cherlopalli
-
ఆ ఊరంటే 'కరోనాకు' హడల్
పుట్టపర్తి అర్బన్: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా ఉన్నాయి. మహమ్మారి విజృంభిస్తున్న వేళ అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి గ్రామస్తులు ఊరి నుంచి కాలు బయట పెట్టకుండా నిశ్చింతగా జీవిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలో సాతార్లపల్లి, గంగిరెడ్డిపల్లి, దిగువ చెర్లోపల్లి గ్రామాలుండగా.. కరోనా మొదటి, రెండో దశలోనూ ఒక్క కేసూ నమోదు కాకుండా ఇక్కడి ప్రజలు జాగ్రత్త పడ్డారు. ఊరు దాటి వెళ్లకుండా.. గ్రామ పంచాయతీ జనాభా సుమారు 2 వేలు కాగా.. విద్యార్థులంతా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా సచివాలయంలోనే పరిష్కరించుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పట్టణాలకు వెళ్లడం లేదు. అందువల్లే వైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. సేంద్రియ సేద్యం.. పౌష్టికాహారం దిగువ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వారంతా వేరుశనగ, కంది, వరి, మొక్కజొన్న, బంతి పూలు, తీగ జాతి కూరగాయ పంటల్ని అధికంగా సాగుచేస్తారు. అక్కడి రైతులకు దేశవాళీ ఆవులు, గేదెలు, ఎద్దులున్నాయి. వాటి నుంచి వచ్చే పేడ, అక్కడ దొరికే ఆకులతో తయారైన ఎరువులనే పంటలకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం బాగా తక్కువ. వీరంతా తాము పండించిన పంటలనే తినేందుకు వినియోగిస్తున్నారు. చికెన్ తినాలన్నా.. తాము సొంతంగా పెంచుకున్న నాటు కోళ్లనే వినియోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తి లేదు అదృష్టవశాత్తు మాకెవరకి కరోనా వైరస్ సోకలేదు. మా గ్రామాల్లో ఇతర రోగాల బారిన పడిన వారు కూడా చాలా తక్కువ. మేమంతా స్థానికంగా దొరికే వాటితోనే భోజనం సిద్ధం చేసుకుంటాం. అందువల్లే వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నాం. – లక్ష్మీనరసమ్మ, గంగిరెడ్డిపల్లి, అనంతపురం జిల్లా పట్టణాలకు వెళ్లకపోవడం వల్లే.. అటవీ గ్రామాల వారు దాదాపుగా బయటి ప్రదేశాలకు వెళ్లరు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినా స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోనే చూపించుకుంటారు. అందువల్లే వైరస్ సోకకుండా హాయిగా జీవనం గడుపుతున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. – అజయ్‌కుమార్‌రెడ్డి, వైద్యాధికారి, వెంగళమ్మచెరువు -
దంతులు ఇలా.. సాగు భళా
బత్తలపల్లి : ఎద్దులు లేవు..ఎద్దులున్న రైతులను బాడుగకు పిలిస్తే దంతులు పట్టడానికి ఎకరాకు రూ.300 అడుగుతున్నాడు..కలుపు తీయడానికి కూలీలకు రూ.100 ఇవ్వాలి. ఇలా అయితే తనకు ఇబ్బంది అని భావించిన ఓ రైతు వినూత్నంగా ఓ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి నారాయణరెడ్డి తనకున్న 15 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాడు. దంతులు పట్టడానికి ఎద్దులకు రూ.300, కూలీలకు ఒక్కొక్కరికి రూ.200 ఇవ్వాల్సి ఉంది. ఇలా అయితే 15 ఎకరాలకు మూడు రోజులు సమయం పడుతుంది. దీనివల్ల సమయం వృథాతో పాటు కూలీలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. కేవలం కూలీలతోనే కలుపు తీసే పని చేస్తే నాలుగు రోజులు పడుతుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నదే. దీంతో తన ట్రాక్టర్‌కు ఒక పైపును కట్టి ఆ పైపుకు 8 మంది కూలీలతో దంతులు పట్టాడు. 15 ఎకరాలు ఒక రోజులోనే ఐదు లీటర్లతో పూర్తి చేశాడు. కూలీలకు రూ.200 ప్రకారం కూలి డఽబ్బులు చెల్లించాడు. తద్వారా ఎద్దులకు ఇవ్వాల్సిన బాడుగతో పాటు సమయం కలిసోచ్చిందని రైతు అంటున్నాడు. దీంతో ఈ ప్రయోగంకు రైతులు సన్నద్ధమవుతున్నారు. -
కాపాలకెళ్లి.. కానరాని లోకాలకు
శెట్టూరు (కళ్యాణదుర్గం) : అడవి పందుల నుంచి రాత్రిపూట పంటను కాపాడటానికి కాపలాగా వెళ్లిన ఇద్దరు యువకులు పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు...శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రామలింగ, మల్లక్కల కుమారుడు రాజేష్ (17) ఇంటర్మీడియట్ పాసయ్యాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. వేరుశనగ పంటను అడవిపందులు ధ్వంసం చేయకుండా కాపలా కాసేందుకు తన బంధువు రాజుతో కలిసి కలిసి గురువారం రాత్రి తోటకు వెళ్లారు. బాగా పొద్దుపోయిన తర్వాత అక్కడే ఉన్న గుడిసెలో నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజేష్ కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. రాజేష్ శరీరంపై పాము కాట్లను గుర్తించి కుటుంబ సభ్యులు హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడి వైద్యులు సూచన మేరకు అటు నుంచి అనంతపురం తరలిస్తుండగా రాజేష్ మార్గం మధ్యలో మృతి చెందాడు. అంతలోనే ఇంటి వద్ద ఉన్న రాజుకు సైతం పాము కాటు వేసినట్లు తెలుసుకుని ఉదయాన్నే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. మంచి చదువులు చదవి మాకు పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటిమే.. పాము కాటు రూపంలో ఒక్కగానొక్క కుమారుడిని ఇలా తీసుకెళితివా..దేవుడా ఎంత పనిచేశావయ్యా’ అంటూ రాజేష్ తల్లి మల్లక్క, చెల్లెలు సుకన్య రోదించడం అందరినీ కలచివేసింది. -
చెర్లోపల్లిలో రెండు వర్గాల ఘర్షణ
- ఏడుగురికి గాయాలు - గ్రామంలో బందోబస్తు ఏర్పాటు పుట్టపర్తి అర్బన్ : మండలంలోని చెర్లోపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భూ వివాదం నేపథ్యంలో తగాదా జరిగి ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు రెండు వర్గాల వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు వివరించారు. గురువారం ఉదయమే రెండు వర్గాల వారిచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన హరికృష్ణ, దేవా, నరసింహుడు, లక్ష్మీదేవి, కుమారి తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన భాస్కర్, వనజ, విజయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయపరచినట్లు ఎస్ఐ తెలిపారు. భాస్కర్, విజయ్, ఆదినారాయణ కలసి హరికృష్ణ, కుమారి, నరసింహులు, లక్ష్మీదేవిపై రాళ్లు, కర్రలతో గాయపరిచినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ తెలిపారు. -
వధువు అదృశ్యం
పుట్టపర్తి అర్బన్ : పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. ఓ వధువు అదృవ్యం కావడం కలకలం రేపుతోంది. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి కథనం ప్రకారం... ఇదే మండలం చెర్లోపల్లికి చెందిన రఘునాథ్, రమాదేవి దంపతుల కుమార్తె హేమలత వివాహం నల్లమాడ మండలం నల్లశింగయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరమ్మ, నారాయణప్ప దంపతుల కుమారుడు నాగరాజుతో ఫిబ్రవరి 23న అయింది. పెళ్లైనప్పటి నుంచి కొత్త జంట అన్యోన్యంగానే ఉందన్నారు. ఈ నెల 5న హేమలతను పుట్టింటి నుంచి మెట్టినింటికి పిల్చుకువచ్చారు. ఈ నెల 8న ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. కుటుంబ సభ్యులు అంతటా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోడి పందేల స్థావరాలపై దాడులు
– 12 మంది పందెం రాయుళ్ల అరెస్టు హిందూపురం రూరల్ : మండలంలోని చెర్లోపల్లి గ్రామం సమీపం అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరాలపై దాడులు చేసి 12 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ రాజగోపాల్‌నాయకుడు తెలిపారు. శనివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, గుట్టూరు చెందిన పందెంరాయుళ్లు చెర్లోపల్లి వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఆంజినేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారన్నారు. దాడుల్లో బోయ రాజప్ప, అక్కులప్ప, నగేష్, మురళికష్ణ, అశ్వర్థప్ప, నరసింహులు, సురేష్, ప్రసాద్‌బాబు, శివ, అశ్వర్థప్ప, ఆదినారాయణ, రామాంజి, 5 ద్విచక్రవాహనాలు, నాలుగు పందెం కోళ్లు, రూ.31,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. మరో 8 మంది పందెం రాయుళ్లు పారిపోయారని వారి ఆచూకీSకోసం గాలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంక్రటామిరెడ్డి, రామాంజి, ఆంజినేయులు, మల్లి, శివ, శీన, రవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.