Chandauli
-
పెళ్లి మండపంగా మారిన పోలీస్ స్టేషన్
లక్నో: కరోనా వచ్చినా, మరేదైనా ప్రళయమే వచ్చినా తమ పెళ్లి జరగాల్సిందేనని ఓ జంట కరోనా సాక్షిగా శపథం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ వంద షరతులు. దీంతో ఇవన్నీ కాదు కానీ అంటూ అన్నింటికన్నా సేఫెస్ట్ ప్లేస్ ఎంచుకుంది. ఎంచక్కా పైసా ఖర్చు లేకుండా అనుకున్న సమయానికి క్షణాల్లో పెళ్లి ముగించుకుంది. ఎక్కడనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్లో. అదెలాగో చదివేయండి.. ఉత్తరప్రదేశ్‌లోని మహుజీకి చెందిన అనిల్, ఘాజీపూర్‌కు చెందిన జ్యోతి ఏప్రిల్ 20న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. (పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి) అనుకున్న సమయానికి పెళ్లి జరిగిపోవాల్సిందేనని వారు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఓ చందౌలిలోని ధీనా పోలీస్ స్టేషన్ పెళ్లి మండపంగా మారింది. సోమవారం నాడు పోలీసుల సమక్షంలో ధీనా పోలీస్ స్టేషన్లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ వేద మంత్రాల మధ్య మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. గతంలో అనిల్ బోటు ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులను రక్షించాడని, అప్పుడు తామందరమూ అతని ధైర్యసాహసాలను కొనియాడామన్నారు. తాజాగా అతని పెళ్లి సమస్యను తమకు తెలపడంతో స్టేషన్లోనే జరిపేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల వైపు నుంచి ఐదుగురు చొప్పున మాత్రమే హాజరయ్యారని తెలిపారు. (ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి..) -
500 తీసుకోండి.. ఓటు వేయకండి!
లక్నో: తమను ఓటు వేయకుండా బీజేపీ అడ్డుకుందని ఉత్తరప్రదేశ్ చాందౌలీ లోక్‌సభ నియోజకవర్గంలోని తారాజీవన్‌పూర్ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తమ గ్రామానికి వచ్చి 500 రూపాయల చొప్పున పంపిణీ చేశారని, బలవంతంగా తమ చేతివేళ్లపై ఇంక్ చుక్క పెట్టారని తెలిపారు. ఓటు వేయడానికి వెళ్లొద్దని తమను ఒత్తిడి చేశారని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఓటు వేయకుండా చేయడానికి బీజేపీ రూ. 500 చొప్పున పంపిందని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొన్న నేపథ్యంలో తారాజీవన్‌పూర్ గ్రామస్తులు ఈ ఆరోపణలు చేశారు. ఓటర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తారాజీవన్‌పూర్ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, దర్యాప్తు జరిపిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు అధికారి కుమార్ హర్ష్ తెలిపారు. చాలా గ్రామాలకు బీజేపీ కార్యకర్తలను పంపి దళితులు ఓటు వేయకుండా మహేంద్రనాథ్ పాండే కుట్రలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్ చౌహాన్ ఆరోపించారు. గ్రామస్తుల చేతి వేళ్లపై బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంక్ చుక్కలు పెట్టారని తెలిపారు. బీజేపీ దురాగతాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
భవనం కూలి: 12 మంది మృతి
చందౌలి: ఉత్తరప్రదేశ్‌లో మొగల్ సరాయి ప్రాంతంలోని దుల్పూర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని జిల్లా ఎస్పీ మునిరాజ్ ఆదివారం వెల్లడించారు. వారిలో నలుగురు కార్మికులు కాగా మిగిలిన వారు ఇంటి యజమానితోపాటు అతడి కుటుంబసభ్యులేనని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్ కే సింగ్ ప్రకటించారు.