chemical industries
-
ఊపిరాడక ఇద్దరి మృత్యువాత
రేణిగుంట (తిరుపతి జిల్లా): ఇక్కడి గాజులమండ్యం కెమికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గురువారం ఇద్దరు యువకులు కెమికల్ సింథటిక్ ట్యాంకును శుభ్రంచేస్తూ మృతిచెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. మండలంలోని పిల్లపాళెం దళితవాడకు చెందిన క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ కుమారుడు నరేంద్ర (23), గంగయ్య, చిన్నక్క కుమారుడు వెంకటేష్ (22) గాజులమండ్యంలోని సాయిరాధా బయోటెక్ కెమికల్ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఉన్న పెద్ద సింథటిక్ ట్యాంకును గురువారం మధ్యాహ్నం శుభ్రంచేసేందుకు తొలుత నరేంద్ర ట్యాంకులోకి ఇనుప నిచ్చెన వేసుకుని దిగాడు. ట్యాంకులోపల ఉన్న కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఘాటైన వాసన వెదజల్లడంతో దాన్ని పీల్చి క్షణాల్లో అపస్మారక స్థితికి చేరుకుని కిందపడిపోయాడు. పైనున్న వెంకటేష్ అతన్ని కాపాడేందుకు ట్యాంకులోకి దిగి అతను కూడా ఆ వాసన పీల్చాడు. దీంతో ఇద్దరూ ట్యాంకులో సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడున్న వారు ట్యాంకును పగలగొట్టి వీరిద్దరినీ బయటకు తీసి తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబీకుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు మృత్యువాత పడిన యువకులిద్దరికీ తల్లిదండ్రులు లేరు. నరేంద్ర తల్లిదండ్రులు క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ పదేళ్ల కిందటే మరణించగా.. అతన్ని చిన్నాన్న వెంకటరమణ చేరదీశాడు. మరో యువకుడు వెంకటేష్ తల్లిదండ్రులు గంగయ్య, చిన్నక్క కూడా కొన్నేళ్ల కిందట మృతిచెందడంతో వెంకటేష్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తూ బతుకుతున్నాడు. -
ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే
వెండితెరపై హీరో హీరోయిన్ల జోడీ బాగా కుదిరితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటారు. అచ్చంగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు, లాభాల మధ్య కెమికల్ షేర్ల విషయంలో ఏడాది కాలంగా చక్కని కెమిస్ట్రీ కుదురుతోంది. ఈ కెమికల్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. యాక్షన్.. రియాక్షన్ అణువులు పరమాణువులు అందులో ఉండే ఎలక్ట్రాన్ల మధ్య చర్యలతో కూడినదే కెమిస్ట్రీ. కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కొత్త పదార్థాలు పుట్టుకొస్తాయి. అదేవిధంగా ఎక్కడో చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ వ్యవహరాలు ఇండియాలో కెమికల్ షేర్ల ధరలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. ఏడాదిలో ఐదింతలు ఏడాది వ్యవధిలోనే దేశీ స్టాక్మార్కెట్లో ఐదు కెమికల్ కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది వ్యవధిలోనే కనీసం లక్షకు రెండు లక్షలు మొదలు ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు అందించాయి. ఐటీ, మెటల్, ఫైనాన్స్ కంపెనీలను వెనక్కి నెట్టి ముదుపరులకు అతి భారీ లాభాలను స్వల్ప కాలంలోనే కెమికల్ షేర్లు అందిస్తున్నాయి. అలా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన కొన్ని కంపెనీలు, వాటి షేర్ల ధరల వివరాలు ఇన్వెస్టర్ల ఇంట సిరుల పంట - బాలాజీ అమీన్స్ అనే కెమికల్ కంపెనీ 1988లో మార్కెట్లో లిస్టయ్యింది. అప్పటి నుంచి గతేడాది వరకు ఈ కంపెనీ షేరు విలువ సాధారణ స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కానీ గత ఏడాది వ్యవధిలో ఈ కంపెనీ షేరు విలువ 450 శాతం పెరిగింది. 2020 అక్టోబరు 20న ఈ కంపెనీ ఒక షేరు విలువ రూ. 816 ఉండగా 2021లో ఈ ధర అమాంతం పెరిగి రూ.4,488లకు చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ 14,525 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ ఫార్మా రంగానికి సంబంధించిన కెమికల్స్ తయారు చేస్తోంది. - గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీ 1987లో నోయిడా సమీపంలో స్థాపించారు. ఈ కంపెనీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్, కాస్టిక్ సోడా, క్లోరో మీథేన్ తదితర రసాయనాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ 2020 అక్టోబరులో రూ. 484 ఉండగా ప్రస్తుతం ఈ విలువ రూ. 2,167లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే కంపెనీ షేర్ వ్యాల్యూ 348 శాతం పెరిగింది. - దీపక్ నైట్రేట్ సంస్థ బల్క్ కెమికల్ కమోడిటీస్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేరు విలువ గతేడాది రూ. 716లు ఉండగా 2021 అక్టోబరు వచ్చేసరికి 298 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ. 2,852లుగా పలుకుతోంది. పెట్రోకెమికల్స్, అగ్రోకెమికల్స్, ఫార్మా తదితర రంగాలకు ఈ కంపెనీ నుంచి బల్క్ కెమికల్స్ వెళ్తుంటాయి. - ప్రివీ స్పెషాలిటీ కెమికల్ సంస్థ షేర్లు ఏడాది వ్యవధిలో 258 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరులో షేరు విలువ రూ.527లు ఉండగా ప్రస్తుతం అది రూ.1,891కి చేరుకుంది. ఏడాది వ్యవధిలో గరిష్టంగా రూ.2,070ని తాకగా కనిష్టంగా రూ.501కి పడిపోయింది. - అల్కైల్ అమీన్స్ సంస్థ పెయింట్స్, రబ్బర్, వాటర్ ట్రీట్మెంట్ తదితర రంగాలకు కెమికల్స్‌ని సరఫరా చేస్తుంది,. గతేడాది ఈ కంపెనీ షేరు విలువ రూ.1,228 ఉండగా ఏడాది కాలంలో 223 శాతం పెరిగి ప్రస్తుతం రూ.3970 దగ్గర ట్రేడవుతోంది. ఈ ఏడాది కాలంలో గరిష్టంగా రూ.4,749కి చేరుకోగా కనిష్టంగా రూ. 1,138కి పడిపోయింది. కారణం ఇదేనా? కరోనా విపత్తుతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కెమికల్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా అతి పెద్ద తయారీ, సరఫరాదారుగా ఉండేది. కానీ కరోనాతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం చైనా దిగుమతుల పట్ల సానుకూలంగా లేదు. దీంతో దేశీ కెమికల్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. బ్లూచిప్‌లను మించి మెరుగైన పనితీరు కనిపిస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీల్లోనే ఉన్నప్పటికీ ముదుపరులకు భారీ లాభాలు అందివ్వడంలో బ్లూచిప్ కంపెనీలను వెనక్కి నెడుతున్నాయి. చదవండి:9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..! -
పరవాడ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం
సాక్షి, పరవాడ: విశాఖ జిల్లా పరవాడ విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు పీల్చి ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాద బారిన పడిన కార్మికులు అప్పారావు, చంద్రమోహన్, శ్రీధర్‌లను గాజువాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణాలపై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారుచీకట్లో.. కమ్మేస్తున్న పొగలు
♦ విషం చిమ్ముతున్న పరిశ్రమలు ♦ ఘాటైన విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి ♦ రాత్రి అయ్యిందంటే నరకమే.. రాత్రి అయ్యిందంటే చాలు ఊపిరి ఆగిపోయినంత పనవుతోంది. ఘాటైన విష వాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతుండటంతో జనం తల్లడిల్లిపోతున్నారు. రాత్రి పది దాటితే చాలు.. సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, లెడ్ వంటి విష వాయువులను అడ్డగోలుగా వదలుతున్నారు. ఆరుబయట నిద్రించాలంటేనే జంకుతున్నారు. అసలే ‘మండు’ తున్న వేసవికాలం.. ఇంట్లో ఉక్కపోత.. బయట పొగల వాతతో నరకయాతన పడుతున్నారు. పారిశ్రామిక వాడలేకాక, జిల్లా అంతటా ఇదే దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి ఒక్క క్షణం ఉంటే తాము పడుతున్న బాధ తెలుస్తుందని స్థానికులు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడల్లో కంపెనీల యాజమాన్యం రెచ్చి పోతున్నాయి. రాత్రి అయితే చాలు.. ఫార్మా, స్పాంజ్, రసాయన పరిశ్రమల వాయు వ్యర్థాలను నేరుగా గాలిలోకి వదిలేస్తున్నారు. ప్రజా జీవనంపై అత్యంత ప్రభావం చూపే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, లెడ్ లాంటి విష వాయువులు ఇబ్బడిముబ్బడిగా విడుదలవుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పొగ గొట్టాల ద్వారా వాయువులను వదిలేస్తున్నారు. ఈ దొంగ తంతును నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి వేళలో వందలాది పరిశ్రమలు ఒకేసారి వాయువులను విడుదల చేయడంతో ఆ గాలులు పారిశ్రామిక వాడల పరిసరాలను దాటి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని తాకుతున్నాయి. ఆరుబయట పడుకుంటే.. రామచంద్రాపురం,పటాన్చెరు, జిన్నారం, సంగారెడ్డి, హత్నూరా, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలోని గ్రామాల జనం విష వాయువులతో తల్లడిల్లిపోతున్నారు. వేసవి కాలం కావటంతో ఇంట్లో ఉక్కపోతకు, ఆరుబయట పరిశ్రమల విష గాలులకు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందటానికి పల్లె ప్రజలు ఆరుబయట పడుకుంటారు. కానీ పరిశ్రమల నుంచి వస్తున్న విషపు గాలులతో ఆరుబయట పడుకునే పరిస్థితి లేదు. సరిగ్గా ఐదు నిమిషాలు నిలబడి గాలి పీల్చే పరిస్థితి లేదు. ఫార్మా, రసాయన కంపెనీల నుంచి వస్తున్న నైట్రోజన్ డై ఆక్సైడ్తో కళ్లు, ముక్కులు మండిపోతున్నాయి. ఆరుబయట పడుకుంటే తెల్లారే సరికి వాంతులు, విరోచనాలు , తీవ్రమైన చిరాకుకు లోనవుతున్నారు. ఇక్కడి గాలి అంతా విషమే... నిబంధనల ప్రకారం సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ 80 మైక్రో గ్రాముల వరకు మాత్రమే ఉండాలి, వాస్తవానికి అదికూడా ఎక్కువే. సీసం 1.5, కార్భన్ మోనాక్సైడ్ 5 మైక్రో గ్రామల వరకు ఉండొచ్చు. కానీ పాశం మైలారం, పటాన్చెరు, సంగారెడ్డి పారిశ్రామిక వాడలపరిసర ప్రాంతాల్లోని నివాస పల్లెల్లో సల్ఫర్ డయాక్సైజ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం 101 నుంచి 140 మైక్రో గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు పీసీబీ నివేదికలు చెబుతున్నాయి. సీసం, కార్భన్ మోనాక్సైడ్ పరిమాణం కూడా 5 మైక్రో గ్రామల కంటే ఎక్కువగానే ఉన్నట్లు రికార్డు అయింది. వాస్తవానికి ఈ నివేదికల్లో కూడా లోపాలు ఉన్నాయి. వాస్తవంగా పరిశ్రమల నుంచి వస్తున్న వాయు కాలుష్యాన్ని అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. యాజమాన్యాల ఇష్టారాజ్యం వాస్తవానికి వాయువుల విష గాఢతను అంచనా వేయడానికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ప్రతి ఫార్మా, రసాయన పరిశ్రమ పొగ గొట్టం చివరన కాలుష్య నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ శాస్త్రీయ పరికరాన్ని తాకుతూ పొగ వెళ్తే... ఆ పొగలో ఉన్న విష వాయువులు, వాటి పరిమాణంను గుర్తించి రికార్డు చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వాయు వ్యర్థాలను విడుదల చేసిన పరిశ్రమలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కంపెనీల యాజమాన్యం పొగగొట్టం మధ్యలోనే ఒక భారీ రంధ్రాన్ని ఏర్పాటు చేసి వాయువులను దారి మళ్లిస్తున్నారు. దీంతో విష వాయువుల గాఢత రికార్డు కాకుండా పోతోంది.