ఆటోడ్రైవర్ల ఆట కట్టు
సాక్షి, ముంబై: రైల్వేస్టేషన్ల వద్దప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరిస్తున్న ట్యాక్సీడ్రైవర్లపై చర్యలు తీసుకునే దిశగా ట్రాఫిక్ శాఖ అడుగులు వేసింది. ఇటువంటి వారిపై ఫిర్యాదు చేయడానికి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించింది. గతంలో ఎవరైనా ట్యాక్సీడ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరిస్తే వారిపై సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇక ముందు అలా కాకుండా నేరుగా రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ డెస్క్‌లను ప్రయాణికులు ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఈ హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి రెండు కారణాలున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయాణికులను తరలించేందుకు నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవడమేకాకుండా మహిళల భద్రతను కూడా దష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఈ విషయమై ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ డాక్టర్.బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఆరు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), ముంబై సెంట్రల్, బోరి వలి, ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), బాంద్రా టెర్మినస్‌లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇందు లో సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారు. పదిరోజుల క్రితమే వీటిని ప్రారంభించామన్నారు.
రైల్వేస్టేషన్ల ఆవరణలోని ప్రీపెయిడ్ బూత్‌లు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ స్టాండ్ల సమీపంలోనే హెల్ప్‌లైన్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ డెస్క్‌లు ఏర్పాటైనందువల్ల ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడానికి నిరాకరించబోరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మహిళలకు కూడా భద్రత కల్పించినట్లు అవుతుందని ఆ యన తెలిపారు. రాత్రివేళ్లలో ఆటోలు, ట్యాక్సీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు ఆటో, ట్యాక్సీడ్రైవర్ల వివరాలను కూడాసేకరించాలని డెస్క్ సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్య హత్యకు గురికావడంతో మహిళల భద్ర త అంశం చర్చకు వచ్చిందని, అందుకే ఈ డెస్క్‌ను ప్రారంభించామని ఉపాధ్యాయ తెలిపారు. సీఎస్టీ, ముంబై సెంట్రల్ల స్టేషన్ల వద్ద ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ల వద్ద ఇద్దరు ట్రాఫిక్ సిబ్బందిని ఉంచుతారు. దాదర్, బాంద్రా టెర్మినస్, బోరివలిలలో ఒక్కొక్కరు విధులు నిర్వహిస్తున్నారు. ఎల్టీటీ వద్ద ఒక అధికారితోపాటు ఏడుగురు ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు ఉపాధ్యాయ తెలిపారు.