హీరో పోలికల్లో లండన్ రాణి!
చైనీస్ కళాకారుడు డాపెంగ్ రూపొందించి.. ప్రదర్శించిన బ్రిటన్ రాణి మట్టిప్రతిమ... ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణిగా ఇటీవల రికార్డు సృష్టించిన రెండో ఎలిజబెత్ శిల్పం... లండన్ వింటర్ ఆర్ట్ అండ్ యాంటిక్ ఫెయిర్లో గత నెల్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆమె.. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ పోలికలతో ఉండటం విమర్శకులను ఆశ్చర్యపరచింది. ఆమె రూపాన్ని చూసి అంతా భయపడ్డారు.
అసలు ఆమె మహారాణిలాగానే కనిపించడం లేదన్నారు... ఆర్ట్ క్రిటిక్ మార్క్ హడ్సన్. తల వెనుక భాగం చాలా పెద్దగా ఉండి, బాక్సర్ గడ్డంతో చూసేందుకు టామ్ హాంక్స్లా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. నిజానికి మహారాణి ప్రతిమను తయారుచేసేందుకు కళాకారుడు డాపెంగ్ మూడునెలల సమయంలో 13 సార్లు మార్పులు చేర్పులు చేశాడన్నారు. 20 కేజీల బరువున్నశిల్పం.. ముఖం కూడా చాలా మందంగా కనిపిస్తోందని, జుట్టు మాత్రమే రాణి పోలికల్లో ఉందని విమర్శకులు అంటున్నారు.