chops
-
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
అనుమానంతో భార్యను నరికేశాడు..
మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న ఆంజనేయులు, అతని తల్లి కోసం గాలింపు చేపట్టారు. -
ఆస్తి కోసం తల్లిని నరికిన కొడుకు
వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. కన్న కొడుకు తల్లిని అత్యంత దారుణంగా నరికిన ఘటన కలకలం రేపింది. తాటికాయల గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి తన తల్లిని గొడ్డలితో నరికాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సునీల్ పౌరోహిత్యం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. తల్లి పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల పొలాన్ని తన పేరు మీద రాయలేదన్న కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో పురోహితుడు సునీల్ ఒక్కడే కావడంతో గ్రామస్తులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. నిందితుడు సునీల్ పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..
పిలిబిట్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిట్లో అమానుషం చోటుచేసుకుంది. కట్నం కోసం ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. భార్య అనే కనికరం కూడా లేకుండా కత్తెరతో ఆమె ముక్కు, జడ కోశాడు. కోత్వాలీ పూరాన్‌పూర్‌లో ఈ దారుణం బుధవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే ఆలమ్ భార్య రుబీనాను కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. రూ.20వేలతో పాటు బైక్ ఇవ్వాలంటూ అత్తమామలను డిమాండ్ చేశాడు. అయితే కట్న దాహం తీరకపోవటంతో ఆలమ్ ఈ దారుణానికి తెగబడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు రుబీనాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.