బహుజనుల తెలంగాణ కోసం మరో ఉద్యమం
పరిగి, న్యూస్‌లైన్: దొరల నీడపడని బహుజనుల తెలంగాణ సాధనకోసం మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టఫ్) కో చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ను దోచుకున్న వారే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, వారికి సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఆంక్షలు లేని తెలంగాణ ను సాధించుకోవటమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు, కొందరు నాయకులు తమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, కళాకారులు, బహుజనుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. కొన్ని పార్టీలు ఇక్కడోమాట ఆంధ్రాలో ఓ మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్చి నిర్మిస్తే అభ్యంతరంలేదని అన్నారు.
ఇదే సమయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో సీమాంధ్రులు దోచుకున్న భూములు వదులుకునేది లేదని, అవసరమైతే నాగళ్లుకట్టి దున్ని తీరుతామని అన్నారు. ఈ నెల 8న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ, పీడీఎస్‌యూ, విద్యార్థి జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నారాయణ్‌రావు, సంతోష్, లక్ష్మి, రవీందర్, విజయల క్ష్మి, సర్దార్, రవికుమార్, వెంకటరాములు, విజయ్‌రావు, ముజీ బ్, మునీర్, పీర్‌మహ్మద్, సాయిరాంజీ, పాండు, రవి, బందయ్య, గోవింద్, వెంకట్ పాల్గొన్నారు.