జమ్మూలో మళ్లీ ఘర్షణలు, ఒకరు మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉదయం మరోసారి అల్లర్లు చెలరేగాయి. బందిపూరా, బిజ్హీహరా ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, సుమారు 20మంది గాయపడ్డారు. జూన్ నుంచి కశ్మీర్ లోయలో చెలరేగిన హింసలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 80కి చేరింది. కాగా బక్రీద్ పండగ పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ లోయలోని మొత్తం పది జిల్లాలోనూ కర్ఫ్యూ విధించారు. 1990 తర్వాత ఈద్ రోజు కశ్మీర్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉండడం ఇదే తొలిసారి.
హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆర్మీ అధికారలు సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. కల్లోల పరిస్థితుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం బక్రీద్ పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని వేర్పాటువాదులు సూచించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ బాడీ సమావేశం కూడా జరగనున్నందున... శ్రీనగర్‌లోని భారత్, పాక్ ఐరాస మిలిటరీ అబ్జర్వేషన్స్ ఆఫీసుల వరకు ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మార్చ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ఇంటర్నెట్ సేవలపై ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా 72 గంటలపాటు మొబైల్ సేవలు కూడా నిలిపేశారు. బీఎస్ఎన్ఎల్ మినహా ఇతర టెలికాం నెట్వర్క్ సర్వీసులు నిలిచిపోయాయి.