హోంవర్కు చేయలేదని.. బెల్టుతో కొట్టారు!
ఇచ్చిన హోం వర్కు చేయలేదని.. రెండో తరగతి చదివే చిన్నారిని బెల్టుతో వీపుమీద తోలు ఊడేలా కొట్టాడో టీచర్. ఈ దారుణం బెంగళూరు శివార్లలోని నేలమంగళ ప్రాంతంలో గల సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగింది. ఏడేళ్ల ఆ చిన్నారి గత ఏడాది కాలం నుంచి ఆ టీచర్ వద్ద ట్యూషన్ చెప్పించుకుంటోంది.
మంగళవారం నాడు ఆమె క్లాసుకు వెళ్లినప్పుడు.. ముందురోజు ఇచ్చిన హోం వర్కు చేయలేదని, తాను ధరించిన తోలుబెల్టు తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లే సరికి తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. టీచర్ కొట్టారని చెప్పగా చూస్తే.. ఆమె వీపు నిండా వాతలు తేలి ఉన్నాయి. చర్మం లేచిపోయింది. దాంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 15 ఏళ్లుగా ట్యూషన్లు చెబుతున్న సదరు టీచర్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది.