clive lloyd
-
వాళ్లతో పోలిస్తే ఐపీఎల్లో క్రికెటర్లు సంపాదించేదెంత.. ఆడుకోనివ్వండి..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందించాడు. ఈ విషయంలో లాయిడ్ ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు. ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. మైఖేల్ జోర్డన్ లాంటి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్ లాయిడ్ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. -
కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించడంతో జట్టు సారధి కోహ్లి ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్‌గా కోహ్లీ 63 టెస్ట్‌ల్లో 37 విజయాలతో వెస్టిండీస్ మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్(36 టెస్ట్ విజయాలు)ను అధిగమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్ తరువాతి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్టీవ్ వా(ఆస్ట్రేలియా) 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి.. స్టీవ్ వా(41) మూడో స్థానంపై కన్నేశాడు. మరోవైపు, లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2014లో ధోని మాత్రమే ఈ మైదానంలో టెస్ట్ విజయాలను అందుకున్నారు. చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి మీ వెంటపడతాం': కేఎల్ రాహుల్ లార్డ్స్ విజయంతో కోహ్లి.. సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక విజయాలను అందుకున్న ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం కోహ్లీకి ఇది ఆరోసారి. ఇంతకుముందు గంగూలీ ఐదు సార్లు, ధోని నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి(37) శిఖరాగ్రానికి చేరాడు. కోహ్లి తరువాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో, 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత పేసు గుర్రాలు చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకొట్టిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. కోహ్లి మాటను నిజం చేసిన భారత పేసు గుర్రాలు -
1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు
ఢిల్లీ: క్రికెట్ అనే పదం భారతీయుల గుండెల్లోకి మరింత చొచ్చుకుపోయిన రోజు ఇదే. బ్రిటీష్ పరిపాలనలోనే మనవాళ్లు క్రికెట్ ఆడడం అలవాటు చేసుకున్నా.. టీమిండియా అంటే 1983 ముందు.. ఆ తర్వాత అని చరిత్ర చెప్పుకుంటుంది. అప్పటివరకు క్రికెట్లో భారత్ అనే పేరు అనామకంగానే ఉండేది. కాగా అప్పటికే క్రికెట్లో పాతుకుపోయిన వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్ల ముందు మన ఆటలు సాగేవి కావు. ఒకవేళ వాళ్లు మనం దేశంలో పర్యటించినా.. లేక మనం వాళ్ల దేశంలో పర్యటించిన రిజల్ట్ మాత్రం మనకు ప్రతికూలంగానే వచ్చేది. కానీ 1983 సంవత్సరం క్రికెట్లో టీమిండియా ఆటతీరును ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ చేరింది. కపిల్‌దేవ్ సారధ్యంలోని భారత జట్టు ఫైనల్లో బలమైన విండీస్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టంది. భారత్‌లో క్రికెట్‌కు మతం అనే పదానికి భీజం పడింది ఇక్కడే. అప్పటివరకు హాకీని ఇష్టపడినవాళ్లు క్రమంగా క్రికెట్‌కు పెద్ద అభిమానులుగా మారిపోతువచ్చారు. మరి అలాంటి చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఇదే.. జూన్ 25, 1983. నేటితో భారత్ మొదటి ప్రపంచకప్ గెలిచి 38 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆనాటి ఫైనల్ విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటింగ్‌లో శ్రీకాంత్ 38, మోహిందర్ అమర్నాథ్ 26, ఎస్ఎమ్ పాటిల్ 27 పరుగులు చేశారు. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఇదేం పెద్ద టార్గెట్ కాకపోవచ్చని.. మరోసారి కప్పును విండీస్ గెలుచుకుంటుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే విండీస్ ఇన్నింగ్స్ సాగింది. తొలి వికెట్‌ను ఐదు పరుగులకే కోల్పోయినా.. 50/1తో పటిష్టంగా కనిపించింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. భయంకరమైన ఫామ్‌లో ఉన్న వివ్ రిచర్డ్స్ 33 పరుగుల వద్ద మదన్‌లాల్ బౌలింగ్‌లో కపిల్‌దేవ్ తీసుకున్న సూపర్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు విసురుతూ చెమటలు పట్టించగా.. విండీస్ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయి 43 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొహిందర్ అమర్నాథ్, మదన్‌లాల్ ద్వయం చెరో మూడు వికెట్లతో చెలరేగారు.అలా తొలిసారి కపిల్ సారధ్యంలోని టీమిండియా జగజ్జేతగా అవతరించింది. అంతకముందు లీగ్ దశలో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175* పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. సెమీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో కపిల్ పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్ తీసుకొని బరిలోకి దిగడం.. 175 నాకౌట్ ఇన్నింగ్స్ ఆడడం చరిత్రలో మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ సరిగ్గా 28 ఏళ్లకు 2011లో ధోని సారధ్యంలో టీమిండియా రెండో ప్రపంచకప్‌ను సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL-6 Final: విజేత ముల్తాన్ సుల్తాన్స్ సిక్స్ కొట్టి తలపట్టుకున్నాడు.. వీడియో వైరల్ #OnThisDay in 1983, a moment of triumph for India 🌟 Kapil Dev led them to their first @cricketworldcup win with a 43-run victory over West Indies in the final 🏆 pic.twitter.com/u3oewIaJnX — ICC (@ICC) June 25, 2021 -
‘ఇదే ఆల్‌టైమ్ అత్యుత్తమ టీమిండియా జట్టు’
ఆంటిగ్వా: తాను చూసిన భారత క్రికెట్ జట్లలో ప్రస్తుత టీమిండియా జట్టునే అత్యుత్తమం అని విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు. తాను ఇంతవరకూ ఈ తరహా భారత క్రికెట్ జట్టును చూడలేదని పేర్కొన్నాడు. వరుస సిరీస్ విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియాపై లాయిడ్ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు అత్యంత పటిష్టంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని కొనియాడాడు. ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు ప్రొఫెషనల్ ఆటగాళ్లతో నిండి ఉందన్నాడు. ‘ద టెలీగ్రాఫ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిడ్ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు అమోఘం. గత భారత జట్టులు కంటే ప్రస్తుత జట్టు బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించాలంటే గతంలో భారత్‌కు సవాల్‌గా ఉండేది. అటువంటి ఇప్పుడు దానిని టీమిండియా అధిగమించింది. ఆ సిరీస్ ప్రకారం చూస్తే ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ‘ఆల్‌టైమ్’ బెస్ట్ టీమ్ అనక తప్పదు’ అని పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: ధోని భయ్యా.. నాకు ఎల్ సైజ్ జెర్సీ పంపు: జడేజా బుమ్రాపై ప్రశంసల జల్లు భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రాపై లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ బుమ్రా ఇప్పటికే అతనేమిటో నిరూపించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక వైవిధ్యం ఉంది. యార్కర్లు, బౌన్సర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నాడు. ఏ సమయంలోనైనా బుమ్రా చేతికి బంతి ఇస్తే అద్భుతాలు చేస్తున్నాడు. టీమిండియా వరుస విజయాలు సాధించడానికి బుమ్రా ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా ఆదుకునే తీరు అమోఘం’ అని కొనియాడాడు. -
క్లైవ్ లాయిడ్‌కు మరోసారి కీలక బాధ్యతలు
సెయింట్ జోన్స్:వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ చీఫ్ సెలక్టర్ క్లైవ్ లాయిడ్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. క్లైవ్ లాయిడ్‌ను సెలక్షన్ కమిటీ ప్యానెల్‌కు చైర్మన్‌గా నియమించింది. కర్ట్నీ బ్రౌన్ స్థానంలో లాయిడ్‌ను సెలక్టర్ల చైర్మన్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బోర్డు స్పష్టం చేసింది. రాబోవు రెండు సంవత్సరాల పాటు లాయిడ్ సెలక్షర్ల చైర్మన్‌గా కొనసాగుతారని తెలిపింది. గతంలో విండీస్ బోర్డు డైరెక్టర్ గా, చీఫ్ సెలక్టర్‌గా లాయిడ్ పని చేసిన సంగతి తెలిసిందే. 2014లో విండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటన ఆద్యంతం వివాదాల నడుమ కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విండీస్ జట్టుకు లాయిడ్ చీఫ్ సెలక్టర్ గా ఉన్నారు. -
‘భారత్ పటిష్టంగా ఉంది’
పెర్త్: ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న భారత క్రికెట్ జట్టును విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ప్రశంసించారు. ఓపెనర్ ధావన్ ఫామ్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి నిలకడైన బ్యాటింగ్‌తో ధోని సేన అదరగొడుతోందని, అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందని అన్నారు. ‘భారత పేసర్లు ఆకట్టుకుంటున్నారు. బ్యాటింగ్‌లో మిడిలార్డర్లో చక్కటి సమన్వయం ఉంది. రెండేళ్ల నుంచి కోహ్లి బ్యాటింగ్ అద్భుతంగా సాగుతోంది. తాజాగా ధావన్ ఫామ్‌లోకొచ్చాడు. ఇక ధోని చివర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఓవరాల్‌గా భారత్ ఆల్‌రౌండ్ షో కనబరుస్తోంది. అయితే శుక్రవారం విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా వారు మెరుగ్గా ఆడకూడదనే అనుకుంటున్నాను’ అని లాయిడ్ అన్నారు.