Chennamaneni Vidyasagar rao
-
ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ ఓ రికార్డే. ♦ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ♦ 1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ. -
ఇద్దరూ కరీంనగర్ బిడ్డలే
సాక్షి, కరీంనగర్ డెస్క్: రాజకీయ ఉద్ధండులు పీవీ నరసింహారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఏకంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. మరొకరు గవర్నర్‌గా పనిచేశారు. మంథని నుంచి పీవీ.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. మెట్పల్లి నుంచి విద్యాసాగర్‌రావు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1983లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మెట్పల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలోకిదిగి విజయం సాధించారు. 1989, 1994 సంవత్సరాల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. -
అనర్గళ విద్యా ‘సాగరు’డు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్‌రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్‌రావు 2014 ఆగస్ట్ 30న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్‌రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్‌రావు. మొదటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్జీ’ ప్రస్థానంపై కథనం.. విద్యార్థి దశలో రచన, రాజకీయం.. విద్యాసాగర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్‌రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్‌రావు మాత్రం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి 12వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌పై పోటీ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్‌రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్‌రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన సోదరుడు రాజేశ్వర్‌రావు, తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్‌రావు మరోసారి ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా.. తెలంగాణ ప్రాంత సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు 2014లో బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర గవర్నర్‌గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. మాటల మరాఠీ.. విద్యాసాగర్‌రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్‌రావును ముద్దుగా ‘సాగర్జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం. కుటుంబమంతా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్‌రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్‌రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్ డాక్టర్. విద్యాసాగర్‌రావు పెద్దన్నయ్య రాజేశ్వర్‌రావు సీనియర్ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్‌రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్‌బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. సొంత డబ్బుతో స్కూలు, చెరువు.. నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు. 1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్ లేక్‌ను ఏర్పాటు చేశారు. - వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల -
భిన్న'దమ్ములు'
రెండు భిన్నమైన పార్టీలకు శాసనసభా పక్ష నేతలుగా వ్యవహరిస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వేర్వేరు పార్టీల తరుఫున ఇద్దరు అన్నదమ్ములు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, వారిద్దరూ శాసనసభలో రెండు పార్టీల పక్ష నేతలుగా వ్యవహరించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు సోదరులు. విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. రాజేశ్వర్‌రావు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని సోదరులు భిన్న ధృవాలుగా రాజకీయాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కమ్యూనిస్టు యోధుడిగా.. నిజాం వ్యతిరేకపోరాటంలో, తెలంగాణ విముక్తి ఉద్యమంలో రాజేశ్వర్‌రావు మడమ తిప్పని పోరాటాన్ని సాగించారు. తన భార్యతో కలిసి అజ్ఞాత జీవితం గడుపుతూ ఉద్యమంలో సాయుధ పోరాటం సాగించారు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)లో కీలకపాత్ర పోషిస్తూ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967, 1978, 1985 ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభసభ్యుడిగా ఎన్నికై సీపీఐ శాసనసభపక్ష నాయకుడిగా మూడుసార్లు వరుసగా అసెంబ్లీలో తన వాణి వినిపించారు. 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేశ్వర్‌రావు రైతు సంఘం జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా పని చేస్తూ అసెంబ్లీలో ఉన్నారు. ఆ సమయంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పువ్వాడ నాగేశ్వర్రావు సీపీఐ శాసనసభ పక్ష నేతగా కొనసాగారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షునిగా రాజేశ్వర్‌రావు పని చేశారు. 1999 ఎన్నికలకు ముందు సీపీఐకి రాజీనామా చేసి టీడీపీలో చేరి సిరిసిల్లలో పాపారావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన రాజేశ్వర్‌రావు వాగ్దాటిలో ఆయనకు ఆయనే సాటి. ఏదైనా అంశంపై శాసనసభలో రాజేశ్వర్‌రావు మాట్లాడుతున్నారంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపేవారు. అంతటి వాక్చాతుర్యం గల రాజేశ్వర్‌రావు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. ఆయన తనయుడు చెన్నమనేని రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా 2009, 2010, 2014లో వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. రాజేశ్వర్‌రావు 2016 మే 9న మరణించారు. రాజేశ్వర్‌రావు రాజకీయ వారసత్వాన్ని ఆయన తనయుడు రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్లో తొలి అడుగులు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు రాజేశ్వర్‌రావుకు స్వయానా సోదరుడు. 1978లో తొలిసారి మంథని నియోజకవర్గం నుంచి విద్యాసాగర్‌రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో విద్యాసాగర్‌రావు జనతాపార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు. 1980లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా కరీంనగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములను సహజంగా భావించిన విద్యాసాగర్‌రావు 1985లో మెట్పల్లి నుంచి మిత్రపక్షమైన టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి తొలివిజయాన్ని నమోదు చేసుకున్నారు. విద్యాసాగర్‌రావు అప్పటి నుంచి రాజకీయంగా మడమతిప్పకుండా ముందుకు సాగుతున్నారు. మెట్పల్లి నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఇదే సమయంలో చెన్నమనేని రాజేశ్వర్‌రావు సీపీఐ శాసన సభా పక్ష నేతగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే సభలో రెండు పక్షాలకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. 1995లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించి 1999లో మరోసారి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో వేములవాడలో ఎమ్మెల్యేగా నిలిచిన విద్యాసాగర్‌రావు సోదరుడు రాజేశ్వర్‌రావు తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓడిపోయారు. బాబాయ్‌ని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు నిలిచారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన విద్యాసాగర్‌రావు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలోపేతానికి కేంద్రమంత్రిగా కీలకపాత్రను పోషించారు. విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహరాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్టు నేతగా రాజేశ్వర్‌రావు, బీజేపీ నేతగా విద్యాసాగర్‌రావులు రాజకీయ చిత్రపటంలో తమదైన మార్క్‌ను చాటుకున్నారు. ఆర్థిక రంగ నిపుణుడిగా.. రాజేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావుల సోదరుడు డాక్టర్ చెన్నమనేని హనుమంతరావు ప్రణాళిక సంఘం సభ్యుడిగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) ఛాన్స్‌లర్‌గా పని చేశారు. హనుమంతరావు అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2014లో రాజీవ్‌గాంధీ సద్భావన పురస్కారాన్ని పొందారు. హనుమంతరావు ఆర్థిక రంగ నిపుణులుగా పేరుపొందారు. మరో సోదరుడు చెన్నమనేని వెంకటేశ్వర్రావు సీపీఐ నేతగా కొనసాగుతున్నారు. గతంలో సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) డైరెక్టర్‌గా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు రాజకీయాల్లో ఉండగా, ఒక్కరు ఆర్థికరంగ నిపుణులుగా పని చేస్తున్నారు. అన్నదమ్ములు నలుగురు తమదైన మార్గాల్లో కొనసాగడం విశేషం. -వూరడి మల్లికార్జున్,సాక్షి సిరిసిల్ల -
అండగా ఉంటా..
సాక్షి, ముంబై: రాష్ర్టంలోని తెలుగువారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తానని రాష్ర్ట గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో ఆయనను మంగళవారం వర్లీలోని తెలుగు సుధారక యువక సంఘం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు స్థానిక తెలుగు ప్రజల కష్టాలు, ఇబ్బందులు, సమస్యల గురించి సభ్యులు ఏకరువు పెట్టారు. ముంబై నగర నిర్మాణంలో తెలుగువారి పాత్ర కీలకమని మహారాష్ర్ట నాయకులు ఎప్పుడూ అనడమే తప్ప తమకు ప్రత్యేక గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో నివసిస్తున్న లక్షలాది తెలుగు ప్రజలకు మేలు చేస్తున్నట్లు చెబుతున్న కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఆ మేరకు చేతల్లో చూపిస్తోంది మాత్రం నామమాత్రమేనని వారు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ముంబైనుంచి కేవలం వీక్లీ రైళ్లను నడుపుతున్నారని చెప్పారు. అదీ కుర్లా నుంచి నడుపుతుండటంతో అధికశాతం తెలుగు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదని వారు గవర్నర్‌కు వివరించారు. ఆ రైలును రోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సదానంద గౌడ్‌తో మాట్లాడతానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే, మహారాష్ర్టలోని తెలుగు ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుంచో తాము పోరాటం చేస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ఫలితం కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక వర్లీ ప్రాంతంలో తెలుగుప్రజలను సమైక్యపరిచేందుకు తెలుగు భవనం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎప్పటినుంచో కోరుతున్నామని, అయితే ఇంతవరకు మంజూరు కాలేదని వారు వివరించారు. కాగా, ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు భాషతో రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ, తెలుగు ప్రజలందరూ ప్రాంతీయ విభేదాలు లేకుండా కలసికట్టుగా ఉండాలని, సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ర్ట గవర్నర్‌గా ఉన్నంతకాలం స్థానిక తెలుగు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే త్వరలో జరుగనున్న తెలుగు సుదర్శన్ యువక సంఘం స్వర్ణోత్సవాలకు తప్పక హాజరవుతానని గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. సుమారు 30 నిముషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు గుద్దేటి నారాయణ, ప్రధాన కార్యదర్శి భోగ సహదేవ్, ఉపాధ్యక్షుడు ఆసం రాజన్న, కోశాధికారి గాజెంగి రమేష్, కమిటీ సభ్యులు గుద్దేటి గణేష్, గుడ్ల మహేందర్, భోగ సత్యపాల్, గాజెంగి వెంకటేష్, లోలం భోజరాజ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణం
హాజరైన సీఎం పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి గడ్కారీ తదితరులు సాక్షి, ముంబై: మహారాష్ర్ట గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4.10 గంటలకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్‌షా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మహారాష్ర్ట నాయకులు హర్షవర్ధన్పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కిరిట్ సోమయ్య, సుధీర్ మునగంటివార్, నటి సైనా ఎన్సీ, చెన్నమనేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. యూపీఏ హయాంలో మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన శంకర్నారాయణన్ను ఎన్డీఏ ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించడంతో మిజోరమ్‌కు బదిలీ చేసింది. అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడని శంకర్నారాయణన్ ఏకంగా గవర్నర్ పదవికే రాజీనామా చేసిన విషయం విదితమే. -
30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.