న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్ సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అంతర్గత వ్యవహారాన్ని పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చినట్లు తెలుస్తోంది.
సోమవారం(మే13) ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతిమలివాల్ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్‌కు రెండుసార్లు ఫోన్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బైభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఇంతలోనే పోలీసు బృందం ఒకటి కాల్ వచ్చిన లొకేషన్‌కు వెళ్లి ఎంపీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సీఎం నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లేనందున ప్రవేశించలేదని సమాచారం. ‘ఢిల్లీ సివిల్ లేన్స్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం 9.34 గంటలకు ఒక మహిళ ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత కొంత సేపటికి ఎంపీ స్వాతిమలివాల్ మేడం నేరుగా పీఎస్‌కు వచ్చారు. తర్వాత ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా,సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఎంపీ స్వాతిమలివాల్ ఆయన నివాసానికి వెళ్లగా సీఎం వ్యక్తిగత సిబ్బంది అనుమతి నిరాకరించారని, ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment