ఆంటిగ్వా: తాను చూసిన భారత క్రికెట్ జట్లలో ప్రస్తుత టీమిండియా జట్టునే అత్యుత్తమం అని విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు. తాను ఇంతవరకూ ఈ తరహా భారత క్రికెట్ జట్టును చూడలేదని పేర్కొన్నాడు. వరుస సిరీస్ విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియాపై లాయిడ్ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు అత్యంత పటిష్టంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని కొనియాడాడు. ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు ప్రొఫెషనల్ ఆటగాళ్లతో నిండి ఉందన్నాడు. ‘ద టెలీగ్రాఫ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిడ్ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు అమోఘం. గత భారత జట్టులు కంటే ప్రస్తుత జట్టు బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించాలంటే గతంలో భారత్‌కు సవాల్‌గా ఉండేది. అటువంటి ఇప్పుడు దానిని టీమిండియా అధిగమించింది. ఆ సిరీస్ ప్రకారం చూస్తే ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ‘ఆల్‌టైమ్’ బెస్ట్ టీమ్ అనక తప్పదు’ అని పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: ధోని భయ్యా.. నాకు ఎల్ సైజ్ జెర్సీ పంపు: జడేజా
బుమ్రాపై ప్రశంసల జల్లు
భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రాపై లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ బుమ్రా ఇప్పటికే అతనేమిటో నిరూపించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక వైవిధ్యం ఉంది. యార్కర్లు, బౌన్సర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నాడు. ఏ సమయంలోనైనా బుమ్రా చేతికి బంతి ఇస్తే అద్భుతాలు చేస్తున్నాడు. టీమిండియా వరుస విజయాలు సాధించడానికి బుమ్రా ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా ఆదుకునే తీరు అమోఘం’ అని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment