రేపు ఓయూలో తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఓయూలో నిర్వహించనున్న తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య కోరారు. గురువారం విద్యార్థి యుద్ధభేరి వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న ఏపీఎన్జీఓల పేరుతో సీమాంధ్ర పెట్టుబడిదారులు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమన్నారు.
ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ అండతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహ కారంతో హైదరాబాద్‌పై శాశ్వత ఆధిపత్యం కోసం సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారని, దీనిని తెలంగాణ దళిత వర్గాలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. భౌగోళిక అంతర్భాగంలో హైదరాబాద్ తెలంగాణలో ఓ భాగమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తామంటే యుద్ధమేనన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణకు దూరం చేస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తామని రత్నయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నర్సింలు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కృష్ణ, జిల్లా కన్వీనర్ నారాయణ, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.