Cinema Direction
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!
మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి. అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి చూద్దాం! తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’: తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో. తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’ చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. ఆకలి రాజ్యం: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్ బీటెక్’: మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి: మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇడియట్: నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. ‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి: నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్‌లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశారు. ‘అమ్మో ఒకటో తారీఖు’: ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య: మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్ రాజ్. ‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్: హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్ రెచ్చిపోయాడు. -
సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు
పిఠాపురం(తూర్పుగోదావరి): పైన నీలాల నింగి.. కింద నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. వాటి అంచుల్లో పాలల్లా పరచుకున్న తెల్లని నురుగు.. మెత్తని ఇసుక తిన్నెలు.. వీనులకు ఆనందాన్నిచ్చే సాగర ఘోష.. ఇటు నేలకు.. అటు సాగరానికి సరికొత్త అందాలను అద్దే మడ అడవులు.. హోప్ ఐలాండ్.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే ఇటువంటి విభిన్నమైన ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఉప్పాడ సాగర తీర సౌందర్యం.. వెండితెర ప్రముఖుల్ని మరోసారి ఎంతో ఆకర్షిస్తోంది. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అంటూ ‘ఉప్పెన’ సినిమాలో హీరో వైష్ణవ్‌తేజ్ పాడిన పాట.. ఉల్లాసంగా ఆడిన ఆట కుర్రకారు గుండెల్ని ఊపేసింది. ఉప్పాడ సాగర తీర సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుల దృష్టి మళ్లీ ఈ ప్రాంతం వైపు మళ్లింది. ఉప్పాడ అందాలు వారిని ఈ ‘తీరానికి లాగేటి దారం’గా మారిపోయాయి. కొత్త సినిమాలతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణకు కూడా ఉప్పాడ తీరం కేంద్రంగా మారుతోంది. గతంలో.. చాలాకాలం కిందట ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. రెబల్‌స్టార్ కృష్ణంరాజు హీరోగా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితర అగ్రశ్రేణి నటులు నటించిన ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఉప్పాడ తీరంలో జరిగింది. తరువాత రణరంగం, పోరు, కనకం, డియర్ కామ్రేడ్, దుర్మార్గుడు, ఆగ్రహం, ఒక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. తరువాత కొన్నాళ్లు అంతగా షూటింగ్‌లు లేవు. కానీ ఉప్పెన సినిమాతో సాగరతీరం మరోసారి సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారింది. ఇప్పుడు తీరంలో తరచుగా ‘క్లాప్.. స్టార్ట్.. రోల్.. కెమెరా.. యాక్షన్.. అంటూ సినిమా షూటింగ్‌ల సందడి కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోని పండూరుతో పాటు అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వీటితో పాటు పలు ప్రముఖ బుల్లితెర సీరియల్స్ షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. ఉప్పెన సినిమా షూటింగ్ జరిగిన కాకినాడ ఫిషింగ్ హార్బర్ కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్, మడ అడవులు.. చూడచక్కటి లొకేషన్లతో సందర్శకులనే కాదు.. వెండితెర, బుల్లితెర దర్శకుల కళ్లను కూడా కట్టి పడేస్తున్నాయి. కడలి కెరటాలు.. పచ్చని చెట్లు.. ఇసుక తిన్నెలు.. మధ్యలో ఉన్న కాలువలు ఎక్కడో ఉన్న దీవులను తలపిస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడంతో ఇక్కడ షూటింగ్‌లు జరుపుకునేందుకు ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఉప్పాడ.. నా కెరీర్‌ను మలుపు తిప్పింది నా తొలి సినిమా షూటింగ్ నా సొంత ఊరిలో జరుపుకోవడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏ దర్శకుడికీ దక్కని అవకాశాన్ని నా సొంత ఊరిలో ప్రకృతి నాకు ఇచ్చింది. కాకినాడ – ఉప్పాడ సాగరతీరంలో ఎన్నో అందమైన లోకేషన్లున్నాయి. ఉప్పెన సినిమాలో లొకేషన్లు చూసి, హిందీ నటుడు ఆమిర్‌ఖాన్ సైతం ఇక్కడ షూటింగ్‌కు ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్ ద్వారా ‘ఉప్పాడలో అంత మంచి లొకేషన్లున్నాయా? మేమూ సినిమా తీస్తాం’ అని చెబుతున్నారు. షూటింగ్‌కు ఇక్కడి ప్రజల సహకారం ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఉప్పాడ తీరంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. – సానా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా దర్శకుడు ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌కు వచ్చిన బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ఇక్కడ సెట్టింగ్‌లతో పని లేదు కాకినాడ – ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చేస్తే సెట్టింగ్‌లతో పని ఉండదు. అంతా ప్రకృతి అందాలతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని చిత్రీకరించాలంటే ఇక్కడి కంటే మంచి లొకేషన్లుండవు. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో సినిమాలు తీసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ‘కనకం 916 కెడిఎం’ సినిమా తీశాం. షూటింగ్‌కు స్థానిక ప్రజలు చాలా సహకరించారు. – రాకేష్ కనకం, సినిమా డైరెక్టర్ కనకం 916 కేడీఎం సినిమా షూటింగ్లో హీరోకు దర్శకుడు రాకేష్ సూచనలు -
సెన్సార్‌పై... మహా సెన్సార్!
వినోదం, వివేచన కోసం ఉద్దేశించిన మాధ్యమం అది. కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు చివరకు వివాదమైతే? సృజనాత్మక ప్రదర్శనల అనుమతి కోసం సదుద్దేశంతో పెట్టుకున్న సర్టిఫికేషన్ వ్యవస్థ చివరకు ఆ ప్రదర్శననే అడ్డుకొనే పరిస్థితి వస్తే? ఇప్పుడదే జరుగుతోందని వాపోతున్నారు సినీ సృజనశీలురు. సినీ మాధ్యమానికి సంబంధించి దశాబ్దాల క్రితం చేసుకున్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం’, పెట్టుకున్న ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు’ (సీబీఎఫ్సీ) మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. కేంద్ర సర్కారు చేపట్టిన తాజా ‘సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు– 2021’ వివాదానికి కేంద్రమైంది. చాన్నాళ్ళుగా ఉన్న ‘సినిమాటోగ్రాఫ్ చట్టం–1951’లో మార్పులు, చేర్పుల ద్వారా రాజ్యవ్యవస్థ సినిమాలపై పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సవరణ బిల్లుపై జూలై 2 లోగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సర్కారు పేర్కొంది. ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, పలువురు సినీ దర్శక, నిర్మాతలు, నటీ నటులు సమష్టిగా ఆదివారం నాడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాయడం గమనార్హం. నిజానికి, మనది ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డే తప్ప, అందరం పిలుచుకొంటున్నట్టుగా సెన్సార్ బోర్డు కాదు! అది సినీ ప్రదర్శనకు అనుమతి ధ్రువీకరణ కోసమే తప్ప, సెన్సార్ ఉక్కుపాదం మోపడానికి పెట్టుకున్నదీ కాదు!! కానీ, వ్యవస్థ తాలూకు భావజాలానికీ, ప్రయోజనాలకు అడ్డం వచ్చే ఏ సినిమానైనా అడ్డుకోవడానికి అదే బోర్డును ఆయుధంగా చేసుకోవడం ఆది నుంచీ ఆనవాయితీ అయింది. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ పాలకుల కాలం నుంచి అదే ధోరణి. స్వాతంత్య్రా నంతరం గద్దెపైనున్న సర్కార్లూ ఆ మార్గాన్నే అనుసరించాయి. అలా నాటి నుంచి నేటి దాకా పార్టీల ప్రమేయం లేకుండా అందరికీ ఈ తిలా పాపంలో తలా పిడికెడు భాగం ఉంది. ఇప్పుడు మళ్ళీ రీ–సెన్సార్షిప్ అనే సవరణ ప్రతిపాదన పాలకులకు మరిన్ని కొత్త కోరలు అందిస్తోంది. కేంద్రాన్ని ఏకంగా సెన్సార్‌కు పైన ఉండే ‘సూపర్ సెన్సార్’గా మారుస్తోంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్వేచ్ఛాభావనల సినీరంగం డిమాండ్ చేస్తోంది. అలాగే, నిన్న మొన్నటి దాకా సెన్సార్ బోర్డు ఇచ్చిన కట్స్‌తో కానీ, దాని పైన ఉండే రివైజింగ్ కమిటీ నిర్ణయంతో కానీ సంతృప్తి చెందని దర్శక, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్‌సీఏటీ)కి వెళ్ళి, న్యాయం పొందే అవకాశం ఉండేది. రాజకీయ కారణాలతో గద్దె మీది పెద్దలు కావాలని ఇబ్బంది పెట్టినా, న్యాయమూర్తులుండే చట్టబద్ధ సంస్థ ట్రిబ్యునల్ దగ్గర దర్శక– నిర్మాతలకు ఊరట లభించేది. ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ (1982), నారాయణమూర్తి ‘లాల్‌సలామ్’ (1992) లాంటి అనేక సినిమాలు అలా సెన్సార్ బోర్డుపై పోరాడి, ట్రిబ్యునల్ దాకా వెళ్లి సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించుకున్నవే. కానీ, ఈ ఏప్రిల్‌లో కేంద్ర సర్కారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చి, ఆ ట్రిబ్యునల్‌నే రద్దు చేసేసింది. అంటే ఇప్పుడిక దర్శక, నిర్మాతలు అందరిలా సాధారణ కోర్టు గుమ్మం ఎక్కి, ఎన్ని నెలలు ఆలస్యమైనా భరిస్తూ, తమ సినిమా సెన్సార్ కష్టాలను కడతేర్చుకోవాల్సిందే. తాజా సవరణ బిల్లు గనక చట్టమైతే–ఇప్పటికే సెన్సారైన సినిమాలను కూడా ప్రభుత్వం వెనక్కి పిలిపించవచ్చు. జనం నుంచి ఫిర్యాదు వచ్చి, అది సమంజసమని ప్రభుత్వం భావిస్తే చాలు– ఇక ఆ సినిమా ప్రదర్శన ఆగిపోనుంది. అంటే, ప్రభుత్వం నియమించిన నిపుణులతో సెన్సారై రిలీజైన సినిమాపైనే మళ్ళీ మరో సెన్సార్షిప్ అన్న మాట. అసలు సెన్సార్ బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని తిరగదోడే అధికారం కేంద్రానికి లేదంటూ కె.ఎం. శంకరప్ప (2001) కేసులో సర్వో న్నత న్యాయస్థానం ఎప్పుడో తేల్చింది. అలా చూస్తే ఈ కొత్త సవరణ ఆ ఆదేశాలకు విరుద్ధమే. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందనుకుంటే రాజ్యాంగ బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ హక్కుకూ కొన్ని పరిమితులుంటాయని మన రాజ్యాంగం పేర్కొంది. ఆ పరిమితులను ఆసరాగా చేసుకొని, సుప్రీం కోర్టు ఆదేశాలకు సైతం కేంద్రం కొత్త క్లాజు పెట్టింది. మరోపక్క ఇప్పటికే ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికల పైనా కొన్ని నియంత్రణ చట్టాలు ప్రభుత్వం తెచ్చింది. నిజానికి, ఇప్పుడొస్తున్న కొన్ని వెబ్ సిరీస్‌లు, చిత్రాల బాధ్యతారాహిత్యం చూస్తుంటే నియంత్రణలు అవసరమనే అనిపిస్తుంది. కానీ అది కక్షసాధింపు కాకూడదు. సమతూకం, సంయమనం అవసరం. ప్రతిపాదిత తాజా బిల్లులోని అంశాలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని సహించలేక చేస్తున్నవేననే అభిప్రాయం ప్రబలుతోంది. ప్రభుత్వ భావజాలానికో, ఏ కొందరి మనోభావాలకో వ్యతిరేకంగా ఉంటే చాలు... కొద్దిమంది కలసి ఓ సినిమా ప్రదర్శనను ఆపేయవచ్చు. సెన్సారైన సినిమానూ వెనక్కి రప్పించవచ్చనేది సృజనశీలురను భయపెడుతోంది. ఆ మధ్య సంజయ్ భన్సాలీ ‘పద్మావత్’, ‘ఉడ్తా పంజాబ్’ సహా అనేక సినిమాల విషయంలో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు సినీసీమకు ఉన్నాయి. అందుకే, సినిమాటోగ్రాఫ్ చట్టంలో కేంద్రం చేయాలనుకుంటున్న సవరణల పట్ల సినీ సమాజంలో నెలకొన్న భయాందోళనలు చాలావరకు అర్థవంతమైనవి. అర్థం చేసుకోదగినవి. ఆ భయాందోళనల్ని పోగొట్టాల్సిన బాధ్యత పాలకుల మీదే ఉంది. లేదంటే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుతూ, పరస్పర భిన్నాభిప్రాయాలను గౌరవించు కొంటూ సాగాల్సిన ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. విమర్శనూ, సృజనాత్మక స్వేచ్ఛనూ సహించ లేక ఉక్కుపాదం మోపుతున్నారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుంది. -
బంగారు భవితకు.. దర్శకత్వం
అప్‌కమింగ్ కెరీర్: ఊహలకే పరిమితమైన సుందర ప్రపంచంలోకి ప్రేక్షకుడిని సునాయాసంగా తీసుకెళ్లి, ఆనంద డోలికల్లో ఊయలలూగించే సాధనం.. సినిమా. అసాధ్యాలను సుసాధ్యం చేసి, కళ్ల ముందు కదలాడించే మాధ్యమం.. సినిమా. విజ్ఞానం, వినోదం పంచే దృశ్య కావ్యం.. సినిమా. అలాంటి చలనచిత్రం తెరపైకి వచ్చి, మనల్ని అలరించడానికి ప్రధాన కారకుడు.. దర్శకుడు. సినిమా అనే నావకు కెప్టెన్.. డెరైక్టర్. యువతకు కేరా్ఫ్ అడ్రస్ క్రియేటివిటీ కలిగిన యువతకు కేరాఫ్‌గా నిలుస్తున్న కెరీర్.. సినిమా డైరెక్షన్. దర్శకుడిగా ఒక్క హిట్టు కొడితే చాలు చేతి నిండా డబ్బు, పరిశ్రమలో గౌరవం, మరెన్నో అవకాశాలు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు బంగారుమయమే. ప్రస్తుతం ఉన్నత చదువులు చదివినవారు సైతం సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్వయం ప్రతిభతో ప్రముఖ దర్శకులుగా ఎదుగుతున్నారు. మరెందరికో మార్గదర్శకులుగా మారుతున్నారు. అపజయాలను తట్టుకోవాలి సృజనాత్మకతకు పెద్దపీట వేసే సినీ రంగంలో ప్రతిభావంతులకు అవకాశాలకు కొదవ లేదు. మొదట ఫిలిం స్కూళ్లలో చేరి, దర్శకత్వంలో పాఠాలు నేర్చుకున్న తర్వాత ప్రముఖ దర్శకుల వద్ద సహాయకులుగా పనిచేస్తూ అనుభవం గడించిన తర్వాత సొంతంగా సినిమాలకు దర్శకత్వం వహించవచ్చు. అయితే ఇది చెప్పుకున్నంత సులభం కాదని పేరున్న డెరైక్టర్లు చెబుతున్నారు. ప్రారంభంలో అవకాశాలు దక్కకపోవచ్చు. అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించాలి. సినీ డెరైక్షన్ రంగంలోకి ప్రవేశించే ముందు షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించి, అనుభవం సంపాదించాలని ఈ రంగంలోని ప్రముఖులు సూచిస్తున్నారు. దర్శకత్వ శాఖలో ఊహించని సవాళ్లు ఎదురవుతుంటాయి. పరాజయాలను, విమర్శలను తట్టుకొనే మానసిక సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండాలి ‘‘సినిమా రంగుల కలే కాదు రంగుల వల కూడా. కెరీర్‌గా ఎంచుకునే ముందు జాగ్రత్త వహించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమారంగం క్లిష్టంగానే ఉంది. అయినా ఈ రంగంలోకి నిత్యం కొత్తనీరు వస్తూనే ఉంటుంది. యువత సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే ముందు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండేలా చూసుకోవాలి. నిత్యనూతనంగా ఉండే సినీ కెరీర్లో ఏ మలుపు ఎదురైనా త ట్టుకోగల నిబ్బరం అవసరం. మీడియా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో దర్శకత్వ శాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. షార్ట్‌ఫిల్మ్స్ నిర్మిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్న వారూ ఉన్నారు. అవకాశాలకు తగినట్లుగానే ఒడిదొడుకులను తట్టుకోగలమనే నమ్మకం ఉన్నపుడే దీన్ని కెరీర్‌గా ఎంచుకోండి’’ వేతనాలు: అసిస్టెంట్ డెరైక్టర్‌కు నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుతుంది. టాలీవుడ్, శాండల్‌వుడ్ వంటి ప్రాంతీయ సినీ రంగాల్లో నేటి ప్రముఖ దర్శకులు ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు. బాలీవుడ్లో ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్న డెరైక్టర్లు ఉన్నారు. డైరెక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: 1. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్: www.ftiindia.com 2. సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్-కోల్‌కతా వెబ్సైట్: www.srfti.gov.in 3. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఫిలిం అండ్ టెలివిజన్(క్రాఫ్ట్) వెబ్సైట్: www.log2craft.com - జె. ప్రభాకర్‌రెడ్డి, సినీదర్శకులు