ఒక్క ఎస్సెమ్మెస్‌తో రైలు బోగీ క్లీన్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలలో ప్రయాణికులు ఏ బోగీ ఎక్కినా కంపు కొట్టడం నిన్నటి మాట. సెంట్ కొట్టడం నేటి మాట. ఎక్కే దిగే ప్రయాణికుల కారణంగా బోగీలు అపరిశుభ్రంగా మారడం మనకు అనుభవమే. ఇప్పడు ఒక్క ఎస్సెమ్మెస్ లేదా ‘క్లీన్‌మైకోచ్ డాట్‌కామ్’కు ఒక్క రిక్వెస్ట్ చేస్తే చాలు. క్లీనింగ్ సిబ్బంది మనముందు వాలుతారు. అరగంటలో బోగీలను, టాయ్లెట్లను శుభ్రం చేసి బోగీల్లో సెంట్కొట్టి మరీ పోతారు. అందుకు రైళ్లలో ‘బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ (ఓబీహెచ్ఎస్)’ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో అప్రమత్తంగా ఉంటారు.
ఓబీహెచ్ఎస్ సిబ్బంది సాధారణంగా రైలు గమ్యస్థానంలో చేరుకునేలోగా ప్రతి బోగీని రెండు సార్లు శుభ్రం చేయడం వారి డ్యూటీ. కానీ ప్రయాణికులు ఎప్పుడు కోరుకున్నా వచ్చి అరగంటలో శుభ్రం చేస్తారు. అందుకు మనం చేయాల్సిందల్లా ‘క్లీన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పది డిజిటల్ పీఎన్ఆర్’ నెంబర్‌ను మొబైల్ ఫోన్లో టైప్‌చేసి 58888 నెంబర్‌కు మిస్సేజ్ పంపించాలి లేదా ‘క్లీన్‌మైకోచ్ డాట్ కామ్’కు వెళ్లి అందులో ఉన్న ఫారమ్‌లో మన పీఎన్ఆర్ నెంబర్, మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. అబ్జర్వ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.
మన రిక్వెస్ట్‌ను అబ్జర్వ్ సాఫ్ట్వేర్ వెంటనే ఆ రైల్లో ఉన్న ఓబీహెచ్ఎస్ వ్యవస్థకు పంపిస్తుంది. అక్కడ మన పీఎన్ఆర్ నెంబర్ వాలిడేట్ కాగానే ఓబీహెచ్ఎస్ వ్యవస్థ మూడు ఎస్సెమ్మెస్‌లను జనరేట్ చేసి ఒక ఎస్సెమ్మెస్‌ను ప్రయాణికుడి మొబైల్ నెంబర్ సహా క్లీనింగ్ సిబ్బందికి పంపిస్తుంది. అవే వివరాలతో రెండో ఎస్సెమ్మెస్ కంట్రోల్ ఆఫీసుకు వెళుతుంది. క్లీనింగ్ సిబ్బంది వివరాలతో మూడో ఎస్సెమ్మెస్ ప్రయాణికుడికి వెళుతుంది.
సకాలంలో క్లీనింగ్ సిబ్బంది స్పందించి బోగీని క్లీన్ చేశారా, లేదా అన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ ఈ విధానం ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. క్లీనింగ్ అనంతరం అలర్ట్ మెస్సేజ్ కూడా కంట్రోలింగ్ ఆఫీసుకు వెళుతుంది. ఈ విధానాన్ని ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1072 రైళ్లలో ప్రవేశపెట్టారు. త్వరలోనే మరో 700 రైళ్లలో ప్రవేశపెడతామని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు.