chinna kodur
-
కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు
చిన్నకోడూరు: రైతుల ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోళ్ల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకుంది. గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం, మక్కలు కొనుగోలు చేసేందుకు ఇందిర క్రాంతి పథం పర్యవేక్షణలో స్థానిక మహిళా సం ఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలోని మహిళా సంఘాలకు నేటికి కమీషన్ డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆరు సంవత్సరాలుగా రబీ, ఖరీఫ్ సీజన్లో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు సర్కార్ నుంచి కమీషన్ అందిన దాఖలాలు లేవు. ఈ విషయంలో ఐకేపీ సిబ్బందికి కమీషన్ వస్తోందన్న సంగతి తెలుసుకున్న గ్రామైక్య సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంనగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామైక్య సంఘం సభ్యులు 2008 సంవత్సరం నుంచి ప్రతి యేటా నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వారి సేవలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో నగదు ప్రోత్సాహకాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అయితే వారికి తెలియకుండా ఐకేపీ అధికారులు ఈ కమీషన్‌ను గుటుక్కు మనిపిస్తున్నారు. నిజానికి ఈ కమీషన్ వస్తుందనే విషయం మహిళలకు తెలియలేదు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మహిళలు ఆందోళనకు దిగారు. సుమారు రూ. 30 నుంచి 40 లక్షల వరకు తమకు ధాన్యం అమ్మిన కమీషన్ రాకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన గ్రామ సీఏ సాయికృష్ణ, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులను వారు నిలదీసి, వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ ఆనంద్‌గౌడ్ అక్కడికి అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో సమస్యను సామరస్యంగా చర్చించుకుందామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు. కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని ఐకేపీ అధికారుల అవినీతిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తమకు కమీషన్ అందలేదన్నారు. తమకు అన్యాయం చేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రికార్డులు లేవని, వివరాలను సంగారెడ్డిలోని కార్యాలయంలో పరిశీలించాక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
చిన్నకోడూరు, న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాగు నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తూ మండల పరిధిలో డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి సిద్దిపేటకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక సుమారు రూ. 2500, ట్రాలీ ఆటో ఇసుక రూ.1200 నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ వ్యాపారంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు భాగస్వాములుగా ఉండడంతో అధికారులు మొక్కుబడి దాడులు, నామమాత్రపు జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట నుంచి ఇసుకను మండలంలోని అల్లీపూర్, చిన్నకోడూరు మీదుగా సిద్దిపేటకు, అదేవిధంగా సిరిసిల్ల వాగు నుంచి మండలంలోని జక్కాపూర్ మీదుగా సిద్దిపేటకు ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆందోళనలో రైతులు ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోతే భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఉన్నతాధికారుల వత్తిడి మేరకు అధికారులు దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర సందర్భాల్లో అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. భారీగా డంప్‌లు మండలంలోని అల్లీపూర్, జక్కాపూర్లలో రహస్య ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. సిరిసిల్ల, ఇల్లంతకుంటల నుంచి తెచ్చిన ఇసుకను రాత్రికి రాత్రే ట్రాక్టర్లు, ఆటోల సాయంతో సిద్దిపేటకు తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో డంప్ చేస్తూ అధికారులకు చిక్కకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోవడంతో కొద్ది రోజులు రవాణా ఆగిపోయింది. తిరిగి కొందరి అండదండలతో తిరిగి యథావిధిగా కొనసాగుతుంది. చర్యలు తీసుకుంటాం తన దృష్టికి వచ్చిన వాటి అన్నింటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ వసంతలక్ష్మి అన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇకపై రాత్రిళ్లు కూడా నిఘా ఏర్పాటు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.