కాపాలకెళ్లి.. కానరాని లోకాలకు
శెట్టూరు (కళ్యాణదుర్గం) : అడవి పందుల నుంచి రాత్రిపూట పంటను కాపాడటానికి కాపలాగా వెళ్లిన ఇద్దరు యువకులు పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు...శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రామలింగ, మల్లక్కల కుమారుడు రాజేష్ (17) ఇంటర్మీడియట్ పాసయ్యాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. వేరుశనగ పంటను అడవిపందులు ధ్వంసం చేయకుండా కాపలా కాసేందుకు తన బంధువు రాజుతో కలిసి కలిసి గురువారం రాత్రి తోటకు వెళ్లారు. బాగా పొద్దుపోయిన తర్వాత అక్కడే ఉన్న గుడిసెలో నిద్రకు ఉపక్రమించారు.
శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజేష్ కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. రాజేష్ శరీరంపై పాము కాట్లను గుర్తించి కుటుంబ సభ్యులు హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడి వైద్యులు సూచన మేరకు అటు నుంచి అనంతపురం తరలిస్తుండగా రాజేష్ మార్గం మధ్యలో మృతి చెందాడు. అంతలోనే ఇంటి వద్ద ఉన్న రాజుకు సైతం పాము కాటు వేసినట్లు తెలుసుకుని ఉదయాన్నే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
దేవుడా ఎంత పనిచేశావయ్యా..
మంచి చదువులు చదవి మాకు పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటిమే.. పాము కాటు రూపంలో ఒక్కగానొక్క కుమారుడిని ఇలా తీసుకెళితివా..దేవుడా ఎంత పనిచేశావయ్యా’ అంటూ రాజేష్ తల్లి మల్లక్క, చెల్లెలు సుకన్య రోదించడం అందరినీ కలచివేసింది.