‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’ | Gujarat Man Severs Fingers to Escape Family Firm Job | Sakshi
Sakshi News home page

బంధువుల సంస్థలో పనిచేయడమే కష్టం: చేతి వేళ్లను నరుక్కున్న ఉద్యోగి

Published Sun, Dec 15 2024 8:29 AM | Last Updated on Sun, Dec 15 2024 11:23 AM

Gujarat Man Severs Fingers to Escape Family Firm Job

గాంధీ నగర్‌ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది.  

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని వరచా మినీ బజార్‌లో అనభ్ జెమ్స్‌లో మయూర్ తారాపర (32) అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్‌కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు.  

ఈ తరుణంలో మయూర్‌ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్‌లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్‌ స్టేట్మెంట్‌ తీసుకున్నారు. స్టేట్మెంట్‌లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్‌ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి  వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు.  

దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్‌ బ్రాంచ్‌కి కేసును బదిలీ చేశారు. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సైతం మయూర్‌ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్‌ చెప్పినట్లుగా వేదాంత రింగ్‌ రోడ్‌, స్నేహితుల ఇళ్లు, మయూర్‌ ఇంటి నుంచి ఆఫీస్‌ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

తారామార పోలీసుల వివరాల మేరకు..  సింగన్‌పూర్‌లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్‌ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్‌రోడ్డు సమీపంలో తన బైక్‌ను పార్క్‌ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ..  ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్‌లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement