సాక్షిప్రతినిధి,కరీంనగర్/రామడుగు: ప్రతిభకు పేదరికం అడ్డు కానే కాదని మరోసారి రుజువైంది. తల్లిదండ్రులు కార్మికులైనా తాను కలెక్టర్ కావాలనుకున్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.. పేదరికం కారణంగా కొలువు చేయాల్సి రావడం, కోచింగ్ తీసుకోకుండా సొంతంగానే ప్రిపేరయి రెండో ప్రయత్నంలోనే లక్ష్యం చేరుకున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నందాల సాయికిరణ్ విజయగాథను ఆయన సోదరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ స్రవంతి ‘సాక్షి’కి వివరించారు. సాయికిరణ్ స్వగ్రామం రామడుగు మండలంలోని వెలిచాల. తల్లిదండ్రులు లక్ష్మి–కాంతారావు, సోదరి స్రవంతి ఉన్నారు.
తండ్రి చేనేత కార్మికుడు, తల్లి బీడీ కార్మికులిగా పని చేస్తూ పిల్లల్ని పెంచారు. కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు కాంతారావు మహారాష్ట్రలోని భీవండిలో చేనేత కార్మికుడిగా పని చేశారు. సాయికిరణ్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవారు. ఐదో తరగతి వరకు సరస్వతి పాఠశాలలో చదివారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఆ పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ కరీంనగర్‌లోని తేజస్విని పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. 2012లో పదోతరగతి, ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2014లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎన్‌ఐటీ వరంగల్‌లో సీటు సాధించిన సాయికిరణ్ 2018లో ఇంజినీరింగ్ పూర్తి చేయడంతోనే క్యాల్‌కమ్ కంపెనీలో ఉద్యోగం సాధించారు.
తండ్రి మరణించినా.. తల్లి అండతో..
ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే సాయికిరణ్ తండ్రి 2016లో కేన్సర్ బారిన పడి మృతిచెందారు. దీంతో తల్లి లక్ష్మి కష్టపడి బీడీలు చుట్టి, తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కూతురు స్రవంతి బీటెక్ పూర్తి చేసి, ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పని చేస్తున్నారు. సాయికిరణ్ 2018 నుంచి ఉద్యోగం చేస్తూనే ఆన్‌లైన్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు. గతేడాది విఫలమైనా రెండోసారి ఆలిండియా 27వ ర్యాంకు సాధించారు. వీరి తల్లి లక్ష్మి ఇప్పటికీ బీడీలు చుడుతుందని గ్రామస్తులు తెలిపారు. కాగా, సివిల్స్ ర్యాంకర్ సాయికిరణ్‌ను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ప్రత్యేకత చాటుకున్న వెలిచాల..
గత పదేళ్లుగా ఉత్తమ గ్రామపంచాయతీగా పేరు పొందిన వెలిచాలకు ఇక్కడి అభివృద్ధి పనులపై స్టడీ టూర్ చేయడానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పలువురు సివిల్ సర్వీస్ ప్రతినిధులు వచ్చి, వెళ్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న సాయికిరణ్ కష్టపడి చదివి, సివిల్స్ ర్యాంకు సాధించడంతో ఈ గ్రామం ప్రత్యేకత చాటుకుంది.
ఢిల్లీలో కోచింగ్...
కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక గీత–అనిల్ దంపతుల కూతురు సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె స్థానిక కెన్ క్రెస్ట్ స్కూల్లో పదోతరగతి, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ ఫలితాల్లో క్వాలిఫై అయ్యాక ఢిల్లీలో పలు మాక్ ఇంటర్వూ్యలకు అటెండయ్యారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్‌లో పాత్రికేయుడిగా పని చేస్తున్నారు.
స్మితా సబర్వాల్ స్ఫూర్తి..
ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్‌గా పని చేసిన స్మితా సబర్వాల్ తనకు స్ఫూర్తి అని సహన తెలిపారు. తాను పాఠశాలలో చదువుతున్నపుడు స్మితా మేడంలా కలెక్టర్ అవ్వాలని ఆ రోజుల్లోనే ఫిక్స్ అయ్యానని, ఆ కల నెరవేర్చుకునేందుకు తాను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారన్నారు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment