నరేంద్ర (ఫైల్) , వెంకటేష్ (ఫైల్)
రేణిగుంట (తిరుపతి జిల్లా): ఇక్కడి గాజులమండ్యం కెమికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గురువారం ఇద్దరు యువకులు కెమికల్ సింథటిక్ ట్యాంకును శుభ్రంచేస్తూ మృతిచెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. మండలంలోని పిల్లపాళెం దళితవాడకు చెందిన క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ కుమారుడు నరేంద్ర (23), గంగయ్య, చిన్నక్క కుమారుడు వెంకటేష్ (22) గాజులమండ్యంలోని సాయిరాధా బయోటెక్ కెమికల్ కర్మాగారంలో పనిచేస్తున్నారు.
ఫ్యాక్టరీలోని కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఉన్న పెద్ద సింథటిక్ ట్యాంకును గురువారం మధ్యాహ్నం శుభ్రంచేసేందుకు తొలుత నరేంద్ర ట్యాంకులోకి ఇనుప నిచ్చెన వేసుకుని దిగాడు. ట్యాంకులోపల ఉన్న కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఘాటైన వాసన వెదజల్లడంతో దాన్ని పీల్చి క్షణాల్లో అపస్మారక స్థితికి చేరుకుని కిందపడిపోయాడు. పైనున్న వెంకటేష్ అతన్ని కాపాడేందుకు ట్యాంకులోకి దిగి అతను కూడా ఆ వాసన పీల్చాడు. దీంతో ఇద్దరూ ట్యాంకులో సొమ్మసిల్లి పడిపోయారు.
అక్కడున్న వారు ట్యాంకును పగలగొట్టి వీరిద్దరినీ బయటకు తీసి తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబీకుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు చేపడతామని సీఐ తెలిపారు.
ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు
మృత్యువాత పడిన యువకులిద్దరికీ తల్లిదండ్రులు లేరు. నరేంద్ర తల్లిదండ్రులు క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ పదేళ్ల కిందటే మరణించగా.. అతన్ని చిన్నాన్న వెంకటరమణ చేరదీశాడు. మరో యువకుడు వెంకటేష్ తల్లిదండ్రులు గంగయ్య, చిన్నక్క కూడా కొన్నేళ్ల కిందట మృతిచెందడంతో వెంకటేష్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తూ బతుకుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment