సొంత నియోజకవర్గంలో హోం మంత్రికి నిరసన సెగ
రాజయ్యపేటలో ప్లకార్డులతో ఆందోళనకు దిగిన మత్స్యకారులు
ఏపీఐఐసీ భూసేకరణలో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గంలోని రాజయ్యపేటలో మత్య్సకారుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజయ్యపేట, పెదతీనార్ల, దొండ వాక గ్రామాల్లో సీఎస్‌ఆర్ నిధులతో హెటిరో కంపెనీ చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి వచ్చిన మంత్రికి మత్య్సకారులు ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ రాజయ్యపేటలో పలువురు మత్య్సకారులు హోం మంత్రితో వాగ్వాదానికి దిగారు.
రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారని హోం మంత్రి ప్రశ్నించగా.. మీరే కదా పలు సందర్భాల్లో నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంట్ రాబోతున్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు అని గుర్తు చేయడంతో ఆమె కంగుతిన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పొక్లెయిన్లతో పనులు ప్రారంభించారని, నిర్వాసితులకు నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. మంత్రిగా మీరు మత్య్సకారులకు అండగా ఉండాలన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద జిరయితీ భూముల్లో ఇళ్లు కోల్పోతున్న వారికి రూ.25లక్షలు, ఐదుసెంట్ల ఇంటి స్థలం, భూములు స్వా«దీనం చేసుకున్న నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఉపాధి నిమిత్తం రూ.15 లక్షల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి పునరావాసం ఎక్కడ కల్పిస్తారో చెప్పాలని డిమాండ్‌చేశారు. గతంలో వీటికి ప్రభుత్వం అంగీకరిస్తేనే భూములు ఇచ్చామని, తీరా ఇప్పుడు ఈ ప్యాకేజీల విషయం మాట్లాడకుండా భూములు స్వా«దీనం చేసుకుని ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించకుండా పనులు ప్రారంభించడానికి వీల్లేదన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ ఏపీఐఐసీ భూముల్లో ఏ కంపెనీలు ఏర్పాటు చేసినా ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే కంపెనీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment