కసాయి కొడుకులకు..కనువిప్పు..ఈ తీర్పు
కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురి చేస్తున్న కుమారులకు ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం కానుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదనే వాస్తవాన్ని జడ్జి ఎం.సుబ్బారావు తన తీర్పు ద్వారా తేటతెల్లం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తూర్పుగోదావరి, ఆలమూరు: ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు చెందిన పుల్లేటికుర్రు నాగభూషణం(72) స్థానిక శివాలయంలో అర్చకత్వం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య సత్యవతి ఏడేళ్ల క్రితం మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉండటం వల్ల ఉన్న ఇల్లును కుమారులు పంచుకున్నారు. ఆయనను ఆదుకోవలసిన నలుగురు కుమారుల్లో ముగ్గురు ముఖం చాటేశారు. దీంతో కరెంట్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూడో కుమారుడు మహేశ్వరరావు మాత్రమే తండ్రిని చేరదీశాడు. పెద్ద కుమారుడైన పీయూఆర్ఎల్కే సత్యనారాయణమూర్తి మండపేటలోని ఒక ప్రముఖ ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. రెండో కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య శర్మ తన తండ్రి నాగభూషణం చేస్తున్న అర్చకత్వాన్ని, దేవదాయశాఖ సమకూర్చిన ఇంటిని స్వాధీనం చేసుకుని ఆదాయాన్ని దర్జాగా అనుభవిస్తున్నాడు. నాలుగో కుమారుడు శ్రీప్రకాష్ రాజానగరంలోని ఒక గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
మూడు సార్లు ఆత్మహత్యాయత్నం
నాగభూషణం రెండో కుమారుడు తన తండ్రికి సోకిన చర్మవ్యాధిని అంటువ్యాధిగా ప్రచారం చేసి ఆలయంలోకి రాకుండా అర్చకత్వానికి దూరం చేశాడు. ఆర్థికంగా స్థిరపడిన ముగ్గురు కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆయన మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడో కుమారుడు చొరవతో బతికి బయటపడ్డాడు. ఈవిషయంపై గ్రామ పెద్దల వద్ద జరిగిన తగవులో కేవలం ఒక్కొక్క కుమారుడు నెలకు రూ.160 ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. తాను ఒక కుమారుడికి భారం కాకుడదని నాగభూషణం నిర్ణయించుకున్నాడు. తనను విస్మరించిన కుమారులకు న్యాయపరంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో 2016 జూన్ 30న ఆలమూరు కోర్టును ఆశ్రయించాడు.
చివరకు న్యాయమే గెలిచింది
ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాదోపవాదనలు జరుగుతుండగా గ్రామపెద్దల సూచనలతో ఒకదశలో లోక్ అదా లత్ ద్వారా జరిగిన రాజీ ప్రయత్నాలు నాగభూషణం కొడుకులు పట్టించుకోలేదు. సుదీర్ఘకాలం వాదోపవాదనలు జరిగిన అనంతరం నాగభూషణం ముగ్గురు కుమారులు తన తండ్రికి అన్యా యం చేశారనే విషయాన్ని జడ్జి సుబ్బారావు గ్రహించి ఆమేరకు నలుగురు కుమారులను మనోవర్తి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాలుగో కుమారుడు రూ. నాలుగువేలు, మిగతా ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలంటూ ఈనెల 25న కోర్టు తీర్పును వెలువరించింది.
కసాయి కొడుకులకు కనువిప్పు – ఎస్కే షరీఫ్, న్యాయవాది, ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పంచుకుని వృద్ధాప్యంలో పట్టించుకోని కసాయి కొడుకులకు ఈతీర్పు కనువిప్పు కలుగుతుందని నాగభూషణం తరఫు న్యాయవాది ఎస్కే షరీఫ్ అన్నారు. బాధితుడికి జరిగిన అన్యాయం తన మనస్సును కలచివేయడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానన్నారు. దేశంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అనేక మంది కన్న కొడుకులకు ఈ తీర్పు కనువిప్పు కావాలి.