చిన్నకోడూరు, న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాగు నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తూ మండల పరిధిలో డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి సిద్దిపేటకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక సుమారు రూ. 2500, ట్రాలీ ఆటో ఇసుక రూ.1200 నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఈ వ్యాపారంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు భాగస్వాములుగా ఉండడంతో అధికారులు మొక్కుబడి దాడులు, నామమాత్రపు జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట నుంచి ఇసుకను మండలంలోని అల్లీపూర్, చిన్నకోడూరు మీదుగా సిద్దిపేటకు, అదేవిధంగా సిరిసిల్ల వాగు నుంచి మండలంలోని జక్కాపూర్ మీదుగా సిద్దిపేటకు ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆందోళనలో రైతులు
ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోతే భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఉన్నతాధికారుల వత్తిడి మేరకు అధికారులు దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర సందర్భాల్లో అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
భారీగా డంప్‌లు
మండలంలోని అల్లీపూర్, జక్కాపూర్‌లలో రహస్య ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. సిరిసిల్ల, ఇల్లంతకుంటల నుంచి తెచ్చిన ఇసుకను రాత్రికి రాత్రే ట్రాక్టర్లు, ఆటోల సాయంతో సిద్దిపేటకు తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో డంప్ చేస్తూ అధికారులకు చిక్కకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోవడంతో కొద్ది రోజులు రవాణా ఆగిపోయింది. తిరిగి కొందరి అండదండలతో తిరిగి యథావిధిగా కొనసాగుతుంది.
చర్యలు తీసుకుంటాం
తన దృష్టికి వచ్చిన వాటి అన్నింటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ వసంతలక్ష్మి అన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇకపై రాత్రిళ్లు కూడా నిఘా ఏర్పాటు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.
జోరుగా ఇసుక అక్రమ రవాణా
Published Sun, Feb 9 2014 1:36 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement