ఇంటెల్ ను వరించిన యాపిల్ కాంట్రాక్ట్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా పేరొందిన యాపిల్ తన చిప్ సప్లైయర్ ను మార్చుకోబోతోంది. తన స్మార్ట్ ఫోన్లలో అమర్చే చిప్ ల కాంట్రాక్టును ఇంటెల్ కు అప్పజెప్పింది. దీంతో ఇప్పటివరకూ క్వాల్కం ఇంక్ చిప్స్ తో వచ్చిన యాపిల్ ఐఫోన్ లు, ఇకనుంచి ఇంటెల్ కార్పొరేషన్ చిప్ లతో యూజర్ల ముందుకు రానున్నాయి. ఇంటెల్ మోడెమ్ చిప్స్ ను యాపిల్ తన తర్వాతి ఐఫోన్లలో వాడనుందని బ్లూమ్ బర్గ్ నివేదించింది. యాపిల్ ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్ లకు ప్రస్తుత వెర్షన్ కాంపొనెంట్ గా, ముఖ్య కమ్యూనికేషన్ సారిధిగా క్వాల్కమ్ చిప్ పనిచేస్తోంది. అయితే ఈ రిపోర్టుపై స్సందించడానికి ఇతర కంపెనీల ప్రతినిధులు తిరస్కరించారు. నిర్వహణ నష్టాలతో సతమతమవుతున్న ఇంటెల్ చిప్ ప్రోగ్రామ్ కు యాపిల్ నుంచి ఈ ఆర్డర్లు దక్కడం అతిపెద్ద విజయమని బ్లూమ్ బర్గ్ రిపోర్టు పేర్కొంది.
దీంతో యాపిల్ వ్యాపారాల నుంచి క్వాల్ కామ్ కొన్ని ఆర్డర్లును కోల్పోయింది. ఈ ఆర్డర్ తో గతకొంతకాలంగా పడిపోతున్నఇంటెల్ షేర్లు, కొంత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంటెల్ షేర్ 0.7 శాతం పెరిగింది. అయితే క్వాల్ కామ్ షేర్లు మాత్రం పడిపోయాయి. 2.9 శాతం పతనమయ్యాయి. యాపిల్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ కు 2017 లో ఇన్ ఫినియాన్ టెక్నాలజీస్ ఏజీ మోడమ్ లను సమకూర్చింది. అనంతరం ఇన్ ఫినియాన్ ను ఇంటెల్ కొనుగోలు చేసింది. తర్వాత కొంత కాలానికి యాపిల్ తన చిప్ ప్రొవైడర్ గా క్వాల్ కామ్ ను ఎన్నుకోవడంతో, ఇంటెల్ తన చిప్ కాంట్రాక్టులను కోల్పోయింది. అప్పటినుంచి స్మార్ట్ ఫోన్ చిప్ ల వ్యాపారాల్లో ఇంటెల్ తిరోగమనంలో పడింది. ప్రస్తుతం యాపిల్ మళ్లీ తన చిప్ ప్రొవైడర్ గా ఇంటెల్ ను ఎంచుకోవడంతో, తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇంటెల్ కు ఇది ఓ చక్కని అవకాశంగా ఉపయోగపడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.