కేసుల రాజీతో సమయం, డబ్బు ఆదా
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమణ నాయుడు
- జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 3569 కేసుల పరిష్కారం
సంగారెడ్డి క్రైం : కేసులను రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమణనాయుడు అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు సంగారెడ్డిలోని కోర్డు ఆవరణలో శనివారం జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమణ నాయుడు మాట్లాడుతూ క్రిమినల్ కాంపౌండబుల్ కేసులన్నీ పరిష్కరించామని, వీటికి కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు శాఖ అధికారులు ఎంతో సహకరించారని అభినందించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ మాట్లాడుతూ కేసులను రాజీ కుదుర్చుకుంటే కక్షిదారులకు వెంటనే న్యాయం జరుగుతుందని, అలాగే ఆర్థిక సాయం అందుతుందన్నారు. కాగా జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో 4 బెంచీలను ఏర్పాటు చేశారు.
జిల్లాకు సంబంధించిన కేసులను జిల్లా 5వ అదనపు జడ్జి ఎ.భారతి నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన కేసులను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ, ఎక్సైజ్ కోర్టుకు సంబంధించిన కేసులను వి.మహేష్ నాథ్, అడిషనల్ జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్, స్పెషల్ మొబైల్ కోర్టుకు సంబంధించిన కేసులను డి.దుర్గాప్రసాద్ నిర్వహించారు. అదాలత్‌లో మొత్తం 3569 కేసులను పరిష్కరించగా 35 సివిల్ కేసులు, 13 మోటార్ వెహికల్ కేసులకు సంబంధించి రూ.39.60 లక్షల నష్టపరిహారం అందజేశారు. 2134 క్రిమినల్ కేసులు, 1387 ఏపీటీఎస్ కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, న్యాయవాదులు భారతి, ఎన్.శివకుమార్, బుచ్చయ్య, విజయశంకర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రామారావు, బాపురెడ్డి,సంజీవరెడ్డి, గోవర్దన్, భూపాల్‌రెడ్డి, పోలీసు, కోర్టు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.