సాక్షి, కరీంనగర్ డెస్క్: రాజకీయ ఉద్ధండులు పీవీ నరసింహారావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఏకంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. మరొకరు గవర్నర్‌గా పనిచేశారు.
మంథని నుంచి పీవీ..
పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది.
తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు.
1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
మెట్‌పల్లి నుంచి విద్యాసాగర్‌రావు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1983లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985లో మెట్‌పల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలోకిదిగి విజయం సాధించారు.
1989, 1994 సంవత్సరాల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో మహారాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment