cheatah halchal
-
అమ్మో చిరుత !
శెట్టూరు : మొన్న కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో చిరుత సంచారాన్ని మరువక ముందే తాజాగా శెట్టూరు మండలం యాటకల్లులో చిరుత సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. శుక్రవారం యాటకల్లు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు సమీపంలోని స్టోన్ క్రషర్ గుట్ట వద్దకు ఉపాధి పనులకు వెళ్ళారు. గుట్టపై మేత మేస్తున్న మేకలను పట్టుకోవడానికి చిరుత పై నుంచి రావడాన్ని గుర్తించిన పశువుల కాపరులు, గుట్ట సమీపంలోని కూలీలకు విషయాన్ని తెలిపారు. స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో మేకల కోసం వచ్చిన చిరుత గుట్టపైకి వెళ్లిందని కూలీలు చెప్పారు.ఏ క్షణాన ఏం జరుగుతుందోనని యాటకల్లు, అడవి గొల్లపల్లి గ్రామాల జనం ఆందోళన చెందుతున్నారు. -
కూడేరులో చిరుత సంచారం
కూడేరు : కూడేరులో సంగమేశ్వర స్వామి దేవాలయం - అరవకూరు గ్రామం మధ్య ఉన్న కొండ ప్రాంతంలో శనివారం చిరుతపులి కనిపించినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. గొర్రెలను మేపు కోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లగా దూరంగా చిరుత కనిపించిందని, కుక్కలు అరవడంతో వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. తాము ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గొర్రెలను కొండ నుంచి కిందకు తోలుకొచ్చేశామన్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
కలగళ్లలో చిరుత సంచారం
కూడేరు : మండల పరిధిలోని కలగళ్లలో సమీప పొలాల్లో చిరుత కనిపిస్తోంది గ్రామస్తులు, రైతులు బెంబేలెత్తుతున్నారు. మల్లికార్జున అనే రైతు తన పొలంలో ఆదివారం ఉండగా చిరుత కనిపించింది. దీంతో పరుగులు తీశాడు. పలువురు రైతులు రెండు రోజుల క్రితం కూడా పొలానికి వెళ్లినప్పుడు చిరుత కనిపించిందని అంటున్నారు. రైతులు తమ పొలాల్లో సాగు చేసుకున్న చీనీ, వేరుశనగ పంటలకు నీటిని అందించడానికి వెళ్తుంటారు. చిరుత వచ్చి ఎక్కడ దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి కాపాడాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.