‌రెడ్డి -
మీ సేవకుడిగా పనిచేస్తా..
పరకాల, న్యూస్‌లైన్ : ఈ గెలుపు నా ఒక్కడిది కాదు.. పరకాల నియోజకవర్గ ప్రజలదే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలిసారి శుక్రవారం పరకాల పట్టణానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పాలికారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు రేగూరి విజయపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను వమ్ము చేయను.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరువేస్తానని చెప్పారు. పక్క నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా పరకాల పట్టణంతోపాటు గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. చలివాగు బెల్టులోని కామారెడ్డిపల్లి, ధర్మారం, నడికూడ, రామకృష్ణాపూర్, ముస్త్యాలపల్లి గ్రామాల్లో లిప్ట్‌లు నిర్మించి గ్రామానికి వెయ్యి ఎకరాల చొప్పున సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజకీయ కక్షలు లేవు.. ఎలక్షన్లు లేవు.. ఐదేళ్ల పాటు మీ సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. 1979లో ప్రగతి సింగారం నుంచి సినిమా చూడడానికి ఇక్కడకు వచ్చాను.. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేదు.. గత పాలకులకు చూపిన వివక్షకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగడంతో విజయం చేరువైందని వివరించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ పరకాలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మిస్తామని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు చందుపట్ల జంగారెడ్డి మాట్లాడుతూ ఇంత ఎదురుగాలిలోనూ ధర్మారెడ్డి గెలుపొంది హీరోగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు చింతిరెడ్డి సాంబరెడ్డి, భీముడి నాగిరెడ్డి, వజ్ర రవికుమార్, ప్రకాశరావు, మేకల రాజవీరు, డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, దేవూనూరి మేఘనాథ్, కాంచం గురుప్రసాద్, మడికొండ ఆనంద్, పంచగిరి శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు ధార్మరెడ్డి సాయిబాబా, కుంకుమేశ్వర ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పట్టణంలో వియోత్సవ ర్యాలీ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఆర్టీసీ డిపో నుంచి విజయోత్సవ, కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జీ డాక్టర్ విజయచందర్‌రెడ్డి తదితర నాయ కులు ప్రత్యేక వాహనంలో ర్యాలీగా స్వర్ణగార్డెన్ కు చేరుకున్నారు.