chronology
-
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
134 ఏళ్ల వివాదం .. 2019లో ముగింపు
న్యూఢిల్లీ : అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిండంతో పాటుగా... మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడింది. ఈ నేపథ్యంలో శతాబ్దాల నాటి అయోధ్య-బాబ్రీమసీదు వివరాలు.. 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో సైన్యాధిపతి మీర్ బకి వివాదాస్పద అయోధ్య ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించాడనేది వాదన. 1885 : మహంత్ రఘుబర్‌దాస్ వివాదాస్పద అయోధ్య స్థలంలో పందిరి నిర్మించేందుకు అనుమతించాలని ఫైజాబాద్ కోర్టులో అభ్యర్థన.. కోర్టు తిరస్కరణ. 1949 : వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహాలు ఏర్పాటు. 1950 : వివాదాస్పద స్థలంలోని రాముడి విగ్రహారాధనకు అనుమతించాలని గోపాల్ సిమ్లా విశారద్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్. కోర్టు అనుమతి -రాముడి విగ్రహారాధనకు అనుమతి కొనసాగించాలని, విగ్రహాలను తరలించరాదని రామచంద్ర పరమహంస కోర్టుకు వినతి. 1959 : వివాదదాస్పద స్థలంపై హక్కుల స్వాధీనం కోరుతూ నిర్మొహి అఖారా కోర్టులో పిటిషన్ 1961: వివాదదాస్పద స్థలంపై హక్కులు స్వాధీనం కోరుతూ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ 1986: ఫిబ్రవరి 1 : హిందువులు వివాదాస్పద స్థలంలోని దేవతా విగ్రహాలకు పూజలకు స్థానిక కోర్టు అనుమతి 1989, ఆగస్టు 14 : వివాదాస్పద స్థలంలో యధాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం 1992, డిసెంబర్ 6 : బాబ్రీ మసీదు కూల్చివేత. 1993, ఏప్రిల్ 3 : వివాదాస్పద స్థలాన్ని అధీనంలోకి తీసుకోవడానికి చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం -కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో ఇస్మాయిల్ ఫారుఖీ వంటివారు రిట్ పిటిషన్లు దాఖలు. -హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటీషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం. 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో.. మసీదు ఇస్లాంలో భాగం కాదని తేల్చిచెప్ని సుప్రీంకోర్టు 2002 ఏప్రిల్ : వివాదాస్పద స్థలం ఎవరికి చెందుతుంతో తేల్చేందుకు వాదనలు ప్రారంభించిన సుప్రీం కోర్టు 2004, మార్చి 13 : వివాదాస్పద స్థలంలో ఏ మతస్తులు పూజలు, పార్థనలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశం 2010 సెప్టెంబర్ 30 : వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖార, రామ్ లల్లాకు సమానంగా పంచాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు. 2011, మే 9 : అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 21 : అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కంచుకోవాలని సూచించిన సీజేఐ జేఎస్ ఖేహర్ 2018 సెప్టెంబర్ 27 : ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును రిఫర్ చేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు. ముగ్గురు సభ్యుల బెంచ్‌కు రిఫర్ 2019 జనవరి 8 : ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. సీజేఐ రంజన్ గొగోయ్ నేత్వత్వంలో.. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, ఎన్వీ రమణ, యూ.యూ లలిత్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఏర్పాటు 2019 జనవరి 10 : బెంచ్‌లో కొనసాగేందుకు యూ.యూ.లలిత్ నిరాకరణ. జనవరి 25న కొత్త బెంచ్ ఏర్పాటు. సీజేఐ రంజన్ గొగోయ్ నేత్వత్వంలో.. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ఏ నజీర్సభ్యులుగా ఏర్పాటు. జనవరి 29 : వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాల భూ యజమానుల్ని గుర్తించాలని సుప్రీంకోర్టుని కోరిన కేంద్రం. ఫిబ్రవరి 26 : మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పిన అత్యున్నత న్యాయస్థానం. మార్చి 8 : సుప్రీంకోర్టు జడ్జి నేత్వత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు. న్యాయవాది శ్రీరామ్ పంచు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ సభ్యులు. ఆగస్టు 2019 : మధ్యవర్తిత్వ కమిటీతో ప్రయోజనం లేకపోవడంతో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్ 4 : నవంబర్17 లోపున తుది తీర్పు వెల్లడిస్తామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం అక్టోబర్ 16 : వాదనలు ముగించిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. నవంబంర్ 9 : అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు తెలిపాయి. దీంతో 134 ఏళ్ల వివాదానికి తెరపడింది. (చదవండి : అయోధ్య వివాదం; కీలక తీర్పు) -
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది
అనుకున్నంతా అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిపోయారు. 18 ఏళ్ల నాటి ఈ కేసులో జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ తీర్పు విన్నవెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వాతావరణం తీవ్ర ఉద్రిక్త భరితంగా మారింది. ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి.. 1996 జూన్‌లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్‌లో ఛార్జిషీటు దాఖలు చేశారు అక్టోబర్‌లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్‌ను తప్పించింది. తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు. కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది. తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరపన అగ్రహారంలోని గాంధీభవన్‌లో ప్రత్యేక కోర్టు ఉంది. 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. షీలా బాలకృష్ణన్‌ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం.