client servicing
-
షేర్ల దుర్వినియోగానికి చెక్
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్సే్చంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్లైన్ సిస్టమ్ సేకరిస్తుంది. క్లయింట్ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్సే్చంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్సే్చంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. -
క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌పై నిషేధం లేదు: కార్వీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త క్లయింట్లను తీసుకోవటంపై మాత్రమే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 21 రోజుల పాటు నిషేధం విధించిందని, ప్రస్తుత క్లయింట్ల తరఫున ట్రేడింగ్ చేయటం, మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించటం వంటి అంశాల్లో ఎలాంటి నిషేధం లేదంటూ ఆర్థికసేవల సంస్థ ‘కార్వీ’ శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘మా వ్యాపారాల్లో సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నియంత్రణలో నడిచే స్టాక్ బ్రోకింగ్ కూడా ఒకటి. దీని పనితీరు, బుక్స్‌ను ఈ సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాయి. ఆగస్టులో జరిగిన తనిఖీకి సంబంధించి సెబీకి ఎన్ఎస్ఈ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా 22న సెబీ తాత్కాలిక ఎక్స్‌పార్టీ ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్పందించాలని మాకు 21 రోజుల సమయం ఇచ్చింది. అప్పటిదాకా కొత్త క్లయింట్లను తీసుకోరాదని నిషేధించింది. ప్రస్తుత క్లయింట్ల తరఫున కార్యకలాపాలు సాగించటంపై మాత్రం ఎలాంటి నిషేధమూ లేదు’ అని సంస్థ వివరించింది. సంస్థ స్పందించిన అనంతరం దీనిపై మరింత సమగ్రంగా దర్యాప్తు జరిపి తాజా ఉత్తర్వుల్ని సమీక్షిస్తామని సెబీ తెలియజేసినట్లు కార్వీ పేర్కొంది. -
కాంగ్రెస్‌తో జట్టు కట్టలేదు : కేంబ్రిడ్జ్ ఎనలిటికా
లండన్ : ఫేస్బుక్ డేటాను సంగ్రహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ కంపెనీ కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారత్‌లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందనే ప్రచారాన్ని తోసిపుచ్చింది. భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగాయని, కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందని కంపెనీ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్ వైలీ చేసిన ఆరోపణలను ఖండించింది. భారత్‌లో కేంబ్రిడ్జ్ అనలిటికా విస్తృతంగా కార్యకలాపాలు సాగించిందని, అక్కడ సంస్థకు కార్యాలయం ఉందని, సిబ్బంది ఉందని వైలీ బ్రిటన్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జ్కు క్లైంట్ అని తనకు సమాచారం ఉందన్నారు. కాగా, పార్ట్‌టైమ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన వైలీ 2014, జులైలోనే సంస్థ నుంచి వైదొలిగారని, అప్పటినుంచి కంపెనీ కార్యకలాపలు, పద్ధతుల గురించి వైలీకి తెలియదని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయన చెప్పినవన్నీ కేవలం ఊహాగానాలేనని కేంబ్రిడ్జ్ అనలిటికా పేర్కొంది. -
ఉజ్వలమైన కెరీర్‌కు.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్
దేశవిదేశాల్లో దినదిన ప్రవర్థమానమవుతున్న రంగం.. అడ్వర్టైజింగ్. నేటి మార్కెటింగ్ యుగంలో ప్రతి వస్తువుకూ ప్రచారం అవసరమే. అందుకే ప్రకటనల రంగం అభివృద్ధి పథంలో సాగుతోంది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం క్లయింట్లు అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ క్లయింట్లకు, ప్రకటన సంస్థకు మధ్య వారధిగా పనిచేసే నిపుణులుంటారు. వారే.. క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు. ఏజెన్సీకి వీరు వెన్నెముక లాంటివారు. క్లయింట్ల అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకొని ఏజెన్సీకి తెలియజేస్తారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలు, మనుగడ వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీల సంఖ్య పెరుగుతుండడంతో క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లకు కూడా డిమాండ్ అధికమవుతోంది. ప్రకటనలు, ప్రచారంపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ నూతన అనుభూతి: క్లయింట్ సర్వీసింగ్ నిపుణులకు ప్రకటన సంస్థలతోపాటు కార్పొరేట్ ఆర్గనైజేషన్లు, వస్తూత్పత్తుల సంస్థలు, టీవీ చానళ్లలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అడ్వర్టైజింగ్తో ముడిపడి ఉన్న ప్రతి రంగంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. సర్వీసింగ్ మేనేజర్లు నేరుగా క్లయింట్లతో మాట్లాడాల్సి ఉంటుంది. వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలు రూపొందించడం, ప్రచారం చేసిపెట్టడం వంటి బాధ్యతలను పర్యవేక్షించాలి. కస్లమర్ల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించాలి. సంస్థ వ్యాపారాన్ని పెంచేది క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లే. ఇందులో ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని, విసుగుదల రాదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. నైపుణ్యాలు: క్లయింట్ సర్వీసింగ్ మేనేజర్లు తీవ్ర ఒత్తిళ్ల మధ్య కూడా కష్టపడి పనిచేయగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ తప్పనిసరిగా ఉండాలి. బిజినెస్ సెన్స్ అవసరం. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ పెంచుకోవాలి. టైమింగ్సతో నిమిత్తం లేకుండా పగలు, రాత్రి ఎప్పుడైనా పనిచేసే సామర్థ్యం ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకోవాలి. అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అడ్వర్టైజింగ్/మార్కెటింగ్‌లో డిప్లొమా కోర్సు చదివి, క్లయింట్ సర్వీసింగ్ రంగంలో అడుగుపెట్టొచ్చు. మాస్ కమ్యూనికేషన్/ఎంబీఏ కోర్సులు చదివినవారు సైతం ఇందులో రాణించొచ్చు. వేతనాలు: పనిచేస్తున్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్థాయిని బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఎంబీఏ పూర్తిచేసి, ఈ రంగంలో కొంత అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు పొందొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీకి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వేతనం అందుతుంది. అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, అకౌంట్ మేనేజర్‌కు రూ.26 వేల నుంచి రూ.34 వేలు, అకౌంట్ డెరైక్టర్‌కు ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షలు, మేనేజ్మెంట్ సూపర్వైజర్కు ఏడాదికి రూ.12 లక్షలు, క్లయింట్ సర్వీసింగ్ డెరైక్టర్‌కు రూ.11 లక్షల నుంచి రూ. 17 లక్షల దాకా వేతనాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: www.xaviercomm.org జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. వెబ్సైట్: http://jbims.edu/