Civil Results
-
సాయికిరణ్ 27.. సహన 739..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/రామడుగు: ప్రతిభకు పేదరికం అడ్డు కానే కాదని మరోసారి రుజువైంది. తల్లిదండ్రులు కార్మికులైనా తాను కలెక్టర్ కావాలనుకున్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.. పేదరికం కారణంగా కొలువు చేయాల్సి రావడం, కోచింగ్ తీసుకోకుండా సొంతంగానే ప్రిపేరయి రెండో ప్రయత్నంలోనే లక్ష్యం చేరుకున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నందాల సాయికిరణ్ విజయగాథను ఆయన సోదరి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ స్రవంతి ‘సాక్షి’కి వివరించారు. సాయికిరణ్ స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాల. తల్లిదండ్రులు లక్ష్మి–కాంతారావు, సోదరి స్రవంతి ఉన్నారు. తండ్రి చేనేత కార్మికుడు, తల్లి బీడీ కార్మికులిగా పని చేస్తూ పిల్లల్ని పెంచారు. కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు కాంతారావు మహారాష్ట్రలోని భీవండిలో చేనేత కార్మికుడిగా పని చేశారు. సాయికిరణ్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవారు. ఐదో తరగతి వరకు సరస్వతి పాఠశాలలో చదివారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆ పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ కరీంనగర్‌లోని తేజస్విని పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. 2012లో పదోతరగతి, ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2014లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎన్ఐటీ వరంగల్‌లో సీటు సాధించిన సాయికిరణ్ 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేయడంతోనే క్యాల్‌కమ్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. తండ్రి మరణించినా.. తల్లి అండతో.. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే సాయికిరణ్ తండ్రి 2016లో కేన్సర్ బారిన పడి మృతిచెందారు. దీంతో తల్లి లక్ష్మి కష్టపడి బీడీలు చుట్టి, తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కూతురు స్రవంతి బీటెక్ పూర్తి చేసి, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పని చేస్తున్నారు. సాయికిరణ్ 2018 నుంచి ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు. గతేడాది విఫలమైనా రెండోసారి ఆలిండియా 27వ ర్యాంకు సాధించారు. వీరి తల్లి లక్ష్మి ఇప్పటికీ బీడీలు చుడుతుందని గ్రామస్తులు తెలిపారు. కాగా, సివిల్స్ ర్యాంకర్ సాయికిరణ్‌ను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రత్యేకత చాటుకున్న వెలిచాల.. గత పదేళ్లుగా ఉత్తమ గ్రామపంచాయతీగా పేరు పొందిన వెలిచాలకు ఇక్కడి అభివృద్ధి పనులపై స్టడీ టూర్ చేయడానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్ సర్వీస్ ప్రతినిధులు వచ్చి, వెళ్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న సాయికిరణ్ కష్టపడి చదివి, సివిల్స్ ర్యాంకు సాధించడంతో ఈ గ్రామం ప్రత్యేకత చాటుకుంది. ఢిల్లీలో కోచింగ్... కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక గీత–అనిల్ దంపతుల కూతురు సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె స్థానిక కెన్ క్రెస్ట్ స్కూల్లో పదోతరగతి, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో పలు మాక్ ఇంటర్వూ్యలకు అటెండయ్యారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్లో పాత్రికేయుడిగా పని చేస్తున్నారు. స్మితా సబర్వాల్ స్ఫూర్తి.. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్‌గా పని చేసిన స్మితా సబర్వాల్ తనకు స్ఫూర్తి అని సహన తెలిపారు. తాను పాఠశాలలో చదువుతున్నపుడు స్మితా మేడంలా కలెక్టర్ అవ్వాలని ఆ రోజుల్లోనే ఫిక్స్ అయ్యానని, ఆ కల నెరవేర్చుకునేందుకు తాను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారన్నారు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. -
ఓటమిపై విజయం!
సివిల్స్ సాధించాలని, ప్రజలకు సేవ చేయాలని చాలా మంది కల కంటారు. కొందరు మాత్రమే లక్ష్యానికి చేరుకుంటారు. ప్రయత్నం అంటూ చేయకపోతే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కష్టమనే విషయం తెలిసిందే. ఈ కోవలోనే ఒకటి, రెండుసార్లు ఒడిపోయినంత మాత్రాన కుంగిపోకుండా.. జిల్లాకు చెందిన ఇద్దరు యువత సివిల్స్ లక్ష్యాన్ని అందుకున్నారు. ఓటమిపై విజయం సాధించి బంగారు భవితకు బాటలు వేసుకుని భళా అనిపించారు. మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన డాక్టర్ షేక్ హబీబుల్లా 189వ ర్యాంకు.. ఆదోని పట్టణానికి చెందిన షమీర్‌రాజా 464వ ర్యాంకు సాధించి తమ కల నెరవేర్చుకున్నారు. కర్నూలు(రాజ్‌విహార్): సివిల్స్ ఫలితాల్లో కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన డాక్టర్ షేక్ హబీబుల్లా ఆల్ ఇండియా స్థాయిలో 189వ ర్యాంకు సాధించారు. తండ్రి షేక్ అబ్దుల్ ఖాదర్ ప్రస్తుతం విద్యుత్ శాఖ ట్రాన్స్‌కోలో సూర్యపేట ఏడీఈగా విధులు నిర్వహిస్తుండగా తల్లి షేక్ గౌసియా బేగం గృహిణి. కాగా తాత షేక్ మహబూబ్ దౌల ప్యాలకుర్తిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. తండ్రి ఉద్యోగ రీత్య హబీబుల్లా ప్రాథమిక విద్య సున్నిపెంటలో, ఆ తరువాత డోన్‌లో పూర్తి చేశారు. 2010లో కర్నూలులోని కేశవరెడ్డి స్కూల్లో 10వ తరగతి చదివి 559 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో 2012లో 935 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వెటర్నరీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి అడుగుజాడల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, అది కూడా ఉన్న తంగా ఉండాలనే ఆలోచనలో సివిల్స్ వైపు అడుగులు వేశారు. కొంత కాలం విజయవాడలో ప్రాథమిక శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నం చేసిన ఆయన 2021లో ఢిల్లీ వెళ్లారు. అక్కడ జామియా మిలియా యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నా రెండో ప్రయత్నంలోనూ ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. లక్ష్య సాధన దిశగా మరింత ప్రయత్నం చేసి.. మూడో ప్రయత్నంలో 189వ ర్యాంకు సాధించారు. ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంత్రోపాలజీని ఎంచుకోగా.. ప్రస్తుత ర్యాంకుకు ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నట్లు హబీబుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు డాక్టర్ కావాలని బైపీసీలో చేర్పించగా.. వెటర్నరీ డాక్టర్ దిశగా తన పయనం సాగిందన్నారు. ఇతర ఏ ఉద్యోగం చేసినా ఆ సంతోషం కొంత వరకే ఉంటుందని, సివిల్స్‌లో రాణిస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. షమీర్రాజాకు ఆల్ ఇండియాలో 464వ ర్యాంకు ఆదోని అర్బన్: పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో నివాసముంటున్న నరసింహులు, ఉషా దంపతుల కుమారుడు షమీర్‌రాజా మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో 464వ ర్యాంకు సాధించారు. ఇతని తండ్రి నరసింహులు గుంతకల్ రైల్వేశాఖలో డీఆర్ఎం ఆఫీసు సూపరింటెండెంట్‌గా కాగా.. తల్లి గృహిణి. చెల్లెలు షర్మిల ఎంబీబీఎస్ పూర్తి చేసి రేడియాలాజీలో ఎండీగా శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షమీర్‌రాజా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. 1నుంచి 10వ తరగతి వరకు ఆదోనిలోని మిల్టన్ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2015లో బీటెక్ పూర్తయిందన్నారు. ఆ వెంటనే ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నట్లు చెప్పారు. ఆరుసార్లు సివిల్స్ పరీక్ష రాయగా.. ఇంటర్వూ వరకు వెళ్లి విఫలమయ్యాన న్నారు. 2020లో వచ్చిన ఫలితాల్లో 603 ర్యాంకు రాగా.. ప్రస్తుతం ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూనే 2022లో సివిల్స్ రాయగా.. ఆలిండియా స్థాయిలో 464వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంకుతో ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేడర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్స్ మెయిన్స్–2019 పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 2,304 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఫిబ్రవరి నుంచి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 80 మంది వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. ఈ సారి 896 పోస్టుల వరకు భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇంటర్వ్యూల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేటగిరీల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తారు. సివిల్స్–2019 ప్రిలిమ్స్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది హాజరుకాగా.. 11,845 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి 2019 సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ నిర్వహించగా వాటి ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఏపీ, తెలంగాణ నుంచి 850 మందికి మెయిన్స్‌కు అర్హత ప్రిలిమ్స్‌కు ఏపీ, తెలంగాణ నుంచి 79,697 మంది దరఖాస్తు చేయగా.. 40,732 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 850 మందికి పైగా మెయిన్స్‌కి అర్హత సాధించారు. విజయవాడ, హైదరాబాద్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడలో 134 మంది, హైదరాబాద్‌లో 641 మంది పరీక్ష రాయగా.. 775 మందిలో 80 మంది వరకూ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి నుంచి జరిగే ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులకు.. మెయిన్ మార్కుల్ని జతచేసి ఈ ఏడాది మేలో యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేస్తుంది. కటాఫ్‌పై ఈడబ్ల్యూఎస్ కోటా ప్రభావం సివిల్స్–2019కు సంబంధించి భర్తీ అయ్యే పోస్టుల సంఖ్య 896 వరకు ఉండగా.. ఈ సారి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం పోస్టులు కేటాయించనున్నారు. ఈ కోటా ప్రభావం మెయిన్స్నుంచి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యేందుకు నిర్ణయించే కటాఫ్ మార్కులపై ప్రభావం చూపనుంది. ఈ కోటా వల్ల జనరల్ కేటగిరీతో మిగతా కేటగిరీల్లోనూ కటాఫ్ మార్కుల సంఖ్య గతంలో కన్నా ఈసారి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ► సివిల్స్–2019 మెయిన్స్‌లో కటాఫ్ మార్కులు: జనరల్ కోటాలో 775, ఈడబ్ల్యూఎస్ కోటాలో 740, ఓబీసీ 735, ఎస్సీ 725, ఎస్టీ724, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ 715, విజువల్లీ ఇంపైర్డ్ 690, హియరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులకు 523 మార్కులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ►సివిల్స్–2018 మెయిన్స్‌లో కటాఫ్ మార్కులు జనరల్ కోటాలో 774, ఓబీసీ 732, ఎస్సీ 719, ఎస్టీ719, ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ 711, విజువల్లీ ఇంపైర్డ్ 696, హియరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులకు 520గా నిర్ణయించారు. 27న ఇంటర్వ్యూలకు అర్హుల జాబితా విడుదల సివిల్స్–2019 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 27న యూపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల వారీగా ‘ఈ–సమన్’ లెటర్లను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి డౌన్లోడ్ కాని అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ఫోన్ నెంబర్ లేదా ‘సీఎస్ఎం–యూపీఎస్సీఃఎన్ఐసీ.ఐఎన్’ అడ్రస్‌కు మెయిల్ ద్వారా సంప్రదించాలి. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫాం(డీఏఎఫ్)–2ను ఆన్లైన్లో సమర్పించాలని యూపీఎస్సీ పేర్కొంది. కమిషన్ వెబ్సైట్ ‘యూపీఎస్సీఓఎన్ఎల్ఐఎన్ఈ.ఎన్ఐసీ.ఐఎన్’లో ఈ నెల 17 నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు సమర్పించాలని సూచించింది. ఒకసారి సర్వీస్, కేడర్ అలాట్మెంట్ ఆప్షన్లు నమోదు చేశాక.. మళ్లీ మార్పులకు అవకాశం ఉండదు. నిర్ణీత గడువులోగా డీఏఎఫ్–2ను సమర్పించని వారిని నో ప్రిఫరెన్స్ కింద పరిగణిస్తారు. -
సివిల్స్ టాపర్‌కు 55.30 శాతమే
న్యూఢిల్లీ: 2016 సివిల్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెల్లడించింది. సివిల్స్ ఫలితాల్లో మొదటిస్థానంలో నిలిచిన నందిని కె.ఆర్ 55.30% మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె 2,025 మార్కులకు గానూ1,120 (మెయిన్స్‌లో 927, ఇంటర్వూ్యలో 193) మార్కులు సాధించినట్లు కమిషన్ పేర్కొంది. ఇక రెండో ర్యాంక్ పొందిన అన్మోల్ షేర్ సింగ్ బేడీ 1,105 మార్కులు(54.56%) సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది. మూడో ర్యాంకు సాధించిన తెలుగు తేజం రోణంకి గోపాలకృష్ణకు 1,101 మార్కులు(54.37%) వచ్చినట్లు వెల్లడించింది. 2015లో సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబీ 1,063 మార్కులు(52.49%) మాత్రమే సాధించినట్లు కమిషన్ పేర్కొంది.