ఢిల్లీలో ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు
వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది.
రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు.
పంజాబ్, హరియాణాల్లోనూ...
చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు.
హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్‌గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు.
కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు
ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు.
ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment