బంగారు భవితకు.. దర్శకత్వం
అప్‌కమింగ్ కెరీర్: ఊహలకే పరిమితమైన సుందర ప్రపంచంలోకి ప్రేక్షకుడిని సునాయాసంగా తీసుకెళ్లి, ఆనంద డోలికల్లో ఊయలలూగించే సాధనం.. సినిమా. అసాధ్యాలను సుసాధ్యం చేసి, కళ్ల ముందు కదలాడించే మాధ్యమం.. సినిమా. విజ్ఞానం, వినోదం పంచే దృశ్య కావ్యం.. సినిమా. అలాంటి చలనచిత్రం తెరపైకి వచ్చి, మనల్ని అలరించడానికి ప్రధాన కారకుడు.. దర్శకుడు. సినిమా అనే నావకు కెప్టెన్.. డెరైక్టర్.
యువతకు కేరా్‌ఫ్ అడ్రస్
క్రియేటివిటీ కలిగిన యువతకు కేరాఫ్‌గా నిలుస్తున్న కెరీర్.. సినిమా డైరెక్షన్. దర్శకుడిగా ఒక్క హిట్టు కొడితే చాలు చేతి నిండా డబ్బు, పరిశ్రమలో గౌరవం, మరెన్నో అవకాశాలు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు బంగారుమయమే. ప్రస్తుతం ఉన్నత చదువులు చదివినవారు సైతం సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్వయం ప్రతిభతో ప్రముఖ దర్శకులుగా ఎదుగుతున్నారు. మరెందరికో మార్గదర్శకులుగా మారుతున్నారు.
అపజయాలను తట్టుకోవాలి
సృజనాత్మకతకు పెద్దపీట వేసే సినీ రంగంలో ప్రతిభావంతులకు అవకాశాలకు కొదవ లేదు. మొదట ఫిలిం స్కూళ్లలో చేరి, దర్శకత్వంలో పాఠాలు నేర్చుకున్న తర్వాత ప్రముఖ దర్శకుల వద్ద సహాయకులుగా పనిచేస్తూ అనుభవం గడించిన తర్వాత సొంతంగా సినిమాలకు దర్శకత్వం వహించవచ్చు. అయితే ఇది చెప్పుకున్నంత సులభం కాదని పేరున్న డెరైక్టర్లు చెబుతున్నారు. ప్రారంభంలో అవకాశాలు దక్కకపోవచ్చు. అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించాలి. సినీ డెరైక్షన్ రంగంలోకి ప్రవేశించే ముందు షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించి, అనుభవం సంపాదించాలని ఈ రంగంలోని ప్రముఖులు సూచిస్తున్నారు. దర్శకత్వ శాఖలో ఊహించని సవాళ్లు ఎదురవుతుంటాయి. పరాజయాలను, విమర్శలను తట్టుకొనే మానసిక సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలి.
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండాలి
‘‘సినిమా రంగుల కలే కాదు రంగుల వల కూడా. కెరీర్‌గా ఎంచుకునే ముందు జాగ్రత్త వహించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమారంగం క్లిష్టంగానే ఉంది. అయినా ఈ రంగంలోకి నిత్యం కొత్తనీరు వస్తూనే ఉంటుంది. యువత సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే ముందు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండేలా చూసుకోవాలి. నిత్యనూతనంగా ఉండే సినీ కెరీర్‌లో ఏ మలుపు ఎదురైనా త ట్టుకోగల నిబ్బరం అవసరం. మీడియా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో దర్శకత్వ శాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. షార్ట్‌ఫిల్మ్స్ నిర్మిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్న వారూ ఉన్నారు. అవకాశాలకు తగినట్లుగానే ఒడిదొడుకులను తట్టుకోగలమనే నమ్మకం ఉన్నపుడే దీన్ని కెరీర్‌గా ఎంచుకోండి’’
వేతనాలు:
అసిస్టెంట్ డెరైక్టర్‌కు నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుతుంది. టాలీవుడ్, శాండల్‌వుడ్ వంటి ప్రాంతీయ సినీ రంగాల్లో నేటి ప్రముఖ దర్శకులు ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్న డెరైక్టర్లు ఉన్నారు.
డైరెక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
1. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్: www.ftiindia.com
2. సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా
వెబ్‌సైట్: www.srfti.gov.in
3. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఫిలిం అండ్ టెలివిజన్(క్రాఫ్ట్)
వెబ్‌సైట్: www.log2craft.com
- జె. ప్రభాకర్‌రెడ్డి, సినీదర్శకులు