చేతులు శుభ్రంగా ఉంటే 80 శాతం రోగాలు రావు!
తిక్క లెక్క
కొందరిలో ఆత్మారాముడు చాలా చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి కడుపులో పడేస్తూ ఉంటే కానీ, స్థిమితంగా ఉండలేరు వారు. అయితే ఆకలి వేస్తోంది కదా అని, చేతులు కూడా కడుక్కోకుండా ఆవురావురుమని తినేస్తే మాత్రం చేజేతులా ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకున్నట్లేనంటున్నారు పరిశోధకులు. అసలు జలుబు సహా పలు ప్రమాదకరమైన వ్యాధులు చేతులు శుభ్రం చేసుకోకుండా తినడం వల్లే వస్తాయట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండడంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఇమిడి ఉంటాయి.
ఆ చేతులతోనే తినేయడం వల్ల అనేకరకాలైన రోగాలను చేతులారా ఆహ్వానించినట్టే. కాబట్టి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నా.. తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిదని, అలా చేయడం వల్ల దాదాపు 80 శాతం రోగాలు రాకుండా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంటోంది.