భలే మంచి లంచ్ బేరం
సాధారణంగా ఒక హోటల్లో లంచ్ చేస్తే సుమారు రూ.500 బిల్లు అవుతుంది.. అదే స్టార్ హోటల్ అయితే రూ.1000 నుంచి రూ.1500. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో మాత్రం లంచ్ ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. లంచ్ ఒక్కటే కాదు.. టీ, టిఫిన్, డిన్నర్ ఏదైనా చాలా ఖరీదు చేసేశారు. ఇంతకీ ఈ లక్షల రూపాయల లంచ్ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే.
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓట్ల రాజకీయంతో పనికాదని గ్రహించి.. నోట్ల రాజకీయాలకు తెర తీసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను లంచ్, డిన్నర్‌కి పిలిచి బేరాలు పెడుతోంది. సర్పంచ్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి వరకూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేస్తోంది. ఇందులో సిద్ధ హస్తుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇదే ఫార్ములా అవలంబిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను సంతలో పశువుల్లా బేరాలాడి కొనేస్తే చాలని లెక్కల్లో తలమునకలయ్యారు. లంచ్, డిన్నర్ పేరుతో లక్షలు ముట్టజెబుతున్నారు.
గంటా రూటే సేపరేట్
టీడీపీ పెద్దల కాళ్లా వేళ్లా బతిమాలి ఎట్టకేలకు భీమిలి టికెట్ సాధించుకున్న గంటాకు ఎన్నికలంటే డబ్బుతో గెలవడమే అనే నైజం. ప్రజలన్నా నాయకులన్నా ఆయన దృష్టిలో ఓటును, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనస్తత్వం కలవారు. రూ.500కి వెయ్యకపోవచ్చు.. రూ.వెయ్యికి వెయ్యకపోవచ్చు.. రూ.2 వేలు.. ఇలా.. ఏదో ఒక నంబర్ దగ్గర ఓటరు తనకు లొంగుతారనే విర్రవీగే మనస్తత్వంతో రాజకీయాలు చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇదే మాదిరిగా చోటా మోటా నాయకులకు సైతం వెలకడుతున్నారు. గంటా ఒక్కరే కాదు టీడీపీ నుంచి టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్క నాయకుడూ ఇదే రీతిలో ఆలోచిస్తూ రాజకీయాలి్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
విలువలు అమ్ముకుంటూ రాయ‘బేరాలు’
వెన్నుపోటు రాజకీయాలు మొదలైనప్పటి నుంచి విలువలను విడిచిపెట్టి అడ్డగోలుకు కేరాఫ్‌గా మారిపోయింది టీడీపీ. అంతా ఆ తాను ముక్కలే అన్నట్లుగా పార్టీలలో ఉన్నవారంతా కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బుతోనే ఏదైనా సాధ్యమనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు తమ ఇంటికి లేదా సమీపంలో ఉన్న ఓ హోటల్‌కి భోజనానికి ఆహ్వానించడం.. రాయ‘బేరాలు’ మాట్లాడుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. బేరం కుదిరిన వెంటనే చోటా నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు.
►చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఇటీవలే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసుకున్నారు.
►పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఓ హోటల్లో సామాజికవర్గ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులను ఆత్మీయ సమావేశం పేరిట ఆహా్వనించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ సర్పంచ్‌కు రూ.2 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు, 100 ఓట్లు ప్రభావితం చేసే సామాజికవర్గ నాయకుడికి రూ.5 లక్షలకు బేరం పెట్టేసుకున్నారు.
►పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు సైతం అదే రాయబేరాలు సాగిస్తున్నారు. ఈయన రూ.లక్ష నుంచి తన బేరాలు మొదలు పెడుతున్నారు.
►ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఇంకా అందించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి అభిప్రాయాలు సేకరిస్తుంటే.. టీడీపీ అభ్యర్థులు మాత్రం.. నేతల కొనుగోలులో బిజీబిజీగా గడుపుతున్నారు.
రూ.2 కోట్లకు డీల్..!
భీమిలి నియోజకవర్గంలో జరిగిన బేరం ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుడి మద్దతును టీడీపీ నేతలు కోరారు. అతడు ఒప్పుకోలేదు. బతిమలాడారు.. లంచ్, డిన్నర్‌కు ఆహా్వనించారు. పనవ్వలేదు. స్వయంగా వాళ్లే భోజనానికి వెళ్లారు. అర కోటి నుంచి బేరం మొదలైంది... చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే భీమిలిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షల ధర పలికింది. మరికొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు బేరాలు కుదిరినట్లు తెలిసింది. కొంతమంది మాజీ నేతలు, పలుకుబడి ఉన్న నేతలకు కూడా మరో రేటు ఫిక్స్‌చేసినట్లు సమాచారం.
సీఎం రమేష్ రాకతో పెరిగిన రేట్లు
300 మంది రౌడీ మూకలను వెంటబెట్టుకొని అనకాపల్లిలో అడుగుపెట్టిన మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ రాకతో.. ఆయా ప్రతినిధులు తమ రేట్లను అమాంతం పెంచేసుకుంటున్నారు. తమను నమ్ముకొని ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి.. తమకింత ఇస్తే చాలు.. మీ పార్టీ కండువా కప్పేసుకుంటామంటూ బేరాలాటలో మునిగితేలుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులకు అమ్ముడుపోయి.. పార్టీ కండువాలు మార్చేసుకుంటూ.. టీడీపీ పంచన చేరుతున్న నేతలను చూసి జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించామా అని అసహ్యించుకుంటున్నారు.