పచ్చని దృశ్యం.. ఇక అదృశ్యం!
చోడవరం- గోవాడ మధ్య రియల్ జోరు
చోడవరం రూరల్: పంట భూములు రూపు మారుతున్నాయి. పచ్చని పంటలతో కనిపించే దృశ్యాలు అదృశ్యమవుతున్నాయి. వాణిజ్య కూడళ్లుగా మారిపోతున్నాయి. పట్టణాలు పల్లెలు కలిసిపోతున్నాయి. మండల కేంద్రం చోడవరం- గోవాడ మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరిచేలు, చెరకు తోటలు దర్శనమిచ్చేవి. పెరుగుతున్న వ్యాపార, వాణిజ్య అవసరాల దృష్ట్యా ఏడాదికి రెండు పంటలు పండే భూములు సైతం రూపు మారుతున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న భూములు వ్యాపార కూడళ్లుగా తయారవుతున్నాయి. భూమిని నమ్ముకున్న రైతులు ప్రస్తుతం రోడ్డు పక్క భూములకు ధరలు వస్తుండడంతో అమ్ముతున్నారు.
చోడవరం- గోవాడ మార్గ మధ్యలో రెండు పెట్రోల్ బంక్‌లు, మూడు ద్విచక్రవాహన షోరూంలు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్, రెండు డాబాలు, వేబ్రిడ్జి కేంద్రాలు, పలు రకాల షోరూంలు, గోడౌన్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా భారీ వెంచర్లు కూడా ఏర్పాటవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు మార్చే క్రమంలో నిబంధనలు పాటించాలి. దీని దృష్ట్యా రెండేళ్లు వ్యవసాయ భూములలో పంటలు వేయడం మానేసి ఉంచుతున్నారు. తర్వాత వీటిని సరి చేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇక రోడ్డకిరువైపులా వాణిజ్య, వ్యాపార కూడళ్లు మినహా పంటలు కనిపించే పరిస్థితి ఉండదు.