climb trees
-
హాజరు పడాలంటే చెట్టెక్కాల్సిందే!
రాంచీ: క్లాస్‌లో కూర్చొని.. రోల్ నంబర్ వన్.. రోల్ నంబర్ టూ.. అంటూ విద్యార్థుల అటెండెన్స్ తీసుకునే టీచర్లు తమ హాజరు నమోదు కోసం మాత్రం చెట్లెక్కుతున్నారు. హాజరు కోసం చెట్లెక్కడమేంటి.. అనే కదా? టీచర్లు సరిగ్గా పాఠశాలకు వస్తున్నారో? లేక రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టి సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారో? గుర్తించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవలే కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ప్రతి స్కూల్లో ఓ ట్యాబ్లెట్ ఫోన్ ఉంటుంది. స్కూల్‌కు రాగానే దానిలో ఫేస్ రికగ్నేషన్ ఫీచర్‌తో హాజరును నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు టీచర్ ఆ రోజు స్కూల్‌కు వచ్చినట్లు అది విద్యాశాఖ కార్యాలయానికి హాజరు నమోదును పంపుతుంది. టెక్నాలజీ బాగానే ఉన్నా.. అసలు సమస్య సిగ్నల్స్‌తో వచ్చింది. ఆ రాష్ట్రంలోని పాలము జిల్లా, సోహ్రీఖాస్ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ అందాలంటే చెట్లెక్కాల్సిందే. దీంతో తమ హాజరు నమోదు చేయడానికి టీచర్లకు చెట్లెక్కక తప్పడంలేదు. టీచర్లు యువకులైతే సరే.. మరి వయసు పైబడినవారి సంగతేంటి? స్కూల్‌కు వచ్చినా.. గైర్హాజరైనట్లేనా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడంలేదట. -
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
-
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
న్యూఢిల్లీ: పక్క కొమ్మలు లేకుండా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం అందరికీ సాధ్యంకాదు. సాధన ఉంటేనే సాధ్యం. అలాంటిది హరియాణాకు చెందిన 32 ఏళ్ల ముఖేష్ కుమార్ నేరుగా కాకుండా తలకిందులుగా చెట్లు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పడంతో పాటు కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్టు ముఖేష్ చెప్పాడు. ప్రస్తుతం అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల వయసు నుంచి ముఖేష్ తలకిందులుగా చెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అందరూ నిటారుగా చెట్లు ఎక్కుతారని, తలకిందులుగా ఎందుకు ఎక్కరాదన్న ఆలోచన వచ్చిందని, దీంతో వినూత్న పద్ధతిలో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. పలుమార్లు గాయపడినా, తన అలవాటును మార్చుకోలేదని తెలిపాడు. మొదట్లో తలకిందులుగా రెండు లేదా మూడు అడుగులు మాత్రమే చెట్లు ఎక్కగలిగేవాడినని, సాధన చేసి పొడవాటి చెట్లను ఎక్కడం నేర్చుకున్నానని చెప్పాడు. ఎప్పుడూ పొడవాటి చెట్లను ఎక్కేందుకు ఆసక్తి చూపుతానని, అంతేగాక తక్కువ సమయంలో ఎక్కేందుకు సాధన చేస్తున్నానని ముఖేష్ తెలిపాడు. చెట్లను ఎక్కేటపుడు కంటే వేగంగా కిందకు దిగుతానని చెప్పాడు. 50 అడుగుల ఎత్తున్న చెట్లను ముఖేష్ ఐదు నిమిషాల్లోపే ఎక్కేస్తాడు.