the China Open
-
చైనా ఓపెన్ వదిలేద్దామనుకున్నా
విమల్ సర్ చెబితేనే ఆడా సైనా నెహ్వాల్‌కు సూపర్ సిరీస్ విజయాలు కొత్త కాదు. కానీ చైనా ఓపెన్ గెలవడం చాలా ప్రత్యేకం. అలాగే గోపీచంద్ శిష్యురాలు విమల్ కుమార్ దగ్గరకు మారిపోయాక సాధించిన తొలి పెద్ద టైటిల్ ఇది. అయితే సైనా... అసలు చైనా ఓపెన్‌లో ఆడాలని అనుకోలేదట. కోచ్ ఆడాల్సిందే అనడంతోనే బరిలోకి దిగిందట. చైనా ఓపెన్ విజయంతో పాటు... కోచ్ గురించి, సాధించిన విజయాల గురించి సైనా ‘సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... చైనా ఓపెన్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అన్ని టోర్నీల్లోకి ఇది చాలా క్లిష్టం. ఓ రకంగా ఇది కల నిజమైన క్షణం. నా జీవితాంతం గుర్తుండిపోయే విజయం ఇది. వరుసగా ముగ్గురు చైనా అమ్మాయిలపై గెలవడం సంతోషంగా ఉంది. షిజియాన్ వాంగ్, యిహాన్ వాంగ్‌లను ఓడించిన యామగుచిపై ఫైనల్లో నెగ్గాను. ఈ టోర్నీలో యామగుచి అద్భుతమైన ఫామ్‌లో ఆడింది. నాతో కలిసి కష్టపడినందుకు విమల్ సర్‌కు కృతజ్ఞతలు. నా ఆటలో కొంత వైవిధ్యం తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. రోజు రోజుకు నా ఆట మెరుగుపడుతోంది. టోర్నీల మధ్య ఎక్కువ విరామం లేకపోతే ఆటకు మెరుగులు దిద్దుకోవడం కష్టం. కానీ మాకు లభించిన రెండు వారాల వ్యవధిలోనే ఆయన చాలా కష్టపడ్డారు. నిజానికి చైనా ఓపెన్ ఆడాలని నేను అనుకోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ట్రైనింగ్‌కు సమయం సరిపడా లేదు. కానీ విమల్ సర్కి నా మీద నమ్మకం ఎక్కువ. ఆయన మాట విని చైనా ఓపెన్ ఆడాను. నమ్మశక్యంకాని రీతిలో విజయం సాధించాను. ఒక టోర్నీలో ఓడినా చైనా క్రీడాకారిణులు ఎప్పుడూ బలమైన ప్రత్యర్థులే. బ్యాడ్మింటన్‌లో అంత బలమైన దేశం మరొకటి లేదు. అయితే మనం నిరంతరం కష్టపడటం ద్వారా చైనా వాళ్లను కూడా తరచుగా ఓడించవచ్చు అనే విశ్వాసం ఉంది. గోపీ, విమల్ ఇద్దరూ మంచి కోచ్‌లే. ఇద్దరూ ఆటగాళ్లతో కలిసి బాగా కష్టపడతారు. అందుకే భారత్ నుంచి చాలా మంది ఆటగాళ్లు వస్తున్నారు. చాలాకాలం గోపీ సర్ దగ్గర శిక్షణ తీసుకున్నా... కొంత మార్పు అవసరం అనుకున్నా. నా గేమ్ ఎక్కడో ఆగిపోయింది అనిపించింది. అందుకే విమల్ సర్ దగ్గరకు వెళ్లా. కొత్త ప్రయత్నాలు చేయడం ఎప్పుడూ మంచిదే. విమల్ సర్ శిక్షణతో సంతోషంగా ఉన్నా. విమల్ సర్ శిక్షణలో కచ్చితంగా ఎక్కడ మెరుగయ్యా అనే విషయం చెప్పలేను. కాకపోతే ఆటలో నా బలహీనతలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేశాం. రెండు వారాల శిక్షణతోనే ైచె నా ఓపెన్ గెలవగలిగా. అంటే మేం నా ఆట మీద ఎలాంటి కసరత్తు చేశామో అర్థం చేసుకోవచ్చు. నేను కూడా మనిషినే. ప్రతి టోర్నీ గెలవడం సాధ్యం కాదు. బరిలోకి దిగిన ప్రతిసారీ గెలవాలనే అనుకుంటాను. చైనాకు మనకు చాలా తేడా ఉంది. వాళ్లకు ప్రతి ముగ్గురు క్రీడాకారులకు 10 మంది కోచ్‌లు ఉంటారు. అందుకే వాళ్లు ప్రతిసారీ గెలుస్తూ ఉంటారు. కానీ మన దగ్గర 40, 50 మందికి ఒక్కరే కోచ్. కాబట్టి భారత్ సింగిల్స్ క్రీడాకారులు టైటిల్స్ గెలవడం సులభం కాదు. నేను ఇప్పటివరకూ 8 సూపర్ సిరీస్‌లు గెలిచాను. వేర్వేరు టోర్నీల్లో 11 సార్లు ఫైనల్‌కు చేరాను. ఒలింపిక్ మెడల్ గెలిచాను. మన దగ్గర సౌకర్యాలు అంత గొప్పగా లేకపోయినా నేను పతకాలు సాధించాను. కాబట్టి నేను సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. {పస్తుతం నేను విమల్ సర్ శిక్షణతో సంతోషంగా ఉన్నా. కాబట్టి అక్కడే కొనసాగుతా. నేను ఎప్పుడూ ర్యాంక్‌ల గురించి పట్టించుకోను. నా లక్ష్యం టైటిల్స్ గెలవడం. గెలుస్తూ ఉంటే ర్యాంక్ అదే మెరుగవుతుంది. -
జొకోవిచ్ ఐదోస్సారి
చైనా ఓపెన్ టైటిల్ సొంతం బీజింగ్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఐదోసారి చైనా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన ఐదు పర్యాయాలు ఈ సెర్బియా స్టార్కే టైటిల్ దక్కడం విశేషం. గతంలో జొకోవిచ్ 2009, 2010, 2012, 2013లలో కూడా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-0, 6-2తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను అలవోకగా ఓడించి కెరీర్లో 45వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. చాంపియన్ జొకోవిచ్‌కు 6,04,000 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మళ్లీ రెండో ర్యాంక్‌కు
షరపోవా ఖాతాలో చైనా ఓపెన్ బీజింగ్: ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో షరపోవా చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఈ రష్యా భామ 6-4, 2-6, 6-3తో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ ఏడాది నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న షరపోవా చైనా గడ్డపై తొలిసారి ఓ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పటివరకు షరపోవా 14 దేశాల్లో కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచింది. అమెరికాలో అత్యధికంగా తొమ్మిది నెగ్గగా... జపాన్‌లో నాలుగు, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో మూడేసి టైటిల్స్ ఉన్నాయి. విజేతగా నిలిచిన షరపోవాకు 9,35,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 76 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.