ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
విశాఖ విద్య: ప్రకృతి వనరులను కాపాడుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి కోరారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికారత సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ప్రకృతి ఆధారిత పంటలు మేళా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మిద్దె తోటల పెంపకంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. శాసనమండలి మాజీ సభ్యులు పీవీఎన్ మాధవ్, రైతు సాధికారత సంస్థ రాష్ట్ర థీమేటిక్ లీడర్ బి.ప్రభాకర్ ప్రసంగించారు. రైతులకు ప్రోత్సాహక అవార్డులుఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా పంటలు పండిస్తున్న రైతులకు, టెర్రస్ గార్డెనర్స్కు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అవార్డులు అందజేసింది. ఉత్తమ రైతులుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్.చిరంజీవి, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వి.మోహన్రావు, విజయనగరం జిల్లా నుంచి ఎస్.విజయలక్ష్మి, విశాఖ జిల్లా నుంచి వై.పార్వతి, అల్లూరి జిల్లా నుంచి కె కామరాజు, అనకాపల్లి జిల్లా నుంచి కొల్లి కమల లక్ష్మి నారాయణమ్మ, లంబసింగి నుంచి పి.రాంబాబు, వైజాగ్ అర్బన్ నుంచి పైడిరాజులకు అవార్డులను అందజేశారు.మిద్దె తోటల విభాగంలో అనకాపల్లి నుంచి టి.పద్మ, శ్రీకాకుళం నుంచి యు.సుమలత, విజయనగరం నుంచి కృష్ణ కల్యాణి, విశాఖ నుంచి లక్ష్మీకాంతంలకు పురస్కారాలు అందజేశారు. అలాగే మేళా బయట కుమ్మరి లైవ్ ప్రదర్శన నిర్వహించిన అశోక్ కుమార్, గానుగ ఎద్దు నూనె లైవ్ ప్రదర్శన నిర్వహించిన బాలాజీ, పూరి గుడిసె ఓపెన్ డెకరేషన్ చేసిన ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ విద్యార్థులు జ్యోత్స్న, సొనాక్షి ప్రవీణ్, శ్రీనులకు పురస్కారాలు అందజేశారు.