CM residential house
-
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అంతర్గత వ్యవహారాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చినట్లు తెలుస్తోంది. సోమవారం(మే13) ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతిమలివాల్ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కు రెండుసార్లు ఫోన్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బైభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే పోలీసు బృందం ఒకటి కాల్ వచ్చిన లొకేషన్‌కు వెళ్లి ఎంపీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సీఎం నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లేనందున ప్రవేశించలేదని సమాచారం. ‘ఢిల్లీ సివిల్ లేన్స్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం 9.34 గంటలకు ఒక మహిళ ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత కొంత సేపటికి ఎంపీ స్వాతిమలివాల్ మేడం నేరుగా పీఎస్‌కు వచ్చారు. తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా,సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఎంపీ స్వాతిమలివాల్ ఆయన నివాసానికి వెళ్లగా సీఎం వ్యక్తిగత సిబ్బంది అనుమతి నిరాకరించారని, ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు. -
AP: సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు. -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్‌లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
మాతోశ్రీని పేల్చేస్తాం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్ కలకలం రేపాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడినని చెప్పుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్స్‌తో మహారాష్ట్ర పోలీసులు సీఎం ఉద్ధవ్ నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ‘బాంద్రా కాలానగర్‌లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడు. తనెవరో చెప్పలేదు. దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం తరఫున ఫోన్ చేస్తున్నట్లు మాత్రమే చెప్పుకున్నాడు. దావూద్ సీఎం ఉద్ధవ్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని అన్నాడు. అయితే, సీఎం నివాసంలోని టెలిఫోన్ ఆపరేటర్ ఈ కాల్స్‌ను ముఖ్యమంత్రికి ఫార్వార్డ్ చేయలేదు’అని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ ఫోన్ కాల్స్ దుబాయ్ నుంచేనా మరేదైనా ప్రాంతం నుంచి వచ్చాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల విషయమై చర్చించేందుకు ఆదివారం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్..బెదిరింపు కాల్స్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఘటనపై నేర విభాగం దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తామంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ అన్నారు. -
సీఎం నివాసం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన భర్తకు ప్రమాదం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అక్కడున్న భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాలు.. యనమలకుదురుకు చెందిన వెలగపూడి సీత అనే మహిళ సోమవారం సీఎం నివాసం వద్దకు చేరుకుంది. తన భర్త అధికార టీడీపీలో క్రియాశీల నాయకుడిగా ఉండేవాడని పేర్కొంది. కొన్ని రోజుల క్రితం తన భర్తకు ప్రమాదం జరుగగా.. చికిత్స చేయించేందుకు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తెలిపింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చిన సహాయం ఏమాత్రం సరిపోలేదని.. అందుకే తన భర్తను కాపాడుకునేందుకు సహాయం చేయాల్సిందిగా ఐదు నెలలుగా సీఎం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపింది. -
సర్కారు తలుచుకుంటే అన్నీ సక్రమమే..!
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజు తలచుకుంటే దెబ్బలకు కొద వేముందన్న చందాన అధికారం చేతిలో ఉంటే అక్రమాలన్నీ సక్రమాలై పోతాయ్ మరి. ప్రభుత్వం అవలంబించే తీరు చూస్తుంటే, ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తోంది. కృష్ణా నది కరకట్ట మీదున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు సీఎం నివాస గృహంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సదరు భవనానికి అన్ని అనుమతులూ ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన చేసింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం నివాసం, అందుకు సిద్ధం చేస్తోన్న భవనం గురించి చర్చ మొదలైంది. కృష్ణానది గర్భంలో శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా కరకట్ట పక్కనే ఇరవైకి పైగా శాశ్వత భవనాలు, అతిథి గృహాల నిర్మాణాలు జరిగాయి. గతేడాది డిసెంబరు 31న నది కరకట్ట ప్రాంతంలో పర్యటించిన మంత్రి దేవినేని అక్రమ కట్టడాల సంగతి తేలుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలో నాలుగు నెలల కిందట జల వనరుల శాఖ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తరువాత తాడేపల్లి తహశీల్దార్ ద్వారా 21 మంది యజమానులకు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో లింగమనేని రమేష్‌కు చెందిన అతిథి గృహానికీ నోటీసు జారీ అయ్యింది. వీజీటీఎం ఉడా (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), రెవెన్యూ అనుమతులు లేకుండా అతిథి గృహం నిర్మించారని రెవెన్యూ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేపుడు భూ మార్పిడి పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు లభించలేదని తెలిసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. సీఎం నివాసానికి లింగమనేని అతిథి గృహాన్ని ఎంపిక చేశారు. ఆ భవనానికి అన్నీ అనుమతులూ ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఇదే సరైన సమయం.. ఇదే అదనుగా తీసుకుని కరకట్ట వెంబడి నదీ స్థలాన్ని ఆక్రమించి శాశ్వత భవనాలు నిర్మించుకున్న మిగతా వారిలో చాలా మంది తమ భవనాలను రెగ్యులరైజ్ చేయించుకునే పనుల్లో పడ్డారు. అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ నేతలతో పైరవీలు చేయిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక శాఖల అధికారులను కలుస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మున్సిపాల్టీల్లో అమలు చేస్తోన్న బీపీఎస్ పద్ధతి ప్రకారం వీటిని క్రమబద్ధీకరించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కొందరు ప్రభుత్వాన్ని కోరనున్నారని తెలిసింది.