చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు.
చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది.
1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం)
2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం)
3. రోవర్
► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి.
► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి.
► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది.
► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు.
► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు.
► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది.
► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది.
► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది.
► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.
► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది.
► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది
► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది.
► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది.